ఎవరి జీవితంలో అయినా జీవితాంతం గుర్తుంచుకునే మధురానుభూతులు కొన్నే వస్తాయి. గతంలో జరిగిన అలాంటి మధురానుభూతులను తలచుకున్నప్పుడల్లా చక్కని ఫీలింగ్ మనకు కలుగుతుంది. మనస్సుకు ఎంతో హాయి అనిపిస్తుంది. అలాంటి మధురానుభూతుల్లో మహిళలకు గర్భం కూడా ఒకటి. గర్భం ధరించినప్పటి నుంచి శిశువుకు జన్మనిచ్చే వరకు తల్లికి చెప్పలేని అనుభూతి ఉంటుంది. అయితే సాధారణంగా ఎవరైనా పెళ్ళి, బర్త్ డే వంటి ఇతర హ్యాపీ మూమెంట్స్‌ను కెమెరాల్లో రికార్డు చేసుకుంటారు. కానీ ముఖ్యమైన అంశమైన ప్రెగ్నెన్సీ, డెలివరీ వంటి వాటిని రికార్డు చేయరు. ఈ క్రమంలోనే ఆ హ్యాపీ మూమెంట్స్‌ను తల్లులు మళ్లీ అనుభవించాలంటే తమకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు అన్ని విషయాలను ఎలా రికార్డు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రెగ్నెన్సీ కన్ఫాం అయినప్పటి నుంచి గర్భం పెరగడం, కడుపులో బిడ్డ కాళ్లతో తన్నడం, పురిటి నొప్పులు, శిశువుకు జన్మనివ్వడం వంటి ముఖ్యమైన సందర్భాల్లో తల్లులు తాము అనుభవించిన ఫీలింగ్స్‌ను పుస్తకంలో రాసుకోవాలి. తరువాత వాటిని ఎప్పుడైనా చదువుతుంటే ఓ మధురమైన ఫీలింగ్ కలుగుతుంది. అప్పటి రోజులు గుర్తుకు వస్తాయి.
2. గర్భంతో ఉన్నప్పుడు మహిళ తన భర్తతో కలిసి ఎంజాయ్ చేసిన ప్రత్యేక సందర్భాలలో ఫొటోలు, వీడియోలు తీసుకోవాలి. వాటిని భద్రంగా స్టోర్ చేసుకోవాలి. మళ్లీ వాటిని చూసినప్పుడు చక్కని ఫీలింగ్ కలుగుతుంది.
3. గర్భంతో ఉన్నప్పుడు మహిళలు తమకు కలిగే ఫీలింగ్స్‌ను, తాము అనుభవించే కష్టాలను, సంతోషాలను వీడియో రూపంలో సొంతంగా చిత్రీకరించుకోవాలి. ఇవి కూడా మధురమైన అనుభూతులుగా మిగులుతాయి.
4. గర్భం దాల్చినప్పటి నుంచి పొట్ట పెరగడం, శిశువుకు జన్మనివ్వడం వరకు ఎప్పటి కప్పుడు ఒకే తరహాలో ఫొటోలు తీసుకుని వాటిని కలపాలి. అదో మంచి జ్ఞాపకంగా మిగులుతుంది. వాటిని చూసే పిల్లలు, ఇతరులు కూడా ఎంజాయ్ చేస్తారు.
5. గర్భంతో ఉన్నప్పుడు పర్యటించిన ప్రదేశాలు, తిన్న ఆహారం తదితర అంశాలకు చెందిన ఫొటోలను, వీడియోలను తీసి భద్ర పరుచుకుంటే అవి గుడ్ మెమొరీస్‌గా ఉంటాయి.
6. గర్భంతో ఉన్నప్పుడు మహిళ కడుపులో ఉన్న శిశువు గురించి ఏమనుకుంటుందో, ఏమని శిశువుకు మాటలు చెబుతుందో వాటిని ఉత్తరాల రూపంలో అప్పుడే రాసి పెట్టాలి. పెద్దయ్యాక పిల్లలకు వాటిని ఇస్తే అప్పుడు వారికి కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఇలాంటి ఉత్తరాలను సీక్రెట్ గా ఇవ్వడం బెటర్. అందులో ఏదో రహస్యం ఉన్నట్టు ప్రవర్తించి పిల్లలకు ఆ లెటర్స్‌ను ఇవ్వాలి. మీకే కాదు, వారికి కూడా అవి చక్కని మెమోరీలుగా మిగులుతాయి.