అబ్బా మ‌ళింగ దెబ్బ – బెంగళూరుకు ముంబై

ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విరాట్ కొహ్లి క‌థ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. వ‌రుస‌గా అప‌జ‌యాల‌ను మూట‌గ‌ట్టుకుని కేవ‌లం ఒక్క మ్యాచ్ విన్నింగ్‌తో ఊపిరి పీల్చుకున్న బెంగ‌ళూరు జ‌ట్టుకు మ‌ళ్లీ దెబ్బ ప‌డింది.ముంబై జ‌ట్టుతో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బోల్తా ప‌డింది. ప్రారంభంలోనే డికాక్..ఆఖ‌రులో హార్దిక్ పాండ్యా..అద్భుతంగా ఆడ‌డంతో ఆ జ‌ట్టు సునాయ‌సంగా గెలుపొందింది. రాయ‌ల్ ఛాలంజ‌ర్స్ బెంగ‌ళూరు బౌల‌ర్లు మొద‌ట్లో ఆశ‌లు పెంచినా..చివ‌ర్లో చ‌తికిల‌ప‌డ్డారు. ఈ టోర్నీలో ముచ్చ‌ట‌గా ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే..ఒక్క మ్యాచ్ విజ‌యంతో స‌రిపెట్టుకుంది కోహ్లి సేన‌. దీంతో ప్లే ఆఫ్ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి.

26 బంతులు మాత్ర‌మే ఆడిన డికాక్ 5 ఫోర్లు రెండు భారీ సిక్స‌ర్ల‌తో 40 ప‌రుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా మ‌రోసారి త‌న బ్యాటింగ్ ప‌వ‌ర్ ఏమిటో ఫ్యాన్స్ కు చూపించాడు. కేవ‌లం 16 బంతులు మాత్ర‌మే ఆడిన పాండ్యా 5 ఫోర్లు ..2 సిక్స‌ర్ల‌తో 37 ప‌రుగులు చేసి ముప్పు తిప్ప‌లు పెట్టాడు. ముందుగా బ్యాటింగ్‌కు చెందిన బెంగ‌ళూరు జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 171 ప‌రుగులు చేసింది. డివిలియ‌ర్స్ 51 బంతులు ఆడి ఆరు ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో 75 ప‌రుగులు చేస్తే..మొయిన్ ఆలీ 32 బంతులు ఆడి ఒక ఫోర్ 5 సిక్స‌ర్ల‌తో అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించారు. ఇద్ద‌రూ అర్ధ సెంచ‌రీలు సాధించ‌డంతో బెంగ‌ళూరు జ‌ట్టు మెరుగైన స్కోర్ చేసింది. ముంబై జ‌ట్టులో మ‌ళింగ త‌న బౌలింగ్ ప‌వ‌ర్ ఏమిటో మ‌రోసారి టోర్నీలో ప్ర‌ద‌ర్శించాడు.

నాలుగు కీల‌క‌మైన వికెట్లు తీశాడు. చాహ‌ల్, ఆలీకి రెండు వికెట్లు ద‌క్క‌గా ..జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన మ‌ళింగ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపిక‌య్యాడు. బెంగ‌ళూరు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేసే ప‌నిలో మైదానంలోకి దిగిన ముంబ‌యి జ‌ట్టు..ఓపెన‌ర్లు డికాక్, రోహిత్ బౌండ‌రీల‌తో శుభారంభం చేశారు. తొలి ఓవ‌ర్ లోనే రెండు ఫోర్లు కొట్టిన డికాక్ ..ఉమేష్ యాద‌వ్ వేసిన మూడో ఓవ‌ర్ లో రెండు ఫోర్లు..ఒక భారీ సిక్స‌ర్ బాదాడు. రోహిత్ కూడా సిరాజ్ వేసిన ఓవ‌ర్‌లో ఫోర్, సిక్స‌ర్ కొట్టాడు. ఆరో ఓవ‌ర్ లో రోహిత్ ఫోర్, డికాక్ సిక్స‌ర్ సాధించ‌డంతో జ‌ట్టు 67 ప‌రుగులు సాధించింది. ప్ర‌మాద‌క‌రంగా మారిన ఈ జోడిని ఆలీ అద్భుత బంతితో బ్రేక్ చేశాడు. రోహిత్‌ను బౌల్డ్ చేయ‌డంతో డికాక్ ఎల్బీకి అవుట‌య్యాడు.

దీంతో ముంబై ఒక్క‌సారిగా ఒత్తిడికి లోనైంది. కానీ ఆ స‌మ‌యంలో బ‌రిలోకి దిగిన ఇషాన్ వ‌చ్చీ రాగానే మూడు సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. చాహ‌ల్ బౌలింగ్‌లో స్టంప‌య్యాడు. 12 నుండి 16 ఓవ‌ర్ల మ‌ధ్య‌న ప‌రుగులు చేసేందుకు ముంబై ఆట‌గాళ్లు ఇబ్బంది ప‌డ్డారు. సూర్య‌కుమార్ భారీ షాట్ కోసం ప్ర‌య‌త్నించి వెనుదిరిగాడు. ఆఖ‌రులో 12 బంతులలో 22 ప‌రుగులు చేయాల్సి వ‌చ్చింది. మ‌రోసారి ఉత్కంఠ రేపింది ఈ మ్యాచ్. నేగి వేసిన 19వ ఓవ‌ర్ లో హ‌ర్దీక్ పాండ్యా రెచ్చి పోయాడు. రెండు సిక్స‌ర్లు, రెండు ఫోర్లు బాద‌డంతో ఆ ఓవ‌ర్‌లోనే 22 ప‌రుగులు వ‌చ్చాయి. ముంబ‌యి అవ‌లీల‌గా విజ‌యం సాధించింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగ‌ళూరు మూడో ఓవ‌ర్ లోనే కెప్టెన్ కోహ్లి 8 ప‌రుగుల‌కే అవుట‌య్యాడు. డివిలియ‌ర్స్, ఆలీలు ఇద్ద‌రూ మ‌రో వికెట్ కోల్పోకుండా ప‌రుగులు చేశారు. మొత్తం మీద ఏడో ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది బెంగ‌ళూరు జ‌ట్టు.

Comments

comments

Share this post

scroll to top