అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ.

తన గాత్రంతో, తన సంగీతంతో సంగీత ప్రేక్షకులను మంత్రముగ్థులను చేసిన ఆ గాత్రం మూగబోయింది. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ చెన్నై లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1930 జులై లో తూగో జిల్లాలోని శంకరం గుప్తం అనే గ్రామంలో జన్మించిన బాలమురళీకృష్ణ….తన అసాధరణ ప్రతిభతో సంగీత ప్రపంచానికి మకుటం లేని మారాజుగా కీర్తించబడ్డారు . తన 8 వ యేటే సంగీత కచేరీ ప్రారంభించిన బాలమురళీకృష్ణ దేశవిదేశాల్లో ఇప్పటి వరకు 25 వేలకు పైగా సంగీత కచేరీలు చేశారు.400 కు పైగా సినిమా పాటలు పాడారు.

సంగీతంపై మంచి పట్టు, వినసొంపైన గాత్రం, వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలను వాయించడంలో నేర్పు…ఇవన్నీ అతన్ని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నంచి గౌరవ డాక్టరేట్లు ,ప్రపంచ స్థాయిలో బెనిలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు.

mangalampalli

ఇటు హిందుస్తానీ సంగీతంలో అటు కర్నాటక సంగీతంలో బాలమురళీకృష్ణ తనదైన ముద్రవేశారు. తిరుపతి తిరుమల దేవస్థానము, శృంగేరీ పీఠాలకు ఆయన ఆస్థాన విద్వాంసుడు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక, మలేశియా, సింగపూర్ మరియు అనేక ఇతర దేశాలలో కచేరీలు చేసి దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహదపడ్డారు ఆయన. కర్నాటక సంగీతకారులలో 3 జాతీయ పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ.

Comments

comments

Share this post

scroll to top