ఓ వైపు అన్ని రంగాల్లోనూ మనం దూసుకెళ్తున్నామని చెప్పుకుంటున్నాం. కానీ నిజంగా కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నామని చెప్పవచ్చు. తోటి మనుషులను మనుషులుగా చూడడంలో వారికి సహాయం చేయడంలో మాత్రం అన్ని దేశాల కన్నా మనం చాలా చాలా వెనుకబడి ఉన్నాం. సహాయం చేయకపోయినా ఫర్వాలేదు, కనీసం తోటి వారిని మనుషులుగా చూడాలి కదా. కనీసం అలా కూడా చేయడం లేదు చాలా మంది. ఇంట్లోకి చెప్పకుండా వెళ్లేందుకు యత్నించాడంటూ ఓ వ్యక్తికి నీచమైన శిక్ష వేశారు ఆ గ్రామ పెద్దలు. ఈ ఘటన జరిగింది బీహార్‌లో.
బీహార్‌లోని పాట్నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది అజాద్‌పుర్ అనే గ్రామం. అక్కడ ఈ నెల 18వ తేదీన మహేష్ ఠాకూర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన సర్పంచ్ ఇంటికి వెళ్లాడు. అయితే అతను బయటే నిలబడి పిలిచాడు కానీ ఎవరూ పలకలేదు. దీంతో మహేష్ ఠాకూర్ ఇంటి లోపలికి వెళ్లాడు. సరిగ్గా అప్పుడే సర్పంచ్ అతన్ని చూశాడు. దీంతో వెంటనే గ్రామ సభ ఏర్పాటు చేయించాడు.
అదే సభలో మహేష్‌ను నిలబెట్టారు. అతనిచే నేలపై ఉమ్మి వేయించారు. అనంతరం ఆ ఉమ్మిని మహేష్ తోనే నాకించారు. ఆ తరువాత కొందరు మహిళలతో అతన్ని చెప్పులతో కొట్టించారు. కాగా ఈ ఘటన జరిగి ఒక రోజు అయ్యాక ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఈ ఘటన దృశ్యాలను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. దీంతో అసలు విషయం తెలిసింది. ఈ క్రమంలో ఘటనకు పాల్పడిన సర్పంచ్‌తోపాటు మొత్తం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటనను బట్టి మీరే చెప్పండి.. ఇలాంటి నిందితులకు నిజంగా ఏ శిక్ష వేస్తే బాగుంటుందో..!