”ఎప్పటిలాగే ఆ రోజున కూడా నా పాపను తీసుకొచ్చేందుకు ప్లే స్కూల్‌కు వెళ్లా. అక్కడ ఉన్న చిన్నారులను చూస్తే ముచ్చటేసింది. వారి ముద్దు ముద్దు మాటలు, చిలిపి చేష్టలు చూస్తూ ముందుకెళ్లా. పాప కోసం చూస్తున్నా. ఇంతలో ఆ ప్లే స్కూల్లో పనిచేసే టీచర్ ఒకామె వచ్చింది. వస్తూనే నాతో ఓ మాట అన్నది. షెఫాలీ.. మీ పాప గురించి మీతో కొంత మాట్లాడాలి.. అంది. నాకేమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా ఆశ్చర్యం, షాక్ రెండూ కలిగాయి. ఇంతలోనే మళ్లీ ఆ టీచర్ కల్పించుకుని మాట్లాడింది.
మా ప్లే స్కూల్లో ఓ 4, 5 మంది పిల్లలు రోజంతా ఏడుస్తూనే ఉన్నారు. వారిని ఎంత సముదాయించినా వినలేదు. ఇంటికి వెళ్తామని అదే పనిగా వారు ఏడుస్తూనే ఉన్నారు. అప్పుడు మీ పాప ఏం చేసిందో తెలుసా..?.. అని ఆమె అనడంతో నాకు మరోసారి షాక్ తగిలినట్టయింది. ఏదైనా తప్పు చేయలేదు కదా..? అని అనుకుంటూ… ఏమిటి.? నా పాప ఏం చేసింది..? అని అడిగా. అందుకు ఆ టీచర్ బదులిస్తూ… మీ పాప అలా ఏడుస్తున్న పిల్లల దగ్గరికి వెళ్లి వారికి మాటలు చెప్పింది.
ఏడుస్తున్న పిల్లలను కౌగిలించుకుటూ ఆమె వారికి ధైర్యం చెప్పింది. ఏడవకండి, టీచర్ మనల్ని ఏమీ చేయదు, ఆడుకునేందుకు బొమ్మలు కావాలా..? అంటూ అందరు పిల్లలతో చాలా సరదాగా గడిపింది. అందరికీ ధైర్యం చెప్పింది. అలా మీ పాపను చూసేసరికి ఆశ్చర్యం అనిపించింది. పిల్లల కన్నీళ్లు తుడుస్తూ మీ పాప ప్రవర్తించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. నిజంగా మీ పాప అంత లవ్లీ కిడ్‌ను నేను ఎక్కడా చూడలేదు. అని టీచర్ ముగించింది. అలా ఆమె చెప్పే సరికి నా పెదవులపై చిరునవ్వు వచ్చేసింది. ఆ సమయంలో నేను ఎంత సంతోష పడ్డానో నాకే తెలియదు..!”
— ముంబైకి చెందిన కొరియోగ్రాఫర్ షెఫాలీ నాయుడు తన పాప విషయంలో తనకు ఎదురైన ఓ మధురమైన సంఘటనను సోషల్ ఖాతాలో షేర్ చేసింది. ఆ పోస్టే ఇది..!