ఏ రంగంలో అయినా వారసత్వం అనేది కామన్. అంటే.. సినీ నటుడు వారసులు సినిమాల్లో రాణిస్తారు. వ్యాపార వేత్తల సంతానం ఆ రంగంలో ఉంటారు. ఇక రాజకీయ నాయకుల పుత్ర రత్నాలు కూడా రాజకీయాల్లోనే ఉంటారు. కానీ దాదాపుగా వేరే రంగాన్ని ఎంచుకోవడం అరుదు. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే ఆ ఎమ్మెల్యే కుమారుడు మాత్రం అలా కాదు, తండ్రిలా రాజకీయాల్లోకి రాలేదు. మరి ఏం చేశాడు అనే కదా మీ డౌట్..? ఏమీ లేదు.. సింపుల్‌గా ప్యూన్ అయ్యాడు. అవును, షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే..!
రాజస్థాన్‌లోని జామ్వా రామ్ ఘర్ బీజేపీ ఎమ్మెల్యే జగదీష్ నారాయణ్ మీనా కుమారుడు రామ్ కిషన్. ఇతను చదివింది మెట్రిక్యులేషన్. దీంతో ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్యూన్ (గ్రేడ్ 4) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. మొత్తం 18 పోస్టులు పడగా అందుకు గాను 18వేల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో రామ్ కిషన్ కూడా ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. అనంతరం ఇంటర్వ్యూకు అతను హాజరయ్యాడు. అంతే.. ప్యూన్ ఉద్యోగం వరించింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే మీనా స్వయంగా చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. అవును నిజంగా సంతోషించాల్సిన విషయమే. అయినప్పటికీ ఎమ్మెల్యే కుమారుడు రాజకీయాలలోకి రాకుండా అలా గ్రేడ్ 4 ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడం నిజంగా షాకింగ్ విషయమే.
అయితే రామ్ కిషన్ ప్యూన్ ఉద్యోగానికి సెలెక్ట్ అవడం ఏమోగానీ ఇప్పుడు ప్రతి పక్ష పార్టీ సభ్యులు ఈ విషయంపై విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కనుక తన కొడుక్కి ఎమ్మెల్యే మీనా ఉద్యోగం వచ్చేలా చేశారని అంటున్నారు. కానీ దీనిపై ఎమ్మెల్యే మీనా స్పందిస్తూ.. తన కొడుకు మెట్రిక్యులేషన్ వరకే చదివాడని, ఈ ఉద్యోగం అతనికి సరిపోతుందని, అందుకే దరఖాస్తు చేసుకున్నాడని చెప్పారు. అందరూ అటెండ్ అయినట్టుగానే తన కొడుకు కూడా ఇంటర్వ్యూకు అటెండ్ అయి ఉద్యోగం సాధించాడని, ఇందులో ఎలాంటి పైరవీలు లేవని అన్నారు. అయితే.. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు మాత్రం సీరియస్‌గానే తీసుకుంటున్నాయి. ఇక మరి ఈ రచ్చ ఎంత వరకు దారి తీస్తుందో వేచి చూస్తే తెలుస్తుంది..!