‘మహానటి’ సావిత్రి కోమాలోకి వెళ్లడానికి ముందు ఏం జరిగింది,ఎవరితో ఏం మాట్లాడింది.

కళ్లతోనే హావభావాలు పలికించగల అధ్బుతనటి సావిత్రి.అటువంటి నటి గురించి ,ఆవిడ వ్యక్తిత్వం గురించి ఈ తరానికి పరిచయం చేసిన సినిమా మహానటి..మహానటి చూసిన తర్వాత సావిత్రి గారి జీవితం గురించి మరింతగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. సావిత్రి జీవితంలో జెమిని పాత్ర,మధ్యం అలవాటుకి బానిసగా మారి చివరికి కోమాలోకి వెళ్లి తర్వాత కన్నుమూశారు..ఆనాటి పరిస్థితులను ,సావిత్రి గారి గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను నటి షావుకారు జానకి పంచుకున్నారు.. సావిత్రి గురించి జానకి మాటల్లో..

సావిత్రి అనగానే నాకు ఎన్నో గుర్తొస్తాయి. సావిత్రి, నేను ‘బ్రదర్‌’ అని ఆత్మీయంగా పిలుచుకొనే ఆమె భర్త జెమినీ గణేశన్‌ నాకు సన్నిహితంగా తెలుసు. నేను సినిమా రంగంలోకి వచ్చింది 1949లో! ‘షావుకారు’ సినిమాతో పరిచయమయ్యా. సావిత్రి నాకు జూనియర్‌ అన్నారు.సావిత్రి నాతో అన్ని విషయాలూ దాపరికం లేకుండా చెప్పుకొనేది. జెమినీ బయటెక్కడో తాగి, అల్లరి పాలవుతుంటే, దగ్గరుండి చూసుకోవడానికి ఆయన కోసమే తాను మందు అలవాటు చేసుకున్నానని చెప్పింది. అయితే, జీవితంలోని బాధలు మరచిపోవడానికి ఆమె ఆ అలవాటును ఆసరాగా చేసుకోవడంతో, చివరకది వ్యసనంగా మారింది.అదే ఆమె జీవితాన్నే నాశనం చేసింది.

కోమాలోకి వెళ్ళడానికి ముందు సావిత్రి ఆఖరుగా షూటింగ్‌లో పాల్గొన్నది కన్నడ సినిమా ‘ఆరద గాయ’ (తీరని గాయం)లో. ఆ సినిమా షూటింగ్‌ మైసూరు ప్రీమియర్‌ స్టూడియోస్‌లో జరిగింది. ఆ రోజున మధ్యాహ్నం తీరిక చేసుకొని, స్పాట్‌లోనే వంట చేసుకుంటున్నా. బ్రేక్‌ టైమ్‌లో సావిత్రి నా దగ్గరకు వచ్చి కూర్చొని, నడిగర సంగంలో మనోహర్‌ వాళ్ళతో అర్జెంట్‌ పని మీద మద్రాసు వెళుతున్నా అని చెప్పింది. ఆకలేస్తోంది అంది. అప్పటికి నేను అన్నం, మైసూరు రసం వండడం అయ్యాయి. పెరుగు ఉంది. తినమని అప్పటికప్పుడు స్టీలు ప్లేటులో పెడితే, ఆవురావురుమంటూ కొద్దిగా తిన్నది. అప్పుడే పర్సులో నుంచి చిన్న టర్కీ టవల్‌ లాంటి దానిలో చుట్టిన ప్యాకెట్‌ విప్పింది. అందులో ఉన్నవి చూపిస్తూ, ‘నా నగల్లో ఈ కొద్దిగానే మిగిలాయి’ అంటూ బాధపడింది. సావిత్రితో ఆఖరుసారి మాట్లాడింది అప్పుడే. అలా మద్రాసు వెళ్ళిన సావిత్రి, మళ్ళీ షూటింగుకు రాకుండానే, బెంగళూరులో కోమాలోకి వెళ్ళిపోయింది. అలా కోమాలోనే ఏడాదికి పైగా ఉండి కన్నుమూసింది.

Comments

comments

Share this post

scroll to top