హిందూ వ్య‌క్తికి అదే సాంప్ర‌దాయంలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించి స్ఫూర్తిని చాటారు ఆ ముస్లింలు..!

ముస్లిం మ‌తానికి చెందిన వ్య‌క్తులు హిందూ దేవుళ్ల పేర్ల‌ను ఉచ్చ‌రించినంత మాత్రాన వారి మ‌తం మారుతుందా..? అలాగే హిందువులు ముస్లిం దేవుడి పేరు ప‌లికినంత మాత్రాన వారు ముస్లింలుగా మారుతారా..? మార‌రు. మ‌తం అనేది మ‌నం సృష్టించుకుంది. అంతేకానీ, ఏ దేవుడి పేరు ప‌లికినా చివ‌రికి ఆ మాట‌లు చేరేది దైవం వ‌ద్ద‌కే, జ‌రిగేది మంచే. దీన్ని న‌మ్మారు కాబ‌ట్టే ఆ ప్రాంతానికి చెందిన ముస్లింలు ఓ హిందూ వ్య‌క్తి అంత్య‌క్రియ‌ల‌ను అత‌ని విశ్వాసాల ప్ర‌కారం నిర్వ‌హించారు. మ‌తాల‌నేవి మ‌నం సృష్టించుకున్న‌వి, మాన‌వ‌త్వం ప్ర‌ద‌ర్శించేందుకు మ‌తంతో ప‌నిలేదు అని చాటి చెప్పారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

అత‌ని పేరు బిశ్వ‌జిత్ ర‌జ‌క్‌. వ‌య‌స్సు 35 సంవ‌త్స‌రాలు. ఉంటున్న‌ది ప‌శ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లా షేక్‌పురా గ్రామం. బిశ్వ‌జిత్‌కు తండ్రి ఉన్నాడు, త‌ల్లి చ‌నిపోయింది. పెళ్ల అయింది, భార్య‌, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే అత‌నికి లివ‌ర్ క్యాన్స‌ర్‌. ఈ క్ర‌మంలో పేద కుటుంబం కావ‌డం చేత అత‌నికి చికిత్స చేసుకునేందుకు డబ్బులు లేకుండా పోయాయి. అయితే అత‌ని స్థితి తెలుసుకున్న గ్రామంలోని తోటి నివాసితులు అత‌నికి స‌హాయం చేశారు. వారంతా ముస్లింలే. ఆ గ్రామంలో కేవ‌లం బిశ్వజిత్‌తోపాటు ఇంకో కుటుంబం మాత్ర‌మే హిందువులు. మిగిలిన అంద‌రూ ముస్లింలే. అయిన‌ప్ప‌టికీ అంద‌రూ క‌ల‌సి మెల‌సి ఉంటారు. కాగా వారు బిశ్వ‌జిత్ ప‌రిస్థితి తెలుసుకుని చందాలు పోగేసి అత‌నికి చికిత్స చేయించారు. అయిన‌ప్ప‌టికీ అత‌ను బ‌త‌క‌లేదు. ఈ నెల 24వ తేదీన మృతి చెందాడు.

దీంతో అత‌ని అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు తోటి వారు ముందుకు వ‌చ్చారు. అయితే ఆ కార్యం కోసం కూడా బిశ్వ‌జిత్ కుటుంబం వ‌ద్ద డ‌బ్బు లేదు. దీంతో మ‌ళ్లీ ఆ ముస్లింలే ఆదుకున్నారు. చందాలు పోగేసి బిశ్వ‌జిత్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. అది కూడా హిందూ విశ్వాసాల‌కు అనుగుణంగా వాటిని చేప‌ట్టారు. అత‌ని మృత‌దేహాన్ని వారు 3 కిలోమీట‌ర్ల పాటు భుజంపై మోశారు. శ్మ‌శానంలో హిందులు చేసిన‌ట్టుగానే వారు అత‌నికి అంత్య‌క్రియ‌లు చేశారు. ఈ క్ర‌మంలో వారు ప‌లు హిందూ దేవుళ్ల పేర్ల‌ను కూడా ఉచ్చ‌రించారు. అలా వారు బిశ్వ‌జిత్ అంత్య‌క్రియ‌ల‌ను పూర్తి చేసి మాన‌వ‌త‌ను చాటుకున్నారు. అంతేకాదు, హిందు, ముస్లింలు అంటే సోద‌రులే అనే భావానికి కూడా కొత్త అర్థం తెచ్చారు. వారిని మ‌నం మ‌న‌స్ఫూర్తిగా అభినందిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top