ముఖేష్ అంబానీ కంపెనీకి రూ.1767 కోట్ల టాక్స్ బెనిఫిట్స్ క‌ల్పించిన ఐటీ..!?

పేద‌, సామాన్య, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించే ప‌థ‌కాల్లో, వ‌చ్చే నిధుల్లో కోత పెట్టే ప్ర‌భుత్వాలు బ‌డాబాబుల విష‌యంలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంటాయి. ఆ ప‌న్ను, ఈ పన్ను… అంటూ సామాన్యుల నుంచి డ‌బ్బులు ముక్కు పిండి వ‌సూలు చేస్తాయి. కానీ బ‌డాబాబుల‌కు మాత్రం అదే పన్నుల్లో రాయితీల‌ను, డిస్కౌంట్ల‌ను కల్పిస్తాయి. ఇదేమ‌ని అడిగితే దానికి ఒక పేరు ఉండ‌నే ఉందిగా. టాక్స్ డిడ‌క్ష‌న్ బెనిఫిట్ అని. దాని కింద వేల కోట్లను మ‌ళ్లీ వెన‌క్కి ఇస్తాయి. ఇది మేం చెబుతోంది కాదు, సాక్షాత్తూ కాగ్ తేల్చి చెబుతున్న వాస్త‌వాలు. అందుకు పార్ల‌మెంట్‌లో తాజాగా చ‌ర్చ‌కు వ‌చ్చిన ఓ అంశ‌మే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.

cag-reliance

ముఖేష్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ గ్రూప్‌లో రిల‌య‌న్స్ పోర్ట్స్ అండ్ టెర్మిన‌ల్స్ లిమిటెడ్ ఓ భాగం. అయితే ఈ కంపెనీకి రూ.1,767 కోట్ల టాక్స్ బెనిఫిట్స్ ను ఇన్‌క‌మ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ క‌ల్పించింది. అది ఎందుకయ్యా అంటే… ఆ కంపెనీ గుజ‌రాత్ లోని పోర్ట్ సిక్కాలో ఉన్న పోర్టు ఏరియాలో నిర్మించిన చిన్న‌పాటి జెట్టీ (రేవుకి రక్షణ కల్పించటానికి ఒడ్డు నుంచి సముద్రంలోనికి నిర్మించబడిన గోడను జెట్టీ అంటారు. దీని చుట్టూ చిన్న పాటి బోట్‌లు, ప‌డ‌వలు ఆగేందుకు అవ‌కాశం ఉంటుంది.)లకు గాను స‌ద‌రు టాక్స్ బెనిఫిట్‌ను పొంద‌నుంది. అంటే, వారు క‌ట్టిన టాక్స్‌లోంచి అంత మొత్తం వెన‌క్కి వ‌చ్చేస్తుంది అన్నమాట‌. మ‌రి టాక్స్ బెనిఫిట్స్ ఎందుకు క‌ల్పిస్తున్నారు అంటే, ఇన్‌క‌మ్ టాక్స్ యాక్ట్ 1961 యూ/ ఎస్ 80-ఐఏ ప్ర‌కారం ప‌బ్లిక్‌కు ఉప‌యోగ‌ప‌డే స‌దుపాయాలు క‌ల్పిస్తే టాక్స్ బెనిఫిట్స్ పొంద‌వ‌చ్చ‌ని ఉంది. అందులో భాగంగానే జెట్టీలు నిర్మించినందుకు రిల‌య‌న్స్ గ్రూప్‌కు స‌ద‌రు టాక్స్ బెనిఫిట్ అందింది.

అయితే ఈ విష‌యంపై కాగ్ (కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌రల్ ఆఫ్ ఇండియా) జోక్యం చేసుకుని అలాంటి స‌దుపాయాల‌కు టాక్స్ బెనిఫిట్స్ ఎలా క‌ల్పిస్తార‌ని ఇన్‌క‌మ్ టాక్స్ అధికారుల‌ను ప్ర‌శ్నించింది. ఇది చాల అసంబ‌ద్ద‌మైంద‌ని, అక్ర‌మ మార్గంలో స‌ద‌రు కంపెనీకి లాభం చేకూర్చే ప‌నే అని త‌ప్పు ప‌ట్టింది. దీనిపై ఇన్‌క‌మ్‌టాక్స్ అధికారులు ఇచ్చిన వివ‌ర‌ణ ఏంటంటే… పైన చెప్పాం క‌దా… ఇన్‌క‌మ్ టాక్స్ యాక్ట్ 1961 ప్ర‌కారం ప‌బ్లిక్‌కు ఉప‌యోగ‌ప‌డే స‌దుపాయాలు క‌ల్పిస్తే ఆ కంపెనీకి టాక్స్ బెనిఫిట్స్ వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. కానీ ఆ స‌దుపాయాలు నిజానికి ప‌బ్లిక్ కోసం మాత్రం కాద‌ట‌. రిల‌య‌న్స్ తన సొంత అవ‌స‌రాల కోస‌మే స‌ద‌రు జెట్టీల‌ను నిర్మించుకుంద‌ని తెలుస్తోంది. అయితే కాగ్ మాత్రం దీన్ని విడిచి పెట్ట‌లేదు. ప‌బ్లిక్ స‌దుపాయం కోసం జెట్టీల‌ను నిర్మిస్తే రిల‌య‌న్స్ కాకుండా ఇంకా ఎవ‌రెవ‌రు వాటిని వాడుకుంటున్నారో తెలియ‌జేయాల‌ని ఇన్‌క‌మ్ టాక్స్ అధికారుల‌కు ఆదేశించింది. అయితే నిజానికి ఆ జెట్టీలను రిల‌య‌న్స్ మాత్ర‌మే వాడుకుంటుందిగా, మ‌రి ఇన్‌క‌మ్ టాక్స్ అధికారులు రిల‌య‌న్స్ కాకుండా ఇంకెవ‌రెవ‌రి పేర్లను ఇస్తారో..? ఏమో… ఏమైనా చేయొచ్చు..! ఎంతైనా ఐటీ అధికారులు క‌దా..! ఏది ఏమైనా ప్ర‌భుత్వాలు మాత్రం బ‌డాబాబుల‌కు కొమ్ము కాస్తున్నాయ‌న‌డంలో ఇంత‌కు మించిన మ‌రో ఉదాహ‌ర‌ణ ఇంకేముంటుంది..!

Comments

comments

Share this post

scroll to top