నేటి తరుణంలో సైబర్ నేరగాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో అందరికీ తెలిసిందే. జనాల బ్యాంకుల్లో ఉండే డబ్బులు దోచుకోవడమే లక్ష్యంగా వారు పనిచేస్తున్నారు. ఓ వైపు బ్యాంకులు, పోలీసులు క్రెడిట్, డెబిట్ కార్డులు, అకౌంట్ల సమాచారం, సీవీవీ నంబర్లు, ఓటీపీ నంబర్లు తదితర సమాచారాన్ని ఇతరులకు చెప్పరాదు, వారితో ఆ సమాచారం షేర్ చేసుకోరాదు అని చెబుతున్నా జనాల్లో ఇంకా చైతన్యం రావడం లేదు. దీంతో వారు అలాంటి సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా ఓ గృహిణి కూడా ఓ సైబర్ మోసం బారిన పడి ఏకంగా రూ.75వేలను కోల్పోయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
ఆమె పేరు రంజనీ మీనన్. వయస్సు 37 సంవత్సరాలు. ఉంటున్నది ముంబైలోని అన్ టాప్ హిల్ అనే ప్రదేశంలో. ఈమె ఈ మధ్యే ఆన్లైన్లో ఓ జాబ్ పోర్టల్‌లో తన రెజ్యూమ్‌ను అప్లోడ్ చేసి జాబ్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే సదరు పోర్టల్‌లో పనిచేసే ప్రియా శర్మ అనే మహిళ రంజనీ మీనన్‌కు కాల్ చేసింది. ఆమె జాబ్‌కు ఎంపికైందని, అయితే రెజ్యూమ్‌ను అప్లోడ్ చేసి ప్రాసెస్ చేసేందుకు రూ.10 ఖర్చు అవుతుందని చెప్పగా రంజనీ అది నిజమే అని నమ్మి రూ.10 చెల్లించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా రంజనీ తన ఎస్బీఐ క్రెడిట్ కార్డును మొదట వాడింది. దాంతో చెల్లింపు జరగలేదు. తరువాత కెనరా బ్యాంక్ డెబిట్ కార్డుతో రూ.10 చెల్లించాలని రంజనీ చూసింది. కానీ అది కూడా వీలు కాలేదు.
దీంతో రంజనీ తన కార్డుల వివరాలను ప్రియా శర్మకు చెప్పింది. దీంతో ఆమె రూ.10 చెల్లిస్తున్నానని చెప్పి రంజనీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పమని అడిగింది. రంజనీ తన మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ప్రియా శర్మకు చెప్పింది. అంతే.. క్షణాల్లోనే రంజనీ అకౌంట్ నుంచి రూ.75వేలు మాయమయ్యాయి. దీంతో ఆమె ఈ విషయాన్ని తన భర్తకు చెప్పగా అతను వెంటనే సదరు కార్డులు రెండింటినీ బ్లాక్ చేశాడు. అనంతరం విషయంపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చూశారు కదా.. ఎంత పని జరిగిందో. కాబట్టి మీరు కూడా ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీకు కూడా ఇలాగే జరగవచ్చు..!