రోడ్డు స‌రిగ్గా లేక‌పోవ‌డంతో… సైకిల్‌పై త‌మ్ముడి మృత‌దేహాన్ని తీసుకెళ్లిన అన్న‌..!

మ‌న దేశంలో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయో తెలియ‌జేసే అత్యంత ద‌య‌నీయమైన సంఘ‌ట‌న ఇది. గ‌తంలోనూ ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ యంత్రాంగం మేలుకోవ‌డం లేదు. దీంతో సామాన్య ప్ర‌జలు ప‌డుతున్న క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం. అసోంలో ఓ వ్య‌క్తి సైకిల్‌పై త‌న త‌మ్ముడి మృతదేహం తీసుకెళ్ల‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నేష‌న‌ల్ మీడియా ఈ వార్త‌ను ప్ర‌ముఖంగా ప్ర‌సారం చేయ‌డంతో దెబ్బ‌కు ఆ రాష్ట్ర సీఎం దిగిరాక త‌ప్ప‌లేదు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే…

అసోంలోని లక్ష్మీపూర్ జిల్లా బలిజాన్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల డింపుల్ దాస్ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో సతమతమవుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం అతన్ని గర్మూర్ అనే ఊరికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాలంటే బలిజాన్ గ్రామం నుంచి గర్మూర్ కు సరైన రోడ్డు మార్గంలేదు. వెదురు వంతెనపై వెళ్లాల్సిందే. సైకిల్ పై అతన్ని ఆ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆలస్యమవ్వడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు దాస్. అయితే గర్మూర్ హాస్పిటల్ లో వాహన సౌకర్యమున్న‌ప్ప‌టికీ వారి గ్రామ‌మైన బ‌లిజాన్‌కు అక్క‌డి నుంచి రోడ్డు స‌దుపాయం లేదు. దీంతో దాస్ మృతదేహాన్ని అత‌ని అన్న సైకిల్‌కు క‌ట్టాడు. అలా ఆ మృతదేహాన్ని అత‌ను సైకిల్‌పైనే తీసుకెళ్లాడు.

ఈ క్ర‌మంలో ఈ విష‌యం కాస్తా మీడియాకు తెలిసిపోయింది. కొన్ని నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఈ ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అది ఆ రాష్ట్ర సీఎం సోనోవాల్ దాకా వెళ్లింది. అయితే నిజానికి చెప్పాలంటే బ‌లిజాన్ గ్రామం ఆ సీఎం ఇలాకానే. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే ఆ గ్రామం ఉంది. అది మ‌రీ విడ్డూర‌మైన విష‌యం. అయిన‌ప్ప‌టికీ ఆ గ్రామంలో ఇంకా క‌నీస స‌దుపాయాలు లేవంటే ఆ రాష్ట్ర సీఎం ఎంత బాగా ప‌నిచేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. సొంత నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా అభివృద్ధి చేయ‌క‌పోతే ఇక ఆ సీఎం ఎందుకు అని అక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే తీరా విష‌యం తెలిసే స‌రికి సీఎం సోనోవాల్ స్పందించి త‌క్ష‌ణ‌మే త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఆ బుద్ధి ముందే ఉంటే అలా ఓ కుటుంబం ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చేది కాదు క‌దా. అదే మ‌రి… చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకోవ‌డ‌మంటే..!

Comments

comments

Share this post

scroll to top