బస్తీలో ఉండే కుర్రాడు భళా అనిపించుకుంటున్నాడు. కూలీనాలీ చేసుకునే ఇంట్లో పుట్టి ఇంటలిజెంట్ ఫెలో అనిపించుకుంటున్నాడు. ఇతని లక్ష్యం ముందు, కార్యదీక్ష ముందు లక్షలు పోసి చదివిన వారు నీరుగారిపోయారు. తెలుగు మీడియం విధ్యార్థులకు చెమటలు పట్టించే ఇంగ్లీష్‌కే చెమటలు పట్టించాడు. హైటెక్ సిటీలో ఓ ఇరుకు బస్తీలో ఉండే ఈ అబ్బాయి పేరు నర్సింహ. తల్లిదండ్రులు కూలీ చేస్తే కానీ వారింట్లో కుండ గడవదు. చదివింది సర్కార్ బడే అయినా, ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ పిల్లలకు ధీటుగా సై అంటూ ఇంగ్లీష్‌లో పట్టు సాధించాడు.
కార్పోరేట్ విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు ప్రతి ఏటా అట్లాంటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘లెర్నేసియం ఓపెన్ వొకాబ్ కాంటెస్ట్‌లో సున్నంలేని గోడలు, తలుపులు లేని గదులు, బ్లాక్‌బోర్డులు లేని క్లాస్రూంలు ఉండే ప్రభుత్వం వారి బడిలో చదువుకునే పిల్లల్ని కూడా ఈ పోటీల్లో భాగస్వామ్యం చేయాలని ఈసారి సర్కార్ బడి పిల్లలకు అవకాశమిచ్చారు. వారితో పోటీ పడే ఛాన్స్ కొట్టేసిన నర్సింహ ఏకంగా విజేతగా నిలిచి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
అల్లిబిల్లిగా ఉండే ఆంగ్ల పదాలతో ఆడుకుని, తప్పుగా ఉన్న ఇంగ్లీష్ పదాలను కరెక్ట్ చేస్తూ అందరి కంటే ముందు నిలిచి శెహభాష్ అనిపించుకున్నాడీ మట్టిలో మాణిక్యం… మురికి వాడ నరసింహం. కార్పోరేట్ పాఠశాలల విధ్యార్థులకు ధీటుగా ల్యాప్‌ట్యాప్ మీద నిర్వాహకులు అడిగే ఇంగ్లీష్ ప్రశ్నలకు టకాటకా సమాధానాలిస్తూ ముందు వరుసలో నిలిచాడు. కార్పోరేట్ ప్రపంచాన్ని నివ్వెర పరిచిన నరసింహ అట్లాంటా ఫౌండేషన్ వారి నుంచి ప్రశంసలు, ప్రశంసా పత్రంతో పాటూ మెమొంటో, 50వేల నగదు అందుకున్నాడు. కంగ్రాట్స్ నరసింహా… సర్కార్ బడి సత్తా చూపావ్.