నా చావుకి కార‌ణం GST… అని లెట‌ర్ రాసి ఆత్మ‌హ‌త్య చేసుకున్న వ్యాపారి..!

జూలై 1వ తేదీ నుంచి కేంద్ర ప్ర‌భుత్వం జీఎస్‌టీ బిల్లును అమ‌లులోకి తెచ్చిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీంతో ఇప్ప‌టికే అనేక సంస్థ‌లు జీఎస్‌టీలో రిజిస్ట‌ర్ అయి లావాదేవీల‌ను కొన‌సాగిస్తున్నాయి. చాలా రోజులైంది కాబ‌ట్టి వినియోగ‌దారుల‌కు కూడా జీఎస్‌టీ ఎలా ఉంటుందో కొంత వ‌ర‌కు అవ‌గాహన వ‌చ్చింది. అయితే జీఎస్‌టీ ఏమో గానీ చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా వ్యాపారులు చాలా ఆందోళ‌న‌కు లోన‌య్యారు. అలా ఆందోళ‌న‌కు లోనైన ఓ వ్యాపారి జీఎస్‌టీ తీసుకోలేదు. దీంతో అది ఇప్పుడు అత‌ని ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

పశ్చిమబెంగాల్‌ బీర్‌భూమ్‌ జిల్లాలోని నారాయణ్‌పూర్‌ గ్రామంలో ఉండే హోల్‌సేల్‌ కిరాణా వ్యాపారి పినాకీ దత్త జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ నెట్‌వర్క్ (జీఎస్‌టీ)లో నమోదు చేసుకోలేదు. దీంతో అత‌నికి జీఎస్టీ నంబర్‌ రాలేదు. ఆ నంబర్‌ లేకపోవడంతో డీలర్లు అతడికి సరుకు ఇవ్వడం మానేశారు. సరుకు లేక వ్యాపారం ఆగిపోవడంతో పినాకీ దత్త‌ ఆర్థిక ఇబ్బందులపాలయ్యాడు. ఆ ఒత్తిడి, కుంగుబాటుతో ప్రాణాలు తీసుకోవాలని నిర్ణ‌యించుకున్నాడు.

ఈ క్ర‌మంలోనే ఈ నెల 24వ తేదీన పినాకీ ద‌త్త తన దుకాణంలోనే విషం తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే ఎంతసేపటికి భర్త ఇంటికి రాలేదని దుకాణానికి వెళ్లి చూసింది అత‌ని భార్య‌. అప్ప‌టికే అత‌ను చనిపోయి కనిపించాడు. కాగా అత‌ని మృత‌దేహం ప‌క్క‌న అత‌ను రాసినట్టుగా భావిస్తున్న ఓ లెట‌ర్ క‌నిపించింది. అందులో ”నా చావుకు కార‌ణం జీఎస్టీ, ఇంకెవ‌రూ కాదు”, అని రాసి ఉంద‌ని పోలీసులు తెలిపారు. ఈ కేసు విష‌య‌మై ప్ర‌స్తుతం పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు త‌రువాతే ఏ విష‌య‌మైందీ చెబుతామ‌ని వారు తెలిపారు.

Comments

comments

Share this post

scroll to top