మహానటి సావిత్రి కోమాలోకి వెళ్లడానికి ముందు నగలు ఎలా మాయం అయ్యాయి ఆమె చివరి మాటలు ఇవే

మహానటి సావిత్రి గారి గురించి ఒక నటిగా మాత్రమే ఈ తరానికి తెలుసు..ఆమె ఒక మహోన్నత వ్యక్తత్వం అని పరిచయం చేశాడు దర్శకుడు నాగ అశ్విన్..ఇప్పటివరకు సావిత్రిగారి గురించి,జెమినితో ఆవిడ సంభందం,మద్యం అలవాటు ఇలా వీటి గురించి ఎన్నో ఊహాగానాలుండేవి..వాటన్నింటిని తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశాడు..అందులో భాగంగా సినిమా ఎక్కడా బోర్ కొట్టించే విధంగా ఉండకుండా కొన్ని విషయాలు మార్పులు చేర్పులు చేశాడు.అయితే సావిత్రి గారి గురించి ఆవిడ స్నేహితురాలు ,నటి షావుకారు జానకి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.అవేంటో ఆవిడ మాటల్లోనే..

నమ్మినవారే మోసం చేసారు..

“సావిత్రికి జాగ్రత్త తక్కువ. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నమ్మినవాళ్ళే ఆమె డబ్బు, నగలు మోసం చేసిన సందర్భాలు ఎక్కువ. సావిత్రి ఇంట్లో పనిచేసేవాడు ఒకసారి కర్ఛీఫ్‌లో సావిత్రి గాజులు తీసుకొని వచ్చి టి.నగర్‌ ఉస్మాన్‌ రోడ్డులోని టి.బి. జ్యూవెలర్స్‌కు వచ్చి అమ్మబోయాడు. సరిగ్గా అదే సమయానికి నేను పెళ్ళికని ఏవో వెండి సామాన్లు కొనడానికి అక్కడికి వెళ్ళా. అమ్ముతున్న ఆ గాజులు అచ్చం నా గాజుల లానే ఉండడం చూసి, ఆరా తీస్తే దొంగతనం బయటపడింది. ఆ షాపు ఓనరుకు చెప్పి, సావిత్రికి ఆ నగలు వెనక్కి ఇప్పించా. ఎవరూ చూడకుండా ఇలా ఎన్ని నగలు పోయాయో ఎవరికి తెలుసు”
మధ్యానికి బానిస ఎలా అయ్యారంటే?
“సావిత్రి నాతో అన్ని విషయాలూ దాపరికం లేకుండా చెప్పుకొనేది. జెమినీ బయటెక్కడో తాగి, అల్లరి పాలవుతుంటే, దగ్గరుండి చూసుకోవడానికి ఆయన కోసమే తాను మందు అలవాటు చేసుకున్నానని చెప్పింది. అయితే, జీవితంలోని బాధలు మరచిపోవడానికి ఆమె ఆ అలవాటును ఆసరాగా చేసుకోవడంతో, చివరకది వ్యసనంగా మారింది. ఆమె జీవితాన్నే నాశనం చేసింది. ముందు నుంచి బయట తిరుగుళ్ళు అలవాటున్న జెమినీని తెలిసి తెలిసి కట్టుకున్నాక, అతని ప్రవర్తన మారుతుందని ఆశపడడం తప్పు. సావిత్రి ఆ తప్పే చేసింది. ‘అతని కోసం నీ జీవితం, నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకోకు. జీవితంలో అందరం తప్పులు చేస్తాం. నేనూ చేశాను. కానీ, ఆ తప్పుల నుంచి బయటపడేలా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య కుదరనప్పుడు మానసికంగా డిటాచ్‌ అవ్వాలి’ …ఇలా సావిత్రితో చెబుతుండేదాన్ని. అందుకే, చాలా సందర్భాల్లో ‘జానకీ! నీకున్న ధైర్యం నాకు లేదు’ అని బాధపడేది.
 
చివరిగా మాట్లాడిన మాటలు…
కోమాలోకి వెళ్ళడానికి ముందు సావిత్రి ఆఖరుగా షూటింగ్‌లో పాల్గొన్నది కన్నడ సినిమా ‘ఆరద గాయ’ (తీరని గాయం)లో. ఆ సినిమా షూటింగ్‌ మైసూరు ప్రీమియర్‌ స్టూడియోస్‌లో జరిగింది. ఆ రోజున మధ్యాహ్నం తీరిక చేసుకొని, స్పాట్‌లోనే వంట చేసుకుంటున్నా. బ్రేక్‌ టైమ్‌లో సావిత్రి నా దగ్గరకు వచ్చి కూర్చొని, నడిగర సంగంలో మనోహర్‌ వాళ్ళతో అర్జెంట్‌ పని మీద మద్రాసు వెళుతున్నా అని చెప్పింది. ఆకలేస్తోంది అంది. అప్పటికి నేను అన్నం, మైసూరు రసం వండడం అయ్యాయి. పెరుగు ఉంది. తినమని అప్పటికప్పుడు స్టీలు ప్లేటులో పెడితే, ఆవురావురుమంటూ కొద్దిగా తిన్నది. అప్పుడే పర్సులో నుంచి చిన్న టర్కీ టవల్‌ లాంటి దానిలో చుట్టిన ప్యాకెట్‌ విప్పింది. అందులో ఉన్నవి చూపిస్తూ, ‘నా నగల్లో ఈ కొద్దిగానే మిగిలాయి’ అంటూ బాధపడింది. సావిత్రితో ఆఖరుసారి మాట్లాడింది అప్పుడే. అలా మద్రాసు వెళ్ళిన సావిత్రి, మళ్ళీ షూటింగుకు రాకుండానే, బెంగళూరులో కోమాలోకి వెళ్ళిపోయింది. అలా కోమాలోనే ఏడాదికి పైగా ఉంటూ, కన్నుమూసింది.

Comments

comments

Share this post

scroll to top