సాధారణంగా 19 సంవత్సరాల వయస్సు అంటే… ఆ వయస్సులో ఉండే యువతీ యువకులు ఎవరైనా ఏం చేస్తారు..? కాలేజీ రోజులను సరదాగా గడుపుతుంటారు. కెరీర్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే ఆ వయస్సు యువకుడు మాత్రం అలా కాదు, ఏకంగా కోట్లను సంపాదిస్తున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. కేవలం ఏడాది కాలంలోనే అతను ప్రారంభించిన వ్యాపారం టర్నోవర్ కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో ఏడాదిలోనే అతనికి రూ.102 కోట్ల ఆస్తి వచ్చింది. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే.
అతను అక్షయ్ రూపారేలియా. వయస్సు 19 సంవత్సరాలు. అతని తండ్రి కౌశిక్ రూపారేలియా వయస్సు 57 సంవత్సరాలు. లండన్‌లో వికలాంగ పిల్లల స్కూల్లో కేర్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. అక్షయ్ తల్లి రేణుక. వయస్సు 51 సంవత్సరాలు. ఆమె కూడా అదే స్కూల్లో టీచర్‌గా, సపోర్ట్ వర్కర్‌గా పనిచేస్తోంది. అయితే దురదృష్టం ఏమిటంటే అక్షయ్ తల్లిదండ్రులు ఇద్దరికీ చెవులు వినబడవు. అయినా అక్షయ్‌ను బాగా పెంచారు. ఈ క్రమంలోనే అక్షయ్ ఓ వైపు కాలేజీ చేస్తూనే మరో వైపు ఆన్లైన్లో ఇండ్లను, స్థలాలను అమ్మిపెట్టే doorsteps.co.uk అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. అందుకోసం తన స్నేహితుల వద్ద అక్షయ్ రూ. 6 లక్షలను అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తనకు మొదట ఓ వ్యక్తి నుంచి ఇల్లు, దానికి ఆనుకుని ఉన్న స్థలం అమ్మి పెట్టమని ఆర్డర్ వచ్చింది. దీంతో ఆ ఆర్డర్‌ను అక్షయ్ విజయవంతంగా పూర్తి చేశాడు. ఇక ఆ తరువాత అతను వెను దిరిగి చూడలేదు. విజయపథంలో నడిచాడు.
కేవలం ఏడాది కాలంలోనే అక్షయ్ స్థాపించిన వెబ్సైట్ టర్నోవర్ కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలోనే తన వెబ్సైట్ కోసం 12 మందిని నియమించుకున్నాడు. వారంతా గృహిణులే. వారినే ఎందుకు అక్షయ్ ఎంపిక చేశాడంటే… మంచి ఇల్లు అనేది కేవలం అమ్మలకే తెలుస్తుంది, అందుకే వారిని తన వ్యాపారం కోసం ఉద్యోగులుగా పెట్టుకున్నానని చెప్పాడు అక్షయ్. ఇక మరికొద్ది రోజులకు కాల్ సెంటర్ పెట్టాడు. దీని సహాయంతో తన వెబ్సైట్ కస్టమర్ల సందేహాలను తీర్చేవాడు. అలా అక్షయ్ బిజినెస్ వంద కోట్లకు చేరుకుంది. ఏడాది కాలంలోనే ఏకంగా రూ.102 కోట్ల ఆస్తికి యజమాని అయ్యాడు. ఈ క్రమంలో ఆర్థిక శాస్త్రం, గణితంలో కోర్సుకు గాను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు అక్షయ్‌కు సీటు ఆఫర్ చేశారు. అయినా అక్షయ్ వద్దనుకున్నాడు. బిజినెస్ డెవలప్ చేస్తానని అంటున్నాడు. నిజంగా అక్షయ్ కృషిని అందరం మెచ్చుకోవాల్సిందే. ఇతన్ని ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో ఎవరైనా అలాగే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.