ఆ రైతుల గురించి పట్టించుకోకపోవడాన్ని అసలు కారణం ఇదేనా..? మహారాష్ట్ర రైతులు స‌క్సెస్ అయ్యారు కానీ.?

మ‌న దేశానికి 1947 ఆగ‌స్టు 15న స్వాతంత్ర్యం వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఇప్పటి వ‌ర‌కు దాదాపుగా అన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల జీవితాల్లో కొంత మేర మార్పులు వ‌చ్చాయి. కానీ రైతుల ప‌రిస్థితి మాత్రం ఏటా మ‌రింత దిగ‌జారుతోంది. న‌కిలీ విత్త‌నాలు, పురుగు మందులు, అప్పుల బాధ‌, మ‌ద్ద‌తు ధ‌ర లేక‌పోవడం, క‌రువు.. వంటి అంశాలు రైతులను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్నాయి. దీంతో రైతులు ప్ర‌స్తుతం అత్యంత దీనావ‌స్థ‌లో కొట్టుమిట్టాడుతున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడు. వారికి మేలు చేయాల్సిన నాయ‌కులు ఏసీ గ‌దుల‌లో కాల‌క్షేపం చేస్తున్నారు. రైతులు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకునేందుకు రోడ్డెక్కాల్సిన ప‌రిస్థితి దాపురించింది.

ఇటీవ‌లి కాలంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు మ‌రింత‌గా పెరిగాయి. ఒక‌ప్ప‌టి క‌న్నా ఆ పరిస్థితి ఇప్పుడు మ‌రింత ఎక్కువైంది. అలాగే త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ రైతులు అనేక చోట్ల ధ‌ర్నాలకు దిగుతున్నారు. నిర‌స‌న‌లు చేప‌డుతున్నారు. అయినా ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకున్న పాపాన పోవ‌డం లేదు. మొన్న‌టికి మొన్న ఢిల్లీలో త‌మిళనాడు రైతులు 41 రోజుల పాటు వినూత్న రీతిలో ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. సాక్షాత్తూ ప్ర‌ధాని నివాసానికి స‌మీపంలోనే ఆందోళ‌న‌లు చేశారు. రోడ్ల‌పై భోజ‌నం చేశారు. అర్థ‌న‌గ్నంగా తిరిగారు. ఆత్మ‌హత్య‌లు చేసుకుని చ‌నిపోయిన రైతుల పుర్రెల‌ను మెడ‌లో వేసుకు తిరిగారు. అయినా ప్ర‌జాప్ర‌తినిధులు క‌నీసం వారిని ప‌ట్టించుకోవ‌డం కాదు క‌దా, వారి దిక్కు చూడ‌ను కూడా చూడ‌లేదు. కొన్ని మీడియా చాన‌ల్స్ మాత్రం ఈ వార్త‌ను అంత ప్రాముఖ్య‌త లేనిదిగా చిన్న వార్త‌గా ప్ర‌సారం చేసి చేతులు దులుపుకున్నాయి. ఇక చివ‌రాఖ‌రికి త‌మ గోడును ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని రూఢి అయింది పాపం త‌మిళ రైతుల‌కు. అందుకే వారు ముఖాలు వేలాడేసుకుని ఇళ్ల‌కు తిరుగుముఖం ప‌ట్టారు.

త‌మిళ‌నాడు రైతులు ఢిల్లీలో ఆందోళ‌న‌లు చేప‌ట్టిన‌ప్పుడు నిజానికి ఆ రాష్ట్రంలో రాజ‌కీయ సందిగ్ధ‌త ఉంది. ఏఐఏడీఎంకేలో లుక‌లుక‌లు ఏర్ప‌డ‌డం, ప్ర‌తిప‌క్ష పార్టీ అధికారం కోసం పాకులాడ‌డం వంటి అనేక అంశాల కార‌ణంగా త‌మిళ రైతులు త‌మ వాణిని వినిపించేందుకు త‌మ రాష్ట్రం స‌రిపోద‌ని భావించి ఢిల్లీని ఎంచుకున్నారు. అయినా ఆ రైతుల‌కు భంగ‌పాటు త‌ప్ప‌లేదు. అన్ని రోజుల పాటు ఆందోళ‌న చేసి ఉత్త చేతుల్తో వెన‌క్కి వ‌చ్చిన రైతుల‌ను ఆ రాష్ట్ర సీఎం ప‌ళ‌ని స్వామి క‌లిశారు. అయినా ఏం చేస్తారు, వ్య‌వ‌సాయానికి సంబంధించి మ‌ద్ద‌తు ధ‌ర పెంచ‌డం, రుణాలు మాఫీ చేయ‌డం వంటి అనేక అంశాలు కేంద్రంతో ముడిప‌డినవాయె. క‌నుక ఆ సీఎం కూడా చేద్దాం, చూద్దాం అని చెప్పేశారు. అక్క‌డితో త‌మిళ రైతుల ఆందోళ‌న ముగిసింది. అది జ‌రిగి నెల‌లు అవుతున్నా ఇప్ప‌టికీ ఆ రైతుల స‌మ‌స్య‌లు తీర‌లేదు.

తమిళ రైతులు ఏమో గానీ మ‌హారాష్ట్ర రైతులు మాత్రం త‌మ రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఆశించినంత మేర ప్ర‌యోజ‌నం పొందే అవ‌కాశానికి బాట‌లు వేసుకున్నార‌నే చెప్ప‌వ‌చ్చు. వారు త‌మిళ రైతుల ఆందోళ‌న నుంచి పాఠం నేర్చుకున్నారో ఏమో తెలియ‌దు కానీ ఒకేసారి 35వేల మంది రైతులు రోడ్ల‌పైకి వ‌చ్చారు. చాలా ప్ర‌శాంతంగా, ఎలాంటి హింస‌కు తావులేకుండా శాంతియుత ప‌ద్ధ‌తిలో త‌మ నిర‌స‌న తెలిపారు. 6 రోజుల పాటు ఎర్ర‌టి ఎండ‌ను సైతం లెక్క చేయ‌కుండా, కాళ్ల‌కు ఓ వైపు బొబ్బ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ 180 కిలోమీటర్ల పాదయాత్ర చేప‌ట్టారు. అయితే వారు అలా చేయ‌డంతో ఆ రాష్ట్రంలో ఉన్న బీజేపీయేత‌ర పార్టీలు వారికి మ‌ద్ద‌తు ప‌లికాయి. కానీ ఢిల్లీలో త‌మిళ రైతులకు మాత్రం అలాంటి మ‌ద్ద‌తు ల‌భించ‌క‌పోవ‌డం విచార‌క‌రం. వారు ఆందోళన చేసిన ప్రాంతం వేరు, మ‌రో వైపు త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఉన్న ప్ర‌తిప‌క్షాలు ఆ రైతుల వెంట రాలేదు. దీనికి తోడు త‌మిళ రైతులు ఆందోళ‌న చేసింది ఢిల్లీలో క‌నుక భాష కూడా వారికి మ‌రో స‌మ‌స్య అయింది. వారి స‌మ‌స్య‌ల‌ను హిందీలో గ‌ళ‌మెత్తి వినిపించే నాయ‌కుడు వారికి లేడు. కానీ ఆ త‌రువాత ముంబైలో ఆందోళ‌న చేసిన మ‌హారాష్ట్ర రైతులు మాత్రం త‌మ స‌మ‌స్య‌ల‌ను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వానికి త్వ‌ర‌గా వినిపించ‌గ‌లిగారు. ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఒక హామీ అయితే ల‌భించింది. అయితే అవి ప‌రిష్కారమ‌వుతాయా లేదా అన్న‌ది ప‌క్క‌న పెడితే త‌మిళ రైతుల క‌న్నా మహారాష్ట్ర రైతులు మాత్రం ఈ విష‌యంలో ఒక మెట్టు ముందున్నార‌ని చెప్ప‌వ‌చ్చు.

ఏది ఏమైనా అస‌లు ఇలా రైతులు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని రోడ్డెక్క‌డం చాలా బాధాక‌రం. ప‌రిస్థితి ముందు ముందు ఇలాగే కొన‌సాగితే అప్పుడు రైతులు పూర్తిగా వ్య‌వ‌సాయం చేయ‌కుండా స‌మ్మె చేస్తారా ? ఏమో.. చేసినా ఈ ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకుంటాయ‌న్న న‌మ్మ‌కం లేదు. వాటికి ఎన్నిక‌ల‌ప్పుడు అవే రైతుల ఓట్లు కావాలి, వారికి చేస్తామ‌ని చెప్పే వాగ్దానాలు కావాలి. అంతే.. వాస్త‌వానికి క్షేత్ర స్థాయిలోకి వ‌స్తే పూర్తిగా భిన్నం. ఎన్నిక‌ల‌య్యాక నాయ‌కులు రైతుల‌నే కాదు, అసలు ఎవ‌రినీ ప‌ట్టించుకోరు. ఏం చేస్తాం.. అంతా మ‌న ఖ‌ర్మ కాక‌పోతే..!

Comments

comments

Share this post

scroll to top