శరీరంలో ఏ భాగం వద్దనైనా గాయం అయితే… లేదంటే వాపు, నొప్పి ఉంటే అక్కడ మసాజ్ చేసుకుంటాం. దీంతో నొప్పి పోతుంది, కాబట్టి మనం అలా మసాజ్ చేస్తాం. అయితే తన కుమారుడికి అయన గాయానికి కూడా అలాగే ఆ తల్లి మసాజ్ చేసింది. దీని వల్ల నొప్పి పోయి తన కొడుకు కోలుకుంటాడని ఆ తల్లి భావించింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ మసాజ్ వికటించింది. ఈ క్రమంలో ఆ యువకుడు మసాజ్ చేసిన కొద్ది సేపటికే కుప్పకూలాడు. అనంతరం అతన్ని హాస్పిటల్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. అతను మృతి చెందాడు..! ఈ సంఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటు చేసుకుంది.
బ్యాడ్మింటన్ ఆడుతూ తన ఎడమ కాలి మడమకు గాయం చేసుకున్నాడు 23 ఏళ్ల ఓ యువకుడు. దీంతో అతని తల్లి అరగంట పాటు మసాజ్ చేసింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో రక్తం గడ్డ కట్టింది. అది కాస్తా కాలి నుంచి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే రక్తనాళానికి చేరింది. అయితే మసాజ్ అనంతరం తన ఎడమ కాలి పిక్కలో నొప్పిగా ఉందని ఆ యువకుడు చెప్పాడు. అలా చెప్పీ చెప్పగానే వెంటనే కుప్పకూలాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ సంఘటన ఢిల్లీలో గతేడాది అక్టోబర్ 31న జరిగింది. కాగా ఇటీవలే పబ్లిష్ అయిన ఓ మెడికల్ జర్నల్‌లో ఆ యువకుడి కేసును ప్రచురించారు. ఈ క్రమంలో అతని వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆ యువకుడి కాలిలో 5 సెంటీ మీటర్ల మేర రక్తం గడ్డ కట్టిందట. అది కాస్తా రక్త నాళం ద్వారా ఊపిరి తిత్తులకు చేరి స్పృహ కోల్పోవడంతో అతను చనిపోయాడట. అతన్ని పోస్ట్‌మార్టమ్ చేసిన వైద్యులు ఆ విషయం చెప్పారు. సరైన అవగాహన లేకుండా చాలా బలంగా కాలిపై మసాజ్ చేయడం వల్లే అలా జరిగిందని వైద్యులు తెలిపారు. తెలిసీ తెలియకుండా మసాజ్ చేస్తే ఇలా రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉంటుదని, తద్వారా ప్రాణాపాయ స్థితులు సంభవిస్తాయని వారు చెప్పారు..!