మిషన్ చాణక్య ఇదేదో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం అని అనుకుంటున్నారా..అయితే పప్పులో కాలేసినట్టే. జగమెరిగిన జర్నలిస్టు శివకేశవ్ అముక సి.ఇ.ఓ.గా ఉన్న మిషన్ చాణక్య ఓ సర్వే సంస్థ. దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన జాతీయ, రాష్ట్ర న్యూస్ ఛానల్స్, సంస్థలు, దినపత్రికలు , యాజమాన్యాలు గులాబీ బాస్‌ను , టీఆర్ ఎస్ స్ట్రాటజీని , ప్లాన్స్‌ను , వ్యూహాలను అంచనా వేయడంలో ఘోరంగా వైఫల్యం చెందాయి. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు ..అడ్డగోలుగా అంకెలు..సంకెలు ప్రకటించారు. సర్కార్ మెప్పు పొందేందుకు ఆహా..ఓహో అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. నేషనల్ స్థాయిలో అంతో కొంతో వ్యూవర్స్‌కు నమ్మకం కలిగిన ఎన్డీటీవీ, స్టార్, సహారా, ఇండియా టుడే, టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ , ఆజ్ తక్..ఇలా ప్రతి ఛానల్ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పనితీరును సమగ్రంగా విశ్లేషించ లేక చతికిలపడ్డాయి.
తెలంగాణ అంటేనే చైతన్యం. దీనిని అర్థం చేసుకోవాలంటే..జనంతో మమేకం కావాలి. పోరాటాలకు, ఆరాటాలకు, ఆవేదనకు, ఆందోళనలకు, ఆత్మ బలిదానాలకు, త్యాగాలకు ఈ మట్టి పెట్టింది పేరు. మోసం చేసినా..దోపిడీకి గురి చేసినా..ఉన్న ఊరు నుండి వెళ్లగొట్టినా..కులాలతో చీల్చినా..వర్గాల పేరుతో ప్రలోభాలకు గురి చేసినా..ఇక్కడి ప్రజలు నమ్మరు. వీరిలో కొద్ది మంది లొంగి వున్నా అత్యధిక శాతం కడుపులు కాలినా సరే..ఆత్మ గౌరవాన్ని కోల్పోరు. ఇది ఇప్పటి చరిత్ర కాదు..కొన్నేళ్లుగా..కొన్ని తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తిత్వం. 14 ఏళ్ల పోరాటం ప్రపంచానికే పాఠం. దానిని అప్పుడే మరిచిపోతే ఎలా. అవసరమైతే బాంచన్ దొరా..అని వేడుకుంటరు తప్ప తమపై ఇంకొకరి పెత్తనాన్ని సహించరు. దానిని ప్రతిపక్షాలు .విపక్షాలు అర్థం చేసుకోలేక పోయాయి. సార్వత్రిక ఎన్నికల్లో కోలుకోలేకుండా చేశారు ఇక్కడి ప్రజలు. తెలంగాణను కేసీఆర్ అర్థం చేసుకున్నంతగా ఏ పార్టీ..ఏ నాయకుడు చేసుకోలేక పోయారు. ప్రజల భావోద్వేగాలతో ఆటాడుకోవడం..వారికి ఏం కావాలో తెలుసు కోవడం..వారి ఇళ్లల్లో ఒకడుగా ఉండడం గులాబీ అధిపతికే చెల్లింది. ఇదంతా తెలంగాణ గాంధీ దివంగత జయంకర్ సారు నుండి కేసీఆర్ నేర్చుకున్నాడు. పరిపాలించడం అందరికీ చేతనవుతుంది..కానీ కేసీఆర్‌కు తెలిసినంతగా ఏ నాయకుడికి ఈ దేశంలో లేదనే చెప్పాలి. గులాబీ దళం తిరిగి అధికారంలోకి వస్తుందని..తప్పకుండా ఈ ఎన్నికల్లో 86 సీట్లు వస్తాయని హైదరాబాద్‌కు చెందిన మిషన్ చాణక్య సంస్థ కుండ బద్దలు కొట్టింది. ఈ విషయాన్ని అధికార పార్టీ నేతలు, అధిపతులు నమ్మలేదు. విశ్వసించలేదు. కానీ ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం విస్మయానికి గురయ్యారు. వీరందించిన ముందస్తు వివరాలు చూసి.
నిన్న మిషన్ చాణక్య సిఇఓ శివకేశవ్ కర్ణాటకలో రంగుల రాట్నం అంటూ పేర్కొన్న సర్వే వివరాలు 100 శాతం కరెక్ట్ అయ్యాయి. అక్కడ హంగ్ ఏర్పడుతుందని..శివకుమార్ కీలకంగా వ్యవహరిస్తారని..కాంగ్రెస్ పార్టీ సపోర్ట్‌తో దేవగౌడ పార్టీ పవర్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అక్కడి వారు మిషన్ చాణక్య సర్వే చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత సంస్థ విశ్వసనీయతను ..నిబద్ధతను చూసి ప్రశంసించారు. ఇదే సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణను ఎంచుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ..తన పనితీరుకు..నాలుగున్నర ఏళ్ల పాలనకు గీటురాయిగా మారిన సార్వత్రిక ఎన్నికల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని..సర్కార్ ఏర్పాటు ఖాయమంటూ ఆ సంస్థ సి.ఇ.ఓ. శివకేశవ్ స్పష్టం చేశారు. గత 6 నెలల కాలం నుండే తెలంగాణలోని ప్రతి నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు. సుశిక్షుతులైన సిబ్బంది, అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్టులు, మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్..ఎక్స్పర్ట్స్, ఎనలిస్టులు..స్టాటిస్టిక్స్ ఇలా వందలాది మందితో మిషన్ చాణక్య సమన్వయం చేసుకుంటూ సర్వేలు చేపట్టింది.
2,00,000 మంది జనాన్ని సర్వేలో భాగంగా కలిసింది. వారి అభిప్రాయాలను సేకరించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ర్యాండం సర్వేను చేపట్టింది. ఆసక్తికరమైన వాస్తవాలను వెల్లడించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అతిరథ మహారథులు ఇంటిబాట పట్టనున్నారని..వారిలో ప్రముఖులు కూడా ఉన్నారని..ఇప్పటి నుంచే జాగ్రత్త పడితే మంచిదని ఆయా నేతలకు సూచించింది. అయినా వారు పట్టించు కోలేదు. తమ ఊహల్లో తాము ఉన్నారు. ఇపుడు కేసీఆర్ కొట్టిన దెబ్బకు అబ్బా అంటున్నారు. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో కారు దూసుకు వెళుతుందని..దానిని ఆపతరం ఎవ్వరి తరం కాదంటూ మిషన్ చాణక్య సిఇఓ శివకేశవ్ అముక వెల్లడించారు. కేసీఆర్ భయానికో లేదా ప్రకటనలు, వ్యాపారాన్ని పెంచుకునేందుకో జయహో అంటూ జపం చేస్తున్న తెలుగు పేరు చెప్పుకుని బతుకుతున్న ఆయా టీవీ ఛానళ్లు, పత్రికలు మిషన్ చాణక్య సర్వే ముందు దిగదిడుపుగా మారాయి. ఒక్క టీఆర్ ఎస్ అనుకుంటే పొరపాటే..ఈ సంస్థ సర్వేలో బీజేపీ, ఎంఐఎం, ఇతరులు ఎవరు గెలుస్తారనే దానిపై స్పష్టంగా ఒక మార్క్‌ను పేర్కొంది. ఇదే వాస్తవమైంది. అధికార పార్టీ వరకు 86 చెబితే ఒక సీటు ఎక్కువగా వచ్చింది. అంతే తేడా.. నిజాయితీ, నిబద్ధత, అంకెల్లో ఎలాంటి తేడాలు లేకుండా కరెక్టుగా ఇవ్వడంతో ఈ సంస్థ చెప్పిందే వాస్తవమైంది.
మిషన్ చాణక్య సర్వే వెల్లడించిన సర్వే వివరాలు కరెక్ట్ కావడంతో మిగతా సంస్థలు, కంపెనీలు క్యూ కట్టాయి. తమకు వర్క్ చేసి పెట్టమంటూ ఆఫర్స్ ఇస్తున్నాయి. నిన్న ఫలితాలు వెలువడిన వెంటనే ప్రముఖ పార్టీతో పాటు కొన్ని కంపెనీలు చర్చోప చర్చలు ప్రారంభించడం ఆ సంస్థ పనితీరుకు..విశ్వసనీయతకు నిదర్శనం. అనుభవజ్ఞులు, మేధావులు, బ్రాడ్కాస్ట్ జర్నలిస్టులు..నిబద్ధత కలిగిన ఉద్యోగ బృందంతో సర్వేలు చేయడంలో ముందంజలో ఉన్న మిషన్ చాణక్య సంస్థను..దాని సిఇఓ శివకేశవ్ అముకను అభినందించాల్సిందే. విద్యాపరంగా అత్యున్నత స్థాయిని చేరుకున్నా..సామాజిక సమస్యలపై పోరాడాలన్న సంకల్పం శివుడిని జర్నలిజం వైపు మళ్లేలా చేసింది. సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో ఎక్స్పర్ట్ కావడం..విశ్లేషించడంలో అపారమైన అనుభవం కలిగి ఉండడం మరో అడ్వాంటేజ్. వృత్తిపరంగా దేశం మొత్తం చుట్టి వచ్చారు. విమానాలను నడిపించడం ఆయనకు సరదా.
– ఎన్ని సమస్యలు వస్తే అంత మెదడుకు పని పెరుగుతుంది. ఇది జీవితం నేర్పిన పాఠం. పోరాడటం..కష్టపడటం ఈ మట్టికే స్వంతం. మేం ఎవ్వరి పక్షం కాదు. అలాగని ఎవరినీ నెత్తికి ఎక్కించుకోం. మా అంచనాలు ఎట్టి పరిస్థితుల్లోను తప్పవు. కొందరికి సర్వేలు చేపట్టడం వ్యాపారం. అదే వారి లైఫ్..మాకది అట్లా కాదు. మేం ఏది చెప్పినా దానికి కట్టుబడి ఉంటాం. ఎలా పని చేశామో ..ఎలా ఫలితాలు ఉండబోతున్నాయో ..అత్యంత శాస్త్రీయమైన పద్ధతిలో వివరిస్తాం. ఏ కంపెనీ అయినా..లేదా ఏ సంస్థ అయినా మమ్మల్ని విశ్వసించాల్సిందే. ఎందుకంటే అందులో నిజాయితీ వుంటుంది అంటున్నారు..మిషన్ చాణక్య సిఇఓ శివకేశవ్ అముక. వెనుకబడిన తరగతి కులంలోంచి వచ్చిన ఈ శివుడు ..ఇపుడు తెలంగాణలో దమ్మున్న మగాడు కాదంటారా-!