VVIP చెట్టు.. ఈ ఒక్క చెట్టు సంర‌క్ష‌ణ‌కు ఏడాదికి 12 లక్ష‌ల ఖ‌ర్చు.!

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఒక్క చెట్టు కోసం వారు ఏడాదికి రూ.12 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖర్చు పెడుతున్నారు. ఎంత షాకింగ్‌గా ఉన్న ఇది నిజ‌మే. అయితే అది చాలా అరుదుగా పెరిగే చెట్టా అంటే.. ఉహు.. కాదు. దానికి ఏమైనా దివ్య శ‌క్తులు ఉన్నాయా అంటే.. కాదు. దాంట్లో మెడిసిన్ ప‌రంగా ఏవైనా అద్భుత ఔష‌ధ గుణాలు ఉన్నాయా అంటే.. అదీ కాదు. మ‌రెందుకు ఆ చెట్టు కోసం ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏడాదికి రూ.12 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తోంది..? అని అడ‌గ‌బోతున్నారు క‌దా..! అయితే దాని గురించే చెబుతున్నాం వినండి..! అది మామూలు చెట్టు కాదు.. వీవీఐపీ చెట్టు. అందుకే దానికి అంత‌టి స్పెష‌ల్ ట్రీట్‌మెంట్ ల‌భిస్తోంది. ఇంత‌కీ అదెక్క‌డుందంటే…

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో యునెస్కో వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందిన సాంచి బుద్ధిస్ట్ కాంప్లెక్స్‌కు ఐదు కిలోమీట‌ర్ల దూరంలో ఉందీ వీవీఐపీ చెట్టు. ఈ చెట్టు బాగోగులు చూసుకోవ‌డానికి న‌లుగురు హోంగార్డులు కూడా ఉన్నారు. వీళ్లు 24 గంట‌లూ ఆ చెట్టు ద‌గ్గ‌రే ఉంటారు. దీనిని ఐదేళ్ల కింద‌ట 2012లో అప్ప‌టి శ్రీలంక అధ్యక్షుడు మ‌హింద రాజ‌ప‌క్స ఇక్క‌డ నాటారు. ఆ రావి మొక్క‌ను ఆయ‌న శ్రీలంక‌ నుంచే తీసుకొచ్చారు. దీనికి నీరందించ‌డానికి ప్ర‌త్యేకంగా ఓ వాట‌ర్ ట్యాంకే ఉంది. ఇక ప్ర‌తి వారం దీని ఆరోగ్యం ఎలా ఉందో చూడ‌టానికి మ‌ధ్యప్ర‌దేశ్ అగ్రిక‌ల్చ‌ర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఓ బొటానిస్ట్ వ‌స్తుంటారు. ఇప్పుడీ చెట్టు ఏపుగా పెరిగింది. కాగా దీని సంర‌క్ష‌ణ కోసం మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏటా రూ.12 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తోంది.

ఇంతకీ ఈ చెట్టుకు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారో తెలుసా? ఇదే విష‌యాన్ని సాంచిలోని మ‌హాబోధి సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన భాంటె చంద‌ర‌త‌న్ వివ‌రిస్తున్నారు. బుద్ధుడు జ్ఞానోద‌యం పొందిన బోధి చెట్టు కొమ్మ‌ను క్రీస్తుపూర్వం మూడో శ‌తాబ్దంలో ఇండియా నుంచి శ్రీలంక‌కు తీసుకెళ్లి అక్క‌డి అనురాధ‌పుర‌లో నాటారని ఆయ‌న వెల్ల‌డించారు. అదే చెట్టులోని కొమ్మ‌నే ఇక్క‌డ అప్ప‌ట్లో నాటారు. అయితే ఈ చెట్టుకు ఇంత ప్రాధాన్యం ఇస్తుండ‌టంపై కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఈ మ‌ధ్యే 51 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న నేప‌థ్యంలో చెట్టు కోసం ఇంత ఖ‌ర్చు, వ‌న‌రుల‌ను వాడ‌టం ఏంట‌ని చాలా మంది ప్ర‌శ్నిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చెట్టు సంర‌క్ష‌ణ కోసం ఏటా రూ.12 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసే బ‌దులు ఆ మొత్తాన్ని పేద రైతుల కోసం వాడితే బాగుంటుంద‌ని ప‌లువురు హిత‌వు ప‌లుకుతున్నారు. కాగా గ‌తంలో ఈ చెట్టును చూసేందుకు ప‌ర్యాట‌కులు కూడా వ‌చ్చేవార‌ట‌. కానీ ఇప్పుడు వారి సంఖ్య బాగా త‌గ్గింద‌ని ఆ చెట్టుకు కాప‌లా ఉండే హోం గార్డులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వీవీఐపీ చెట్టు విష‌యం ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top