నేడు మన దేశంలో మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య భద్రత. ఎక్కడ ఉన్నా, ఏ పనిచేస్తున్నా, ఎటు వెళ్తున్నా, ఏ సమయంలోనైనా కామాంధులు వారిపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. వారికి వయస్సుతో పనిలేదు. కోరిక తీరితే చాలు. అందు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. బెంగుళూరు నగరంలో తాజాగా జరిగిన ఓ సంఘటన మరోసారి మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఆంబులెన్సులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళ అని కూడా చూడకుండా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ ఆటో డ్రైవర్. ఎట్టకేలకు బాధిత మహిళ ప్రతిఘటించి, అతని నుంచి తప్పించుకుని, తనకు జరిగిన విషయం చెప్పడంతో ఆ కామాంధున్ని పోలీసులు అరెస్టు చేశారు.
అది సుబ్రహ్మణ్యపుర మెయిన్ రోడ్. అక్కడి ఓ నివాసంలో ఉంటున్న ఓ వ్యక్తి తన భార్యకు అస్వస్థత కలగడంతో పద్మనాభనగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన ఆంబులెన్స్‌ను పిలిపించాడు. ఆంబులెన్స్‌లో డ్రైవర్‌తోపాటు సిద్దరాజు (32) అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే సదరు జంట సిద్దరాజును ఆంబులెన్స్ అటెండర్‌గా భావించారు. కానీ అతను ఆంబులెన్స్ అటెండర్ కాదు. ఓ ఆటోడ్రైవర్. సదరు ఆంబులెన్స్‌కు చెందిన హాస్పిటల్ దగ్గర రాత్రి పూట నిద్రిస్తుండగా చలిగా ఉందని చెప్పి ఆ ఆంబులెన్స్‌లో పడుకోవాలని డ్రైవర్ కోరడంతో సిద్దరాజు అందులో నిద్రించాడు. ఈ క్రమంలో బాధిత జంటలో భర్త తన భార్యకు అస్వస్థగా ఉందని ఆంబులెన్స్‌ను పిలిపించడంతో అందులో సిద్దరాజును చూడకుండానే దాని డ్రైవర్ ఆంబులెన్స్‌ను తీసుకువెళ్లి ఆ మహిళను ఎక్కించుకున్నాడు. దీంతో ఆ మహిళ భర్త డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చున్నాడు. వెనుకాల మహిళ పడుకుంది. ఆమె వద్ద సిద్దరాజు ఉన్నాడు. ముందు అతన్ని చూసిన ఆ జంట ఆంబులెన్స్ అటెండర్ అనుకుని పొరపాటు పడ్డారు. ఈ క్రమంలో ఆంబులెన్స్ వెళ్తుండగా మార్గ మధ్యలో సిద్దరాజు ఆ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.
అయితే మహిళ కొద్దిగా స్పృహలోనే ఉండడంతో ప్రతిఘటించింది. ఎలాగో సిద్దరాజు బారి నుంచి తప్పించుకుంది. ఈ క్రమంలో ఆమె కేకలు వేసినా అవి ముందున్న తన భర్తకు, ఆంబులెన్స్ డ్రైవర్‌కు వినిపించలేదు. అయితే హాస్పిటల్ కు చేరుకున్నాక ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆమె అసలు విషయం చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్పటికీ పారిపోవాలని చూసిన సిద్దరాజును పోలీసులు అరెస్టు చేశారు. కన్నూ మిన్నూ కానకుండా మృగాళ్లు చేస్తున్న అఘాయిత్యాలకు ఇది మరొక ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే… ఇక ఏం చేయాలో మన ప్రభుత్వాలకు, నాయకులకే తెలియాలి..! లేదంటే అలాంటి కామాంధులను శిక్షించేందుకు దేవుడే దిగి రావాలేమో..!