ప్రస్తుత తరుణంలో సమాజంలో మహిళలు రాత్రిపూట కాదు, పగలు కాదు.. అందరూ చుట్టూ ఉన్నా కూడా బయట తిరగడం పాపమై పోయింది. ఎటు నుంచి ఏ మృగాడు వచ్చి దాడి చేస్తాడోనని కాదు భయం.. వారి ఫొటోలు తీసి మార్ఫింగ్ చేసి అశ్లీల సైట్లలో పెడతారేమోనని భయపడాల్సి వస్తోంది. అవును, నిజమే. కేరళలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఓ ఫోటో స్టూడియోకు చెందిన కొందరు వ్యక్తులు పలు పెళ్లిళ్లలో మహిళల ఫొటోలను తీసి వాటిని మార్ఫింగ్ చేశారు. అనంతరం వాటిని అశ్లీల సైట్లలో పెట్టారు. ఓ మహిళ తన మార్ఫింగ్ ఫొటోను సోషల్ మీడియా సైట్లో గుర్తించడంతో తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనకు కారణమైన వారిని పోలీసులు అరెస్టు చేశారు.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో సదయమ్ షూట్ అండ్ ఎడిట్ స్టూడియో ఉంది. ఈ స్టూడియోకు చెందిన యజమానులు సతీశన్, దినేష్‌లు వివాహ కార్యక్రమాల్లో వేలాది మంది మహిళల ఫొటోలను తీసి వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేశారు. అనంతరం వాటిని పలు అశ్లీల సైట్లతోపాటు సోషల్ మీడియా సైట్లలోనూ పోస్ట్ చేశారు. దీంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. చివరకు ఒక మహిళ తన అశ్లీల ఫొటోలను చూసి షాక్ తిన్నది. దీంతో ఆమె ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా సదరు స్టూడియో వారే ఈ పని చేశారని తెలిసింది. దీంతో ఆ స్టూడియో యజమానులు సతీషన్, దినేషన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు బిబేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ విషయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని విడిచిపెట్టేదిలేదని తేల్చి చెప్పారు. కాగా మరోవైపు వివాహ కార్యక్రమాల్లో తీసిన మహిళలకు సంబంధించి 40వేల ఫొటోలు ఆ స్టూడియోలోని హార్డ్ డిస్క్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారు ఆ హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే నిందితులు చేసిన నేరం ఒప్పుకోవడంతో వారిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఇక ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మహిళలు బయట ఎలా తిరుగుతారు చెప్పండి. ఏది ఏమైనా ఇలాంటి పనులను చేసే నీచులను అస్సలు విడిచిపెట్టరాదు.