అతడి జీవితం చెట్లకే అంకితం. అలుపెరగకుండా కష్టించి ఓ అడవినే సృష్టించిన మహామనిషి.

అడవులను పెంచాలి. చెట్లను సంరక్షించాలి. అంటూ నేటి తరుణంలో స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవకులు, పర్యావరణ ప్రేమికులు, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా హోరెత్తిస్తున్నాయి. కేవలం మొక్కలను నాటడం మాత్రమే కాదు, వాటి సంరక్షణ కూడా చేపట్టాలని ఆయా సంస్థలు పిలుపునిస్తున్నాయి. కానీ నిజంగా మొక్కలను నాటడం, వాటిని సంరక్షించడం అంటే మాటలు కాదు. వాటి కోసం మన దైనందిన జీవితంలో ఎంతో కొంత సమయం కేటాయించాలి. వీటికి సిద్ధమైన కేవలం కొంత మంది మాత్రమే మొక్కల పెంపకం, వృక్షాల సంరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోతున్న వ్యక్తి మాత్రం అలా కాదు. తన బాల్య దశ నుంచే మొక్కలను నాటి వాటిని వృక్షాలుగా పెంచాడు. అలా పెంచి పెంచి జీవ వైవిధ్యానికి మారు పేరుగా నిలిచేలా ఏకంగా ఓ అడవినే సృష్టించాడు.
12794362_877390592390661_518368201494185197_n
1963లో అస్సాంలో జన్మించిన జాదవ్ ములాయ్ పయెంగ్ అనే వ్యక్తికి 16 ఏళ్లు ఉన్నప్పుడు అంటే 1979లో ఒకసారి వరదలు విజృంభించాయి. వాటి తాకిడి వల్ల అతను నివసించే తీరప్రాంతంలో ఉండే పాములు పెద్ద సంఖ్యలో మరణించాయి. దీన్ని చూసిన జాదవ్ హృదయం విలవిలలాడింది. దీంతో అతను అక్కడ చెట్లను పెంచాలంటూ స్థానిక అటవీ శాఖ అధికారులను సంప్రదించాడు. అలాంటి ప్రదేశంలో ఏవీ పెరగవని, వీలైతే వెదురు చెట్లను పెంచమని అతనికి సలహా ఇచ్చారు. అయితే వారి స్పందన చూసిన జాదవ్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఎలాగైనా స్థానిక జీవరాశుల కోసం ఓ రక్షణను, ఆశ్రయాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు.
ఈ క్రమంలోనే జాదవ్ ఎంత కష్టమైనా ఆ సముద్ర తీర ప్రాంతంలో చెట్ల పెంపకం మొదలు పెట్టాడు. చిన్న చిన్న మొక్కలతోనే తన ప్రయత్నం ప్రారంభించాడు. అలా ఆ ప్రయాణం సాగి చివరికది నేడు ఎన్నో రకాల పక్షులు, జీవరాశులకు ఆశ్రయమిచ్చే అరణ్యంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఆ అడవి విస్తీర్ణం దాదాపు 1360 ఎకరాల వరకు ఉంటుంది. అందులో ఎన్నో వేల రకాల వృక్షాలు ఉన్నాయి. పక్షులు, దుప్పులు, జింకలు, కోతులు, ఖడ్గమృగాలు, ఏనుగులు, పులులు వంటి జంతువులకు నిలయంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ అడవికి జాదవ్ పేరిట ములయ్ వుడ్స్ అని పేరు కూడా పెట్టారు. ఇప్పుడు అతని వయస్సు 51 సంవత్సరాలు. 16 ఏళ్ల వయస్సు నుంచి అతను దాదాపు 35 ఏళ్ల పాటు ఆ అడవిని తన కన్నబిడ్డలా పెంచాడు.
చివరిగా ఒక్క విషయం. అతని జీవితమంతా అదే అడవికి అంకితం చేశాడు. తన జీవన ప్రయాణంలో భార్య, ముగ్గురు పిల్లలు కూడా తోడయ్యారు. వారితో కలిసి అదే అడవిలో ఒక చిన్న గుడిసెలో నివాసం ఉంటున్నాడు. ఓ ఆవు, ఓ గేదెను సంరక్షిస్తూ వాటి పాలను అమ్మడం ద్వారా వచ్చిన సొమ్ముతో తన జీవితం కొనసాగిస్తున్నాడు.

Comments

comments

Share this post

scroll to top