నేటి తరుణంలో చేతిలో స్మార్ట్ఫోన్లు ఉన్న చాలా మంది ఎప్పుడూ సెల్ఫీలు తీసుకుంటూ అదే పనిగా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. కొందరికైతే నిజంగా సెల్ఫీ అంటే చాలా పిచ్చి. అలాంటి వారు నిమిషానికొక సెల్ఫీ తీసుకుంటూ టైం పాస్ చేస్తుంటారు. అయితే అన్ని సందర్భాల్లో సెల్ఫీ తీసుకుంటే ఏమోగానీ కొన్ని చోట్ల మాత్రం ఇలాంటి పనులు చేయరాదు. చేస్తే ఏమవుతుందో తెలుసా..? అదిగో ఆ యువకుడిలా కట కటాల పాలు కావల్సి వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
అతని పేరు శశికుమార్. ఉంటున్నది చెన్నైలోని వీఎమ్ స్ట్రీట్‌లో. దర్గా వీధిలో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి ఈ మధ్యే వెళ్లాడు. ఆ ఇంటి టెర్రస్‌పైకి వెళ్లిన శశికుమార్ అక్కడ కుండీల్లో ఉన్న రకరకాల పూలమొక్కలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. దీంతో వాటితో అతనికి సెల్పీ దిగాలనిపించింది. మరిక ఊరుకుంటాడా.. వెంటనే ఎడా పెడా సెల్ఫీలు దిగాడు. తనకు కనబడిన ప్రతి ఒక్క మొక్కతో ఫొటో దిగాడు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అలా శశికుమార్ తన ఫ్రెండ్ ఇంటిపై ఉన్న మొక్కలతో సెల్ఫీలు దిగి షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఆ క్రమంలో ఆ ఫొటోలు పోలీసులకు చేరాయి. దీంతో వారు ఆరా తీశారు. శశికుమార్ లొకేషన్‌ను ట్రేస్ చేసి అతన్ని అరెస్టు చేశారు. దీంతో షాక్ అవడం శశికుమార్ వంతైంది. ఎందుకంటే శశికుమార్ దిగిన పూల మొక్కల ఫొటోల్లో కొన్ని గంజాయి మొక్కలు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు శశికుమార్‌ను అరెస్ట్ చేశారు. ఇక ఇతని ఫ్రెండ్స్ అయిన కమల్, మూర్తి అనే వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఈ ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చూశారుగా.. మొక్కలతో సెల్ఫీలు దిగితే ఎంత పని జరిగిందో.. కనుక ఎవరైనా సెల్ఫీ దిగే ముందు తాము ఉన్న ప్రదేశాన్ని ఒకసారి చూసుకుని మరీ దిగితే బెటర్. లేదంటే ఇలా జైలు పాలు కావల్సి వస్తుంది.