చత్తీస్‌గడ్‌లోని ఆ గ్రామ ప్రజలు ఇండ్లకు పింక్ రంగును వేయిస్తున్నారు… ఎందుకో తెలుసా..?

సమాజంలో మార్పు రావాలన్నా, సమాజానికి మంచి జరగాలన్నా అది సమాజంలోని వ్యక్తులందరితోనే సాధ్యమవుతుంది. అందరూ కలిసి కృషి చేస్తేనే ఏదైనా సాధించగలుగుతారు. చత్తీస్‌గఢ్‌లోని ఆ గ్రామవాసులు కూడా సరిగ్గా ఇదే పద్ధతిని అవలంబించారు. అతి తక్కువ సమయంలోనే తమ గ్రామాన్ని కాలుష్యం లేని పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు.

nanak-sagar-houses

బహిరంగ మల విసర్జన వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో అందరికీ తెలిసిందే! దీనికి తోడు అది పర్యావరణంపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే చత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో ఉన్న నానక్‌సాగర్ గ్రామవాసులు తమ గ్రామ పెద్ద సువర్దన్ ప్రధాన్, పంచాయతీ అధికారి సహకారంతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో మరుగుదొడ్లు ఉన్న ఇళ్లకు చెందిన వారు తమ తమ ఇళ్లకు పింక్ రంగును వేయాలి. దీని వల్ల ఏయే ఇండ్లలో మరుగుదొడ్లు లేవో ఇట్టే తెలిసిపోతుంది. దీంతోపాటు బహిరంగ మలవిసర్జన చేసే వారికి రూ.500 జరిమానా కూడా విధించారు. దీని వల్ల ఒక సంవత్సరం వ్యవధిలోనే గ్రామంలో ఉన్న దాదాపు 206 ఇండ్ల ప్రజలు మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. కాగా వీటన్నింటినీ వారు ప్రభుత్వం సహాయం లేకుండానే నిర్మించుకోవడం విశేషం.

నానక్‌సాగర్‌లో మొదట్లో కేవలం 25 ఇళ్లలో మాత్రమే మరుగుదొడ్లు ఉండగా ఇప్పుడు దాదాపు అన్ని ఇండ్లలోనూ మరుగుదొడ్లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఆ గ్రామం పరిశుభ్రతకు మారుపేరుగా నిలుస్తోంది. అయితే ఆ గ్రామవాసులు అంతటితో ఆగలేదు. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం గ్రామంలో మొక్కలను కూడా నాటుతున్నారు. ఇప్పుడక్కడ ప్రతి ఇంట్లోనూ కనీసం 12 మొక్కలు నాటేలా మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. నానక్‌సాగర్ గ్రామవాసులు అవలంబిస్తున్న విధానాలను అంతటా పాటిస్తే అప్పుడు దేశమంతటా ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రత నెలకొనడం ఖాయం కదూ! ఏమంటారు!

Comments

comments

Share this post

scroll to top