“నాది కానిది కొన్ని కోట్లయినా నాకొద్దు.. నాది అని అనుకున్నది నన్ను అడగొద్దు” సాహసం సినిమాలో గోపీచంద్ చెప్పిన పాపులర్ డైలాగ్..ఇప్పుడు మీరు చదివే ఈ కథనానికి నూటికి నూరు పాళ్ళు సరిపోతుంది. నడి రోడ్ పై నడుచుకుంటూ వెళుతుండగా కొంత డబ్బు మీకు దొరికితే ఎవరైనా ఏం చేస్తారు.. ? అటుఇటు చూసి ఎవరు చూడకపోతే ఛటుక్కున తీసి జేబుల్లో వేసేసుకుంటారు! కానీ ఈయన మాత్రం అలా కాదు, తనకు దొరికిన 10 లక్షల రూపాయలను పోలీస్ స్టేషన్ లో అప్పగించి నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు.
ఆయన పేరు సత్యనారాయణ …విజయవాడలో మోటార్ సైకిల్ పై తన కూతురిని కాలేజ్ వద్ద దింపేసి వెళుతుంటే అతనికి బెంజ్ సర్కిల్ వద్ద ఒక బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగానే అందులో అన్నీ 500, 1000 రూపాయల నోట్ల కట్టలతో దర్శనమిచ్చాయి . పాపం ఎవరు పోగొట్టుకున్నారో…. ఈ డబ్బును పోగొట్టుకున్న వారు ఎంత బాధపడుతున్నారో అని అనుకుంటూ… అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ దగ్గరకు వెళ్లి జరిగిన సంగతి చెప్పి, తనకు దొరికిన బాగ్ ను ఇచ్చేశాడు. సత్యనారాయణ నిజాయితికి మెచ్చి ఎకంగా కమీషనర్ గౌతమ్ సవాంగ్ తనే స్వయంగా ఆయనను సత్కరించారు. నిజాయితీ ఇంకా బతికే ఉందని ఇలాంటి వాళ్ళను చూస్తే అనిపిస్తుంది.