దూరమైన ప్రేయసిని తల్చుకుంటున్న ప్రేమికుడు..అనుకోకుండా అతని లైఫ్ లోకి వచ్చిన అమ్మాయి..వాళ్లిద్దరూ SOULMATES ఎలా అయ్యారనే..ఆసక్తికరమైన కథ “SOULMATE…”

దీపూ,మీ మామయ్య మెడలో చెయిన్ కు “శ్రీ” అని ఉంది అది ఎవరే అని అడిగింది పల్లవి … అదా పెద్ద స్టోరీ..ఇంచుమించుగా నిన్నుకోరి లాంటి స్టోరీ యే… కానీ మా మామయ్య తాగుబోతూ అవ్వలేదు..కెరీర్ పాడు చేసుకోలేదు అమ్మాయిని తల్చుకుంటూ బతుకుతున్నాడు..వేరొక అమ్మాయిని తన లైఫ్ లోకి రానివ్వకుండా….అని చెప్పి ఊరుకుంది దీపూ.. కానీ ఆ శ్రీ ఎవరో..ఆమె ఎక్కడుందో తెలుసుకోకుండా ఉండలేకపోయింది పల్లవి…కానీ తెలుసుకోవడం ఎలా.. చెప్తే దీపు చెప్పాలి..లేదా వాళ్ల మామయ్య ఉమామహేశ్వర్రావ్ చెప్పాలి…తనతో పల్లవికి అంత పరిచయం లేదు.. కలిసిందే ఒకసారి అది కూడా….

పల్లవి ,ఉమా మహేశ్వర్రావ్ ల పరిచయం ఎలా జరిగింది .. అనేదానితో మొదలై…వాళ్ల కథ వైజాగ్ బీచ్ రోడ్ లా ఎన్ని మలుపులు తిరిగింది..చివరికేమయింది అనేదే కథ…

 ఉదయం తొమ్మిదైతే కానీ తెల్లవారేది కాదు పల్లవికి..హస్టల్లో ఉంటూ చదువుకుంటుంది.. కాలేజ్,హాస్టల్,వైజాగ్ బీచ్ ,సెలవులకు ఇంటికెళ్లడం ఇదే తన ప్రపంచం…అందరి చేతుల్లో ఫోన్లు ఉండడంతో హస్టల్లో గోడగడియారమే ఉండేది కాదు…కళ్లు నులుముకుంటూ టైమెంత అవుతుందా అని తల దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని చూద్దామనేసరికి ఫోన్ స్విచ్చాఫ్ లో ఉంది.. రూమ్ లో ఎవరూ లేరు ఎవర్నన్నా అడుగుదామంటే….లేచి ఛార్జింగ్ పెట్టినా ఆన్ అవ్వదే.. బ్యాటరీ తీసి తుడిచి పెట్టింది అయినా కూడా…నోకియానే కదా నైట్ కింద పడింది ఆన్ అవ్వట్లే మళ్లీ కింద పడేస్తే ఆన్ అవుద్దని మళ్లీ ఒకసారి విసిరికొట్టింది…ఉన్నది రెండు ముక్కలైంది…ద్యావుడా ఇప్పుడు ఇది బాగుచేయించడం ఎలా పొద్దున్నే లేచి ఎవరి మొఖం చూసానో ఏంటో అని తిట్టుకుంది…
వాస్తవానికి తన మొఖమే చూస్కుంది… అదెలా అంటే… ఆ హాస్టల్ బిల్డింగ్ ఒక పాడుబడిన పాత పెంకుటిల్లులా ఉంటుంది..అచ్చంగా చంద్రముఖి డ్యాన్స్ వేసే గదిలాంటి పెద్ద వరండా ఒకటి మధ్యలో ఉంటుంది… అక్కడ ఉన్న పెద్ద అద్దాన్ని తీసుకొచ్చి వాళ్ల రూంలో పెట్టించుకుంది…ఆడపిల్ల అద్దం గురించి వేసే జోకుల్ని చాలా సీరియస్ గనే తీసుకుంటుంది పల్లవి .. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ అద్దమే మరీ.. దాని గురించి తన గురించి ఏమన్నా అంటే ఎలా ఊరుకుంటుంది..లేవగానే అద్దంలో మొఖం చూసుకుంది అదీ సంగతి…
సరే అద్దం కథ వదిలేసి..ఫోన్ దగ్గరకొద్దాం..అప్పుడే ఫ్రెష్ అప్ అయి రూం లోకి వచ్చిన దీపూ తల తుడుచుకుంటూ..త్వరగా రెడీ అవ్వవే ఈ రోజు ఏయూ లో ఎగ్జిబిషన్ ఉంది వెళ్దాం అనుకున్నాం గా మర్చిపోయావా అంది… ఎగ్జిబిషన్ తర్వాతే నా ఫోన్ పాడయిపోయింది…ఎలా అంటూ.. బుంగమూతి పెట్టుకుని కూర్చుంది..ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవ్ అని పల్లవి అనగానే…దానికి టెన్షన్ ఎందుకు డాబా గార్డెన్స్ దగ్గర మా మామయ్య షాప్ ఉంది..అక్కడ బాగు చేయిద్దాం ..డబ్బులు తర్వాత ఇవ్వొచ్చు అనగనే రెక్కలొచ్చినట్టయి…గబ గబ రెడీ అయి…రోజూ పెట్టే ఉప్మాని .. కుక్ ని.వార్డెన్ ని తిట్టుకుంటూ ఏదో బ్రేక్ ఫాస్ట్ అయిందనిపించి హాస్టల్ నుండి బయటపడ్డారు…వన్ టౌన్ నుండి డాబాగార్డెన్స్ బోలెడు బస్సులు…డాబా గార్డెన్స్ లో దిగి సరాసరి వాళ్ల మామాయ్య షాప్ కి వెళ్తే అతను లేరని అక్కడున్న ఒకతను చెప్తే…అతనికే ఫోన్ ఇచ్చి దీపిక వచ్చింది ఈ ఫోన్ బాగ చేయమని చెప్పిందని చెప్పి… అక్కడి నుండి సరాసరి ఎయూ కి వెళ్లిపోయారు…..
సాయంత్రం రిటర్న్ లో హస్టల్ కి వెళ్లేప్పుడు ఫోన్ గురించి కనుకుందాం అని షాప్ కి వెళ్తే వాళ్ల మామయ్య ఎవరో కస్టమర్ తో మాట్లాడుతున్నారు…మామయ్య అంటే పెద్దాయన అనుకున్న పల్లవి అతన్ని చూడగానే షాక్ అయింది అటు ఇటుగా ముప్పయికి దగ్గరుంటుండొచ్చు..మరీ హైట్ కాకపోయినా ఫేస్ కట్,నవ్వు కొంచెం చూడడానికి గోపిచంద్ లా ఉన్నాడు..ఆంధ్రాలో మేనమామకి ఇచ్చి చేస్తారు కాబట్టి ఏమే మీ మామయ్య చూడ్డానికి బాగున్నాడు కదా..నిన్నిచ్చి చేస్తారా అని అడిగింది పల్లవి దీపూని…మా అక్కనే చేసుకోలేదు నన్నేం చేసుకుంటారు అని…మా మామయ్య మమల్ని ఆ ఉద్దేశ్యంతో చూల్లేదు..మేం కూడా అలా అనుకోలేదే ఎప్పుడూ అంది దానికి వాళ్ల మామయ్య అంటే ఇష్టం కన్నా గౌరవం ఎక్కువ అని తన మాటలని బట్టి అర్దం అయింది… కస్టమర్ వెళ్లపోగానే దీపిక వెళ్లి మావయ్య పొద్దున్న ఫోన్ ఇచ్చి వెళ్లాం ,బాగు చేసావా అనగానే …రేపు సాయంత్రం ఇస్తాను అని ఒకే ఒక మాట ఆన్సర్ గా చెప్పి..ఇక మీరు వెళ్లొచ్చు అన్నట్టు రియాక్షన్ ఇచ్చాడాయన….మొఖంలో కోపం లేదు కానీ అమ్మాయిలతో ఎక్కువ మాట్లడడు అనే విషయం అర్దం అయింది పల్లవికి ..ఎందుకంటే ఫోన్ కింద పడింది పెద్ద ప్రాబ్లం ఏం ఉండదు అని పల్లవి మాటలు మద్యలో ఉండగానే..దీపికా రేపు ఈవెనింగ్ ఇస్తా అని చెప్పాకదా ఇక వెళ్లండి అని పల్లవి వైపు చూడను కూడా చూడకుండా చెప్పి తన పనిలో పడ్డాడు..ఆ రెండు నిమిషాల్లోనే పల్లవి దృష్టి అతని మెడలో ఉన్న చెయిన్ పై పడింది ..అబ్బాయిలు గోల్డ్ చెయిన్ వేసుకుంటేనే వింతగా ఉంటుంది..అలాంటిది దానికొక లాకెట్… అదే”శ్రీ” అనే అక్షరం…. ఎవరైనా దేవుడా…లేకపోతే అతని పేరా..లేకపోతే అమ్మా,నాన్నా,అక్కా ,చెల్లి ఎవరి పేరబ్బా…అది…..అనుకుంటూ బయటికి వచ్చి దీపూ ని అడిగితే దానిగురించి అడగకే నీకు చెప్పానని తెలిస్తే మా మావయ్య నన్ను తిడతాడు…అయినా అదొక పెద్ద స్టోరీ అని ఊరకుంది… హాస్టల్ కి వెళ్లి డిన్నర్ కానిచ్చి,పొద్దున్నే లేచి ఉతకాలని కొన్ని బట్టలు నానపెట్టి,చంద్రముఖి వరండాలోవేరే రూం వాళ్లతో కాసేపు మాటలయ్యాక…రూం కి వచ్చింది…కానీ అంతసేపూ కూడా శ్రీ గురించే ఆలోచనలు…ఎవరై ఉంటారా అని….ఎవరై ఉంటారూ ఒకరు పెళ్లి చేసుకోకుండా ఉన్నారంటే ఖచ్చితంగా లవరే..కానీ ఆమె ఎక్కడుంది…ఏం చేస్తుంది… పెళ్లి చేస్కుందా పిల్లలా…ఇలా ఏవేవో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది…

తెల్లవారితే గురువారం ఏరోజైనా తొమ్మిదికి లేస్తుందేమో కానీ గురువారం మాత్రం ఆరింటికే లేస్తుంది పల్లవి..దానికి కారణం కనకమహాలక్ష్మి…నిన్న కథలో ఈ క్యారెక్టర్ రాలేదే అనుకుంటున్నారా..మరే ..హస్టల్ నుండి పది కాదు కాని ముఫ్పై అడుగులేస్తే కనకమహాలక్ష్మి గుడి… కాంప్లెక్స్ లోని సంపత్ వినాయక్,ఇక్కడ కనకమహాలక్ష్మి చాాలా ఫేమస్… పల్లవి గురువారం పొద్దున్నే లేచేది గుడికెళ్లడానికి..అక్కడ పెట్టే చక్కెర పొంగలి కోసం..ఎనిమిది దాటితే పొంగలి ఉండదు మరీ..
సింహచలంలో చక్కెర పొంగలి తినాలంటే పొద్దున్నే నాలుగింటికి లేచి అయిదింటికల్లా రెడీ అయి బస్ లో ఉండేది..అంత ఇష్టం చక్కెర పొంగలంటే..
శ్రీ గురించి ఆలోచిస్తు పడుకున్న పల్లవి చక్కెర పొంగలి గుర్తొచ్చి నిద్రలేచింది..హస్టల్లో బావిలో నుండి వాటర్ చేదుకోవాలి.. నిద్రమత్తుతోనే బావి దగ్గరకు వచ్చింది..నీళ్లు చేదుకుని బ్రష్ చేసి,స్నానం కానిచ్చి…రెడీ అయి..గుడికి బయల్దేరింది…
.
వైజాగ్ ఎంత ప్రశాంతమైన నగరమో..వన్ టౌన్ కొంచెం భయంకరంగానే ఉంటుంది… పోర్టు ఏరియా కావడం వల్ల ఏరియా అరమందం దుమ్ము పట్టి ఉంటుంది..మనుషులు కూడా అలాగే ఉంటారు..కంపెనీలు ఎక్కువగా ఉంటాయి..ఒక్కొసారనిపిస్తుంది ఇది వైజాగేనా అని..కానీ అలల చప్పుడు హా నువ్ ఉన్నది వైజాగ్ లోనే అని గుర్తు చేస్తుంటాయ్ పల్లవికి..
ఇండియాలో జనాబా పెరిగిపోయిందంటే ఏంటో అనుకున్నా ఇంత పొద్దున్నే ఇంత రష్ ఏంట్రా బాబూ గుళ్లో అనుకుంటూ..లైన్లో నిల్చుంది..పావుగంటకి అమ్మవారి దర్శనం అయి..బయటికి వచ్చి చక్కెర పొంగలి తీసుకుని గుడిలో అందరూ కూర్చునే ప్రదేశంలో ప్లేస్ చూస్కుని పొంగలి టేస్ట్ ని ఆస్వాదిస్తూ తింటూంది…మళ్లీ గుర్తొచ్చింది ”శ్రీ”.. ఈరోజెలాగైనా దీపికనుండి ఈ విషయం రాబట్టాలనుకుంది…హాస్టల్ కి వెళ్తూ మధ్యలో టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి రెండు దోసెలు పార్శిల్ చేయించుకుంది..రోజూ తినే ఉప్మా పై విసుగురాదా మరీ….

హాస్టల్ కి వెళ్లేసరికి పిల్లలంతా చంద్రముఖి వరండాలో ఏదో వెతుకుతున్నారు..ఇంత ఉదయాన్నే ఏమయింది అనుకుంటూ..మొదటగా ఎదురైన వరలక్ష్మిని ఏమయిందే అని అడిగింది. అరుణది చెవిపోగు పడిపోయిందే అని చెప్పగానే ..వరండాలోకి వెళుతూ వెతికి ఇస్తే నాకు ఏంటి అంది…ముందు వెతికి ఇవ్వవే బాబూ..ఈవెనింగ్ నీకు ఇష్టమైన ఇరానీ చాయ్ తాగిపిస్తా అనగానే…కుక్ దగ్గరకు వెళ్లి వార్డెన్ రూంకి వెళ్లి చంద్రముఖి వరండాలో లైట్స్ అన్ని స్విచెస్ ఆన్ చేయమంది…అంత పెద్ద వరండాలో లైట్లు ఎప్పుడూ వేసి ఉండవ్ ఆ మూల ఒక్కటి వెలుగుతుంటుంది అంతే ..అరుణ నీది ఇంకొక ఇయర్ రింగ్ ఇవ్వవే అంది..ఎందుకే ఆర్యా సినిమాలోలా ఇదికూడ విసిరేస్తావా వద్దులేవే తల్లీ నేనే వెతుక్కుంటా అనగానే..ఎహే చెవిపోగు ఎలా ఉంటదో చూస్తా అని తీసుకుని ..అందరూ పక్కకి జరగండి అంది..ఈ లోపు హాల్లో లైట్స్ అన్ని వెలిగాయి..చుట్టూ చూస్తున్న పల్లవికి ఒక దగ్గర లైట్ వెలుతురు పడి చమక్ చమక్ మెరుస్తున్న చెవిపోగు కనపడింది..అది తీస్కెల్లి అరుణకి ఇచ్చి ఇరానీ చాయ్ మర్చిపోకు అంది..గబగబా తన రూంలోకి వెళ్లీ దీపూ రా టిఫిన్ చేద్దాం అని..దాన్ని ఎలా మాటల్లో దింపాలా అని దోసెని చెట్నీలో ముంచి నోట్లో వేసుకుంది..దీపూ ఫోన్ కి ఎప్పుడెల్దామే అంటే..మావయ్య చెప్పారు కదా ఈవెనింగ్ అని..అప్పుడు నువ్వే వెళ్లి తెచ్చుకో అంది..నేనా..మీ మావయ్య నా మొఖం కూడా సరిగా చూడలేదు..నన్ను గుర్తుపడ్తారో లేదో..డబ్బులు కూడా ఇవ్వను ఏమనుకుంటారో అని అంటే ఏమీ అనుకోడు నాకు కుదరదు నేను కాల్ చేసి చెప్తా ..నువ్ వెళ్లి తెచ్చుకో అని తను టిఫిన్ చేయడానికి కూర్చుంది..సరేకానీ శ్రీ గురించి చెప్పవే అని మెల్లిగా అడగ్గానే..నువ్ ఇంకా మర్చిపోలేదా తల్లీ..సాయంత్రం వెళ్లాక మా మామయ్య దగ్గర ఆ మాట ఎత్తకు ..ముందు నన్ను చంపేసి గొయ్యితీసి కప్పెట్టేస్తాడు అంది..నేను మీ మామయ్యను అడక్కూడదు అంటే నువ్వే చేప్పు మరీ అని పల్లవి మాట పూర్తి చేసేలోపు నువ్ అడిగినా అడిగేస్తావే బాబూ..నాకు నీ వాలకం చూస్తే భయమేస్తుంది..చెప్తాకానీ ఎవరికీ చెప్పొద్దు..మా మామయ్య దగ్గర కానీ,మా ఇంట్లో వాళ్ల దగ్గరకాని ఎప్పుడూ ఈ టాపిక్ మాట్లాడొద్దు అని ఒట్టు వేయించుకుంది…శ్రీ,మా మామాయ్య లవర్..తన పూర్తి పేరు ఉషశ్రీ ..ఇప్పుడు తను ఈ లోకంలో లేదు..చనిపోయి ఎనిమిది సంవత్సరాలయింది…అని అది చెప్తుంటే ఒక్కసారిగా ఉలిక్కిపడి నోట్లో పెట్టుకోబోతున్న దోసె ముక్కని మళ్లీ ప్లేట్లో పడేసి……చ..ని..పో..యిం..దా…. అంది పల్లవి…

సాయంత్రం కాలేజ్ నుండి తిరిగి హాస్టల్ కి వస్తూ మధ్యలో ఢాబాగార్డెన్స్ దగ్గర బస్ దిగి భయంభయంగానే షాప్ లోకి వెళ్ళింది పల్లవి, మొబైల్ పల్లవికి ఇచ్చి ఒకసారి చెక్ చేసుకోండి అని అతను అనగానే…డిస్ ప్లే ఒకె,కాల్ చేసి చూడండి ఒకసారి అని నంబర్ చెప్పింది పల్లవి మహేశ్ తో…అంతా ఒకే..థ్యాంక్సని చెప్పి బయటికి వచ్చి…కొంచెం దూరం ఏదో ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తున్న పల్లవి ఒకసారిగా ఆగి ఇందాక కాల్ చేసిన నంబర్ తనదే కదా అని థ్యాంక్స్ అని మళ్లి మెసేజ్ చేసింది ..అటు నుండి నో రిప్లై … రాత్రి ఎనిమిదింటప్పడు గుడ్ నైట్ మెసేజ్ చేసింది..నో రిప్లై…
దీపూ అని పిలిచింది..చెప్పు అని కాలిగోర్లకు నెయిల్ పాలిష్ వేసుకుంటూ అడిగింది దీపూ..అదేంటంటే..శ్రీ ఎలా చనిపోయింది అని మెల్లిగా అడిగింది….చెప్పే వరకు నువ్ కుదురుగా ఉండనివ్వవూ..కర్మకాలి తీస్కెళ్లా నిన్ను మా మావయ్య దగ్గరికి అని తిట్టుకుంటూనే ..పద బట్టలుతుక్కుంటూ మాట్లడదాం..నిన్న రాత్రి నానబెట్టావ్ గుర్తుందా అని తిట్టింది….బావి దగ్గరకు వెళ్లి ఆ రాత్రి దెయ్యాల్లా బట్టలుతుక్కుంటూ మాట్లాడుకుంటుంటే…హాస్టల్ లో మిగతా వాళ్లకి ఏ డిస్టబెన్స్ ఉండదు కానీ…ఆకాశంలో చందమామకి మాత్రం డిస్టబెన్స్ గానే ఉంది…నూతిలోని నీళ్లలోచందమామ ప్రతిబింబాన్ని చూడగానే పల్లవికి తను మొఖం అద్దంలోచూసుకుంటే ఎలా ఫీల్ అవుతుంది చందమామా అలాగే ఫీలవుతుందేమో అనుకుంటూనే బావిలోకి చేదని వేసింది..నీళ్ల కదలికకి చందమామా రూపం చెదిరిపోయింది..అదీ చందమామకి కలిగించిన డిస్టబెన్స్..
శ్రీ చనిపోయిందా..ఆమెని తలుచుకుంటూ మీ మావయ్య ఇలా ఉన్నారా…ఎలా చనిపోయింది అని ప్రశ్నల వర్షం స్టార్ట్ చేసింది పల్లవి.. అది చెప్పడానికే కదా తీసుకొచ్చా..కొంచెం ఆగుతావా అంది దీపూ….మార్టిన్ కాయిల్ అలా కొన్నేళ్లు వెనక్కి తిప్పితే….
మహేశ్ , ఉషశ్రీ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ..ఉష శ్రీ చాలా బాగా చదివేది.. ఇద్దరికీ చదువులో పోటీ..వారు పెరుగుతున్న కొద్దీ వారి స్నేహం ప్రేమగా మారింది..ఉషాని మహేశ్ మాత్రమే శ్రీ అని పిలిచేవాడు.. మహేశ్ బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవాడు,శ్రీ నర్సింగ్ కోర్సు … మహేశ్ కి జాబ్ వస్తుందని శ్రీ కి చాలా నమ్మకం…ఇద్దరూ సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకున్నారు….
కులం,ఆస్తులేమన్న అడ్డొచ్చాయా అని మధ్యలో క్వశ్చన్స్ స్టార్ట్ చేసింది పల్లవి…లేదే వారు మాకు దూరపు చుట్టాలేనట..వాళ్లకి ఆస్తి ఉంటే మావయ్య మంచితనమే తన ఆస్తి.. ఏ తండ్రైనా ఏం కొరుకుంటాడు..మంచి ఉద్యోగం ఉన్న కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు…ఆ ఉద్యోగమే వచ్చేస్తే నాన్న అడ్డు చెప్పరూ అనే దైర్యంతో ఉంది శ్రీ… శ్రీ కి వాళ్ల నాన్న అంటే చాలా గౌరవం…తనకి కూడా కూతురంటే చాలా ఇష్టం… మరి సమస్యెక్కడొచ్చిందే అంది పల్లవి ఏం జరిగిందో అని తెలుసుకోవాలన్న ఆరాటంతో…
మహేశ్ బ్యాంక్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు.. కాల్ లెటర్ వచ్చింది..శ్రీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ కి వచ్చేసింది..ఈ నెలలోనే నాన్న బర్త్ డే ..అదే రోజు శ్రీ బర్త్ డే కూడా…ఆ రోజే నీ కాల్ లెటర్ చూపించి మన ప్రేమ విషయం కూడా ఇంట్లో చెప్పేస్తా…నా పుట్టిన రోజు కానుకగా నిన్ను ఇచ్చి పెళ్లి చేయమంటా అని మహేశ్ తో చెప్పి కాలేజ్ నుండి ఇంటికెళ్లింది.. శ్రీ కి నెల నెల కడుపునొప్పి వస్తుంది..అదేవిధంగా ఒకసారి కాలేజ్ కి వెళ్లాక పెయిన్ స్టార్ట్ అయితే మహేశ్ కి కాల్ చేసి ట్యాబ్లెట్ తెమ్మని అడిగిందట..ట్యాబ్లెట్ తీస్కెళ్లి ఇవ్వడం..అది చూసిన అక్కడే పనిచేసే అటెండర్ ..శ్రీ వాళ్ల నాన్నతో మీ అమ్మాయి,మహేశ్ చనువుగా తిరుగుతున్నారు..ఇప్పుడు మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అది పోగొట్టుకోవడానికి వాడు ట్యాబ్లెట్స్ తెచ్చిచ్చాడు..ఈ రోజు మీ అమ్మాయి అవి వేసుకోవడం నేను కళ్లారా చూసాను అని ఒకటికి పది కల్పించి చెప్పాడు..ఏ తండ్రైనా కూతురుపై ఇలాంటి మచ్చ పడితే సహించలేడు..
కాలేజ్ నుండి వచ్చిన శ్రీని నిలదీయడం..శ్రీ ఎంత చెప్పిన నమ్మకపోవడం..రెండురోజులుగా ఇంట్లో నిశ్శబ్దం…మూడోరోజు శ్రీ వాళ్ల నాన్న బర్త్ డే..తనబర్త్ డే కూడా .. శ్రీ కి ఇష్టమైనా రోజు. ..ఆ రోజే మహేశ్ కాల్ లెటర్ నాన్నకి చూపించి తన ప్రేమ విషయం చెప్పాలనుకుంది..కానీ ఇప్పుడు పరిస్థితి తనేం చెప్పినా ఇంట్లో ఎవరూ వినేలాలేరు..ప్రాణఆనికి ప్రాణంలా చూసుకునే నాన్న కన్న కూతుర్ని ఒక్క మాట అడక్కుండా పరాయివాళ్ల మాటల్ని పట్టించుకోవడం శ్రీ జీర్ణించుకోలేకపోయింది..


ప్రియమైన నాన్న,
హ్యాపీ బర్త్ డే నాన్న..మీరు నన్ను తిట్టారనో,అమ్మ కొట్టిందనో నేను బాద పడట్లే,కానీ మీ ఇద్దరూ ఆ పని చేయడానికి ముందు నన్ను ఒక్క మాట ఎందుకడగలేదా అని బాదపడ్తున్నా..పరాయివాడు చెప్పే మాటలు విన్న నువ్ నా మాట ఒకే ఒకసారి విని ఉంటే బాగుండేది నాన్న..మహేశ్ నేను ప్రేమించుకున్న మాట వాస్తవం..కానీ పెద్దవాళ్లని ఒప్పించాకే పెళ్లి చేసుకోవాలని మీకు గౌరవం ఇవ్వడం మేం చేసిన తప్పా నాన్నా..ఎందుకు నాన్న పిల్లలకంటే పరువుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు..ఈ రోజు మీకు నాపైన కంప్లైట్ చెప్పినవాడిది నిజమని నమ్మిన నువ్వు  నేను నిజం చెప్పినా నమ్మే పరిస్థితిలో ఎందుకు లేవు నాన్నా… కొన్నిసార్లు మన కళ్లు,చెవులు కూడా మోసం చేస్తాయి..కొన్ని సమస్యలకు మనసు మాత్రమే పరిష్కారం చెప్తుంది..నీ కూతురికి ఒక్కసారి మాట్లాడే ఛఆన్స్ ఇచ్చి ఉంటే నీ మనసు నీ మాట వినేదేమో… ఇప్నుడు నేను ఎన్ని చెప్పినా నువ్ వినవ్ నాన్న..మహేశ్ కి ఉద్యోగం వచ్చింది అని ఆ కాల్ లెటర్ చూపించి నా బర్త్ డే గిఫ్ట్ గా మా పెళ్లి చేయమని అడగాలనుకున్నా..కానీ కానీ… నీ బర్త్ డే కి నేను నీకు గిఫ్ట్ ఇస్తున్న …నీ కూతురు ఏ తప్పు చేయలేదని నువ్ నమ్మే గిఫ్ట్ …రేపు వచ్చే పోస్టుమార్టం రిపోర్ట్..
ఇట్లు
నీకూతురు ఉషా…

అని లెటర్ రాసి శ్రీ సూసైడ్ చేసుకుంది..పోస్టుమార్టం రిపోర్టు వచ్చేలోపే శ్రీ చావుకు మావయ్యే కారణం అని శ్రీ మేనమామలు కేసు పెట్టి అరెస్ట్ చేయించారు..కూతురు పోయిందనే బాదలో వాళ్ల నాన్న మౌనంగా ఉండిపోయారు..మావయ్యకి జరగాల్సిన నష్టం జరిగింది.. శ్రీ దూరమైన బాద ఒకవైపు..మరోవైపు ఈ కేసుతో వచ్చిన ఉద్యోగం పోయి …మావయ్య మళ్లీ మామూలు మనిషవడానికి రెండు మూడేండ్లు పట్టింది..ఇప్పుడు మావయ్య వర్క్ చేస్తున్న షఆప్ వాళ్ల ఫ్రెండ్ ది..దాని మెయింటెనెన్స్ చూసుకుంటూ..తనకొచ్చిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు….అని చెప్పడం అవ్వగానే పల్లవి నవ్వు స్టార్ట్ చేసింది..అవును ఆత్మహత్యలు చేసుకునే వారంటే పల్లవికి అసహ్యం…ఎదుర్కోలేనంత పెద్ద సమస్యలేవి మనిషికి రావని పిరికి వాల్లే ఆ పని చేస్తారని ..చస్తూ చస్తూ వాళ్లు చావకుండా ఇతరులను బాదపెడ్తారని వాళ్లపై కోపం..ఆ కోపం ,అసహ్యం లోనుండి వచ్చిందే ఆ నవ్వు….

ఆ రోజు నుండి పది పదిహేను రోజులు గుడ్ నైట్,గుడ్ మార్నింగ్ మెసేజ్ లు చేస్తూనే ఉంది..అయినా నో రెస్పాన్స్ … ఒకరోజు మద్యాహ్నం క్లాస్ రూంలో దీపూ ఈరోజు మనం మీ మావయ్య వాళ్ల ఇంటికెల్దాం అంది… ఒక్కసారిగా ఉలిక్కిపడి ..ఏంటే మా మావయ్యతో సంథింగ్ సంథీంగ్ ఆ అని అంటే సంథింగా నా మొఖమా.. శ్రీ ని చూద్దామని…అంతలేదు ఇప్పటివరకు మా మావయ్య రూంలోకి నేనే వెళ్లలేదు..నువ్ వెళ్తావా…మా మావయ్య రూంలో గోడకి శ్రీ స్కెచ్ ఉందని అంటారే నేనెప్పుడు చూల్లేదు అని ఆ నైట్ దిపిక చెప్పిన మాట ..శ్రీ ని చూడాలని పల్లవి అనుకోవడానికి రీజన్.. క్లాస్ అవ్వగానే అల్లిపురం లో బస్ దిగి..బస్టాండ్ నుండి నాలుగు అడుగుల దూరంలో ఉన్న దీపు వాళ్ల అమ్మమ్మ ఇంటికి చేరుకున్నారిద్దరూ…హాల్,కిచెన్,బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంది ఇల్లు,బాల్కనీలో మొక్కలు,వాటికి పూలు భలే బాగున్నాయ్…మరో బెడ్రూమ్ లో గోడకి శ్రీ స్కెచ్ ఉందేమో డోర్ పెట్టుంది….ఎలా వెళ్లడం..వాళ్ల అమ్మమ్మ ఏమన్నా అనుకుంటారేమో.. ఈలోపు టీ తెచ్చింది అమ్మమ్మ..హాల్లో కూర్చుని టీ తాగుతూ టివీ చూస్తూ ..మరోవైపు బెడ్రూమ్ లో ఉన్న శ్రీ స్కెచ్ ని చూడ్డం ఎలా అనేదే ఆలోచిస్తుంది పల్లవి… ఇంతలో మహేశ్ వచ్చాడు…పలకరింపు గా నవ్వి కాసేపుండి బయటికి వెళ్లిపోయాడు..మహేశ్ ఉన్నంతసేపు పల్లవి ఆలోచనలు కూడా స్థంబించిపోయాయి..ఇక స్కెచ్ మ్యాటరేం గుర్తుంటుంది.. దీపూ,పల్లవి కూడా హాస్టల్ బయల్దేరారు..బయల్దేరే ముందు పల్లవి మహేశ్ కి ఒక మెసేజ్ చేసింది బై అండీ అనీ…నో రిప్లై ..

సడన్ గా ఒకరోజు మహేశ్ నుండి మెసేజ్ వచ్చింది నిన్ను కలవాలి,నీతో మాట్లాడాలి అనీ…. అర్రె నేను కదా ఇలా మెసేజ్ చేయాలనుకున్న ఇతనుచేశారేంటి అని ఆశ్యర్య పోయింది పల్లవి…రేపు కలుస్తాను తెన్నేటి పార్క్ లో అని మెసెజ్ పెట్టి పడుకుంది…మహేశ్ పల్లవిని ఎందుకు కలవాలనుకున్నాడు..

ప్రతిరోజులానే ఆ రోజు దీపిక,పల్లవి కాలేజ్ కి బయల్దేరారు..కానీ ఎప్పుడు ఉరికే జలపాతంలా హుషారుగా ఉండే పల్లవి ..చాలా సైలెంట్ గా ఉండడం దీపికకే కాదు,హాస్టల్ లో అందరికీ వింతగానే ఉంది..మహేశ్ ఎందుకు పిలిచుంటాడు..నెల రోజులుగా నేను మెసేజ్ చేస్తుంటే ఒక్కసారి కూడా స్పందించని వ్యక్తి సడన్ గా ఏం మాట్లాడాలనుకుంటున్నాడు… దీపికతో ఈ విషయం ఎలా చెప్పాలి..అని ఇవే ఆలోచిస్తూ బస్ స్టాండ్ వరకూ వచ్చింది..పక్కనే దీపిక ఉన్నాకూడా తనచుట్టూ ఎవరూ లేనట్టే ఉంది పల్లవికి…. హాస్టల్ నుండి ఇరవైనిమిషాలు ఉమెన్స్ కాలేజ్..ఇద్దరూ చదివేది ఎమ్ ఏ సోషల్ వర్క్ ఫస్ట్ ఇయర్…బస్ లో వెళ్తున్నంతసేపు కూడా దీపూనే మాట్లాడ్తుంది…ఏంటే సైలెంట్ గా ఉన్నావ్ అని వచ్చిన దీపూ మాటకి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి…ఏం లేదే… ఈవెనింగ్ బయటికి వెళ్లాలి..ఇప్పుడు నాకు కాలేజ్ కి కూడా రావాలనిలేదు…నువ్ వెళ్లు అంటూ దీపికకి బై చెప్పి జగదాంబలో దిగిపోయి సరాసరి rk బీచ్ కి వెళ్లింది… పల్లవి సంతోషంగా ఉన్నా,బాదగా ఉన్నా…ఏ చిన్న డిస్టర్బెన్స్ అయినా ముందు సముద్రంతోనే చెప్పుకోవాలనుకుంటుంది… సముద్రం అంటే ఎంత ఇష్టం అని ఎవరైనా స్కేల్ పెట్టి ఆ ఇష్టాన్ని కొలిస్తే తానే ముందుంటుంది… ఇసుకలో నిల్చుని వచ్చీ పోయే అలలు కాళ్లను తగుల్తుంటే..మహేశ్ ఏం మాట్లాడాలనుకుంటున్నాడు…ఇదే ఆలోచన….

మధ్యాహ్నం హాస్టల్ కి వచ్చి పడుకుంది..కలతనిద్ర..కలలుకనండి అని కలాం గారెంత చెప్పినా… నిద్రైనా ప్రశాంతంగా పోనివ్వరా అంటూ ఏ కలలు రాని నిద్రని కోరుకుంటుంది పల్లవి..ఎప్పుడు నిద్రలోకి జారుకుందో..హఠాత్తుగా ఐదింటికి మెలకువ వచ్చి,టైం చూస్కుని హడావిడిగా రెడీ అయి తెన్నేటి పార్క్ కి బయల్దేరింది.వెళ్తుండగా మద్యలో ఫోన్ కి మెసేజ్ వచ్చింది..వెయిటింగ్ ఫర్ యూ అని..చేసింది మహేశ్..పల్లవి ఆశ్చర్యం మరింత ఎక్కువవుతుంది..నేను వచ్చాను అని చెప్పాక కానీ తాను రాడనుకుంది..కానీ తనకంటే ముందే అక్కడ ఉండి నాకోసం వెయిట్ చేస్తున్నాడా…..

అప్పుడప్పుడే చీకటి పడ్తున్న టైంలో ఆటో దిగి పార్క్ వైపు అడుగులేస్తుంటే….చల్లగాలి ,సముద్రపు అలల హోరు…వాతావరణం ఎంతో ఆహ్లదకరంగా ఉంది….ఎన్నోప్రేమ పక్షులు కబుర్లు చెప్పుకుంటున్నాయి…వాటిల్లో ఎన్ని ప్రేమ కథలు కంచికి చేరతాయో అని తనలో తాను అనుకుంటూ…మహేశ్ ఉన్నవైపుకి నడిచింది…తనకి ఇష్టమైన సముద్రాన్ని చూస్తూ….మహేశ్ దగ్గరకి చేరుకోగానే హాయ్ అని పలకరించింది….

’ఐ లవ్ యూ’’…. మహేశ్ నుండి వచ్చిన ఆ మాటకు షాక్ తిన్నది పల్లవి… నిన్ను మొదటిరోజు చూసినప్పుడే నేను చెప్పాలనుకున్న మాట…కానీ ఎలా …నువ్ ఎవరు..నేను నీకు ఎందుకు ఐలవ్ యూ చెప్తున్నా… అసలు నేను చెప్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది..దాని ప్రభావం దీపూతో నీ స్నేహంపై పడుతుంది…ఇన్ని రోజులు చనిపోయిన ప్రియురాలికోసమే బతికిన నేను ..నా కోడలి స్నేహితురాలికి ఐ లవ్ యూ చెప్పి విచక్షణ లేని మనిషి గా మిగిలిపోకూడదు..ఇలా ఎన్నో ఆలోచనలు కానీ…. ఇప్పుడు చెప్పకపోతే ఈ మాట ఇంకెప్పటికీ చెప్పలేను…

శ్రీని నేను ప్రాణంగా ప్రేమించా…తను కూడా అమ్మ, లక్ష్యమే లోకంగా బతుకుతున్న నా జీవితానికి ఎన్నో రంగులద్దింది..ఎంతో ప్రేమ పంచింది..మేం ఒకరి కొసం ఒకరం అన్నట్టు గా ఉండేవాళ్లం..ఒక ఆత్మ రెండు శరీరాలుగా బతికాం… ఇద్దరి ఆలోచనలు ఒకటి… తనకి నేనంటే ఎంతిష్టమొ అంతకు రెట్టింపు గౌరవం వాళ్ల పేరెంట్స్ అంటే ..అందుకే తన తల్లిదండ్రుల అనుమతితోనే తనని నా జీవితంలోకి ఆహ్వానించాలనుకున్నా…అందుకే శ్రీ ప్రతి రోజూ ఐ లవ్ యూ మహేశ్ అని చెప్తున్నా నా నుండి ఐ టూ కోరుకుంటున్నా… నా జీవితంలోకి ఆహ్వానించే రోజునే చెప్పాలనుకున్నా… తన పుట్టిన రోజున వాళ్ల నాన్న మా ప్రేమ విషయం యాక్సెప్ట్ చేసారని తెలిసిన మరుక్షణం నేను శ్రీ కి చెప్పాలనుకున్న మొదటి మాట ‘’ఐలవ్ యూ.’’… కానీ చనిపోయేముందు ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించకుండా వాళ్ల నాన్న ప్రేమకే విలువిచ్చి..మేం ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి తను ఆత్మహత్య చేసుకుంది… నా ప్రేమ,నేను చెప్పాలనుకున్న మాట నాలోనే సమాధి అయిపోయింది…

ఒకసారి శ్రీ ని మిస్ చేసుకున్నా..కానీ మళ్లీ అదే రూపంలో నా జీవితంలోకి వచ్చిన నిన్ను….స్వయంగా నా చేతులారా మిస్ చేసుకోలేను…అలా అని నిన్ను బలవంతంగా నా ప్రేమని అంగీకరించు అనేంత మూర్ఖున్ని కాదు…కనీసం శ్రీ కి చెప్పలేకపోయిన మాట నీకు చెప్పి ఇన్నేళ్లుగా నా గుండెల్లో మోస్తున్న బాద దించేసుకోవాలనుకుంటున్నా….
అంటూ తన పర్స్ లో ఉన్న శ్రీ పాస్పోర్ట్ సైజ్ ఫొటో పల్లవి చేతుల్లో పెట్టి..సముద్రం వైపు తిరిగి మౌనంగా రోధిస్తున్నా…తన గుండె ఎంత నలిగిపోతుందో ఆగకుండా తన కంటి వెంట కారుతున్న కన్నీరు చెప్తుంది…..

మహేశ్ ఐ లవ్ యూ చెప్పడం ఒక షాక్ అయితే తన చేతిలో పెట్టిన ఫొటొ చూసాక కాళ్ల కింద భూమి కదిలినట్టయింది పల్లవికి..మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారని విన్నది కానీ..తన లాంటి మనిషిని చూడడం పల్లవికి ఆశ్చర్యంగా అనిపించింది..అచ్చంగా తనలాగే ఉంది.. బ్లాక్ అండ్ వైట్ ఫొటో వలన శ్ర

ీ కలర్ ఏంటో తెలియట్లే కానీ…అప్పటివరకు సముద్రాన్ని చూస్తే ప్రశాంతతని ఫీల్ అయ్యే పల్లవికి తన ముందు వున్న సముద్రంలో అలలు భయంకరంగా అనిపిస్తున్నాయ్….

తన బాదని చెప్పుకుని మనసు భారం దించేసుకున్న మహేశ్ కళ్లు తుడుచుకుని.. పల్లవీ,నీ మెసేజ్ వచ్చిన ప్రతిసారి ఐ లవ్ యూ అని రిప్లై మెసేజ్ రాసి,ఎరేజ్ చేస్తూ ఉన్నా…. ఈ రోజు నా బాదని నా గుండెలనుండి ఎరేజ్ చేసేసా….బయలుదేరుదామా అని…దారి వైపు చేయి చాచాడు….
తన బాదని దించేసుకున్నాడు..మరి నేను ….నా పరిస్థితి ఏంటి తనకి అక్కర్లేదా…

శ్రీ గురించి తెలుసుకోవాలనుకున్నది ప్రతిదీ తెలుసుకోవాలనుకునే తన కుతుహలంతో…. మహేశ్ కి మెసేజెస్ చేసింది ఆత్మహత్య చేసుకుని దూరం అయిన మనిషి గురించి మీరు బాద పడ్తూ ,మీ చుట్టు ఉన్న వాళ్లని బాదపెడ్తూ సాధించేది ఏం లేదని చెప్పడానికి…. కానీ…ఇప్పుడు ఇలా… ఏం చేయాలో పాలుపోనీ…ఏం చేయలేని సంధిగ్దంలోనే ..ఆలోచనల సుడులు తిరుగుతుండగానే మొదటిసారి తనకు ఇష్టమైన సముద్రానికి బై చెప్పకుండానే వెనుతిరిగింది… మహేశ్ బైక్ ఎక్కి హాస్టల్ ముందు దిగింది…

పల్లవక్కా హాయ్…నువ్ వస్తే బావి దగ్గరకు రమ్మంది దీపికక్కా అని రూంలోకి వెళ్లబోతుంటే చెప్పింది జూనియర్ దేవి…బ్యాగ్ రూంలో పడేసి హాస్టల్ వెనుకగా ఉండే బావి దగ్గరకు వెళ్లింది…చేతిలో ఫొటో అలాగే ఉంది..దీపూ అని తనకి ఏదో చెప్పబోతుంటే..దీపూ నోటివెంట తనని పల్లవి అని కాకుండా .శ్రీ అనే పిలుపు విని హతాశురాలయింది…. సాయంత్రం హాస్టల్ కి వచ్చేసరికి నువ్ లేవ్… బోర్ కొడ్తుంది అని అమ్మమ్మ ఇంటికెళ్లా…మావయ్య లేరు..దైర్యం చేసి మావయ్య గదిలోకి వెల్లా గోడమీద ఉన్న శ్రీ స్కెచ్ చూసా…
రెండు జడలు,ఒక జడ ముందుకు,ఒక జడ వెనక్కి ,కాటుక కళ్లు, కుడి బుగ్గకి పుట్టుమచ్చ చూడగానే వారెవ్వా భలే బాగుందే ..అని అనుకోగానే ఈమెని ఎక్కడో చూసా అనిపించింది…ఎక్కడ ఎక్కడ అని ఆలోచిస్తుంటే కళ్ల ముందు నీ రూపం లీలగా ప్రత్యక్షమయింది. ..టేబుల్ పై మావయ్య డైరీ తను ఈ రోజు నీతో మాట్లాడాలనుకుంటున్న విషయం ..నువ్ అక్కడికే వెళ్లొచ్చావని అర్దం అయింది…మా మావయ్య ప్రేమ ఒప్పుకోవే అని నేను నిన్ను బతిమిలాడను..ఎందుకంటే నాకు మా మావయ్య అంటే ఎంత గౌరవమో..మన స్నేహం అంటే కూడా అంతే గౌరవం…
దీపిక మాటలకు ప్రాణం లేచొచ్చినట్టయింది పల్లవికి …

పల్లవి కి తన లైఫ్ కి సంభందించి కొన్ని ఆశలు,ఆశయాలు ఉన్నాయి.. తనలా ఉన్న మనిషిని చూసి షాక్ అయినప్పటికీ ఆ విషయాన్ని త్వరగానే మర్చిపోయి తన రోటీన్ లైఫ్ స్టార్ట్ చేసింది..తను మళ్లీ మహేశ్ కి మెసెజెస్ చేస్తే తాను కూడా తనని ప్రేమిస్తున్నా అనుకుంటాడేమో అని ..ఇప్పుడు తనెలాగు శ్రీ గురించి బాదపడట్లేదు..తాను కోరుకున్నది అదే చనిపోయినవారి కోసం బాదపడకుండా తమ వారి కోసం సంతోషంగా ఉండాలని..ఏదో రోజు మనమూ పోయేవాళ్లమే అని…
నెలరోజుల ఫీల్డ్ వర్క్ లో భాగంగా కాలేజ్ స్టూడెంట్స్ ఇద్దరిద్దరినీ ఒక్కొక్క ఊరికి పంపించారు కాలేజ్ వాళ్లు..దీపిక,పల్లవి నర్సీపట్నం దగ్గర ఒక చిన్న విలేజ్ కి వెళ్లారు…

చివరి రోజు హాస్టల్ కి బయలుదేరుతున్న టైంలో మహేశ్ చనిపోయాడనే కాల్ వచ్చింది పల్లవికి…
మహేశ్ ఎలా చనిపోయాడు..ఎందుకు చనిపోయాడు…

నర్సీపట్నం దగ్గర్లో చిన్న ఊరికి పల్లవి,దీపూ ఫీల్డ్ టూర్ కి వెళ్లారు. మొదటిరోజు ఊరంతా తిరిగి చూసారు.సమస్యలేం ఉన్నాయి అని.సాయంత్రానికి స్కూల్ దగ్గరకి చేరుకున్నారు. పిల్లలంతా ఎవరి ఆటల్లో వాళ్లున్నారు.సింగిల్ టీచర్ స్కూల్ అది.పొద్దుటి నుండి టీచర్ ఒక్కర్తే చూసుకోవడం వలన అనుకుంటా సాయంత్రం అయ్యేసరికి అలసిపోయినట్టు ఆమె మొఖం చూస్తే తెలిసింది.పిల్లలతో కాసేపు గడిపి ఆ ఊరి సర్పంచ్ ఇంటికెళ్లారు.వాళ్లకి నెల రోజులపాటు అకామిడేషన్ సర్పంచ్ ఇళ్లే.సర్పంచ్ ఆ ఊరికి అతనే పెద్ద దిక్కు .ఎంత పెద్ద సమస్య అయిన పరిష్కరించేది అతనే.గేటు తీసుకుని లోపలికి వెళ్తుండగా వారి వెనుకే అప్పుడే పట్నం నుండి వచ్చిన సర్పంచ్ పదండి అంటూ లోపలికి తీస్కెళ్లాడు.భార్యని పిలిచి వాళ్లెందుకొచ్చింది చెప్పి,టీ తీసుకుని రమ్మన్నాడు. హాల్లో కాసేపు కూర్చోని సర్పంచ్ భార్య తెచ్చిన టీ తాగుతూ గోడకి వేలాడుతున్న ఫొటోలు చూసింది
పల్లవి.ఇందిరాగాంధీ,నెహ్రూ,గాంధీ,పటేల్,వారితోపాటే రాజీవ్ గాంధీ ఫొటో కూడానూ..

సర్పంచ్ భార్య దీపికకి పల్లవికి వాళ్ల గది చూపించి అలసిపోయుంటారు ,కాళ్లు చేతులు కడుక్కుని కాసేపు రెస్ట్ తీసుకుని వస్తే భోజనం పెడతానంది.సరేనంటూ మంచంపై వాలిపోయింది పల్లవి.

మరుసటి రోజు పొద్దున్నే రెడీ అయి స్కూల్ కి వెళ్లొస్తాం అని బయల్దేరారు పల్లవి,దీపిక..ఎలా వెళ్తారు ఉండండి ఆటో పిలిపిస్తాను అని అన్న సర్పంచ్ తో మీరేమనుకోకపోతే ఆ మూలనున్న సైకిల్ని చూపిస్తూ అది మాకిస్తే ఏ ఆటో అక్కర్లేదు అంది పల్లవి.ఒహ్ అదా.. అది మా అబ్బాయిదమ్మా ఈ ఏడాది హాస్టల్ లో జాయిన్ చేశాం.ఇక దాన్ని వాడేవాళ్లే లేరు.ఈ నెలరోజులు కావాలంటే మీరు వాడుకోవచ్చు అని చెప్పి సైకిల్ తాళం వారి చేతిలో పెట్టాడు.వైజాగ్ ప్రశాంతమైన సిటీ అని అనుకుంటాం కానీ ఎంత పొల్యుషన్,ట్రాఫిక్ పెరిగిపోయిందే అని దీపికతో అంటూ చుట్టు ఉన్న పచ్చని చేలని చూస్తు గట్టువెంబడి సైకిల్ తొక్కుతూ స్కూల్ వైపు గా వెళ్లారు.

రోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒకే టీచర్ ని చూసి కొంచెం మొఖం మొత్తినట్టుంది..వీళ్లిద్దర్నీ చూడగానే పిల్లలందరూ గుడ్ మార్నింగ్ టీచర్ అంటూ లేచారు.మేం మీ టీచర్స్ కాదని,కాకపోయినా మీకు ఈ నెల రోజులపాటు పాఠాలు చెప్తాం అంది దీపిక.ఆ రోజంతా స్కూల్లోనే గడిపారు దీపిక,పల్లవి.సాయంత్రం పిల్లలందర్ని ఒక చోట చేర్చి వారితో పాటలు పాడిస్తుంటే పల్లవిని పాట పాడమని పిల్లలు ఒకటే గొడవ చేయడంతో ..

సరేనేను పాట పాడతాను కానీ సినిమా పాటకాదు..చిన్నపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపేస్తే..అమ్మని,తన ఊరిని తల్చుకుంటూ ఒక ఆడపిల్ల బాదపడ్తూ పాడిన పాట పాడతాను అంటూ…

”ఏడా ఉన్నాదో ముత్యాల మా పల్లే,ఎట్టా ఉన్నాదో నను గన్న నాతల్లీ
మా ఊరికెళ్లాల దోస్తుల్ని కలవాలా,కాళ్ల గోరింటెట్టి గుంటాట ఆడాలా….”

అంటూ పల్లవి పాట కంప్లీట్ అయ్యేలోపు పిల్లలే కాదు,టీచర్ కూడా కంటతడి పెట్టుకుంది..తర్వాత పల్లవి ,దీపూ ఎక్కడకనపడినా పిల్లలు ఆప్యాయంగా పలకరించేవారు,ఒకట్రెండు సార్లు స్కూలుకి టీచరే పిలిపించి వీళ్ల చేత కొత్తకొత్త విషయాలు చెప్పించేది.అప్పుడు పిల్లలు పల్లవి పాడిన పాట పుస్తకంలో రాయించుకుని అందరూ ప్రాక్టీసు చేస్తూ..టీచర్ మేం ఎవరం బాల్యవివాహాలు చేసుకోం,మా అమ్మానాన్నకి చెప్తాం,ఈ పాట వినిపిస్తాం అనగానే ఇప్పుడు కన్నీళ్లు పల్లవి కళ్లలో కానీ అవి బాదతో వచ్చినవి కాదు,ఆనందంతో వచ్చిన భాష్పాలు..

ఫీల్డ్ వర్క్ లో భాగంగా ఒకరోజు హరిజన వాడలో తిరుగుతూ వారి సమస్యల్ని తెలుసుకుంటున్నారిద్దరూ.అప్పుడే అక్కడికి చంటిబిడ్డని ఎత్తుకుని వచ్చింది ఒకామె.ఆ బిడ్డ ఎలా ఉందంటే నల్లటి నలుపు,ముక్కు నుండి చీమిడి కారుతూ చూడగానే అసహ్యం కలుగేలా ఉన్నా,ఆ పాప కళ్లు పల్లవి ని ఆకర్శించాయి.అమాంతంగా తల్లి చేతుల్లో నుండి పిల్లని తీసుకుని కర్చీఫ్ తో ముక్కు తుడిచి ముద్దుచేసింది..

తిరిగి సర్పంచ్ ఇంటికి రాగానే ఇంటి బయటే ఆగండమ్మా స్నానాలు చేసి ఇంట్లోకి రండి అంటూ వినపడిన మాటకి అక్కడే ఆగిపోయి ఎందుకూ అని ప్రశ్నార్ధకంగా మొఖాలు పెట్టిన వీళ్లని చూసి మీరు ఈ రోజు ఊరి చివర గుడిసెల దగ్గరకెల్లి వాల్లని ముట్టుకుని వచ్చారు అందుకు అని వచ్చిన సమాధానానికి నోరెళ్లబెట్టారు…
మొదటి రోజు హాల్లో ఉన్న ఫొటోలో అంబేద్కర్ ఫొటో ఎందుకు పెట్టేలేదు అని అడగాలనుకుని అడగని ప్రశ్నకి పల్లవికి ఈ రోజు సమాధానం దొరికింది.సరాసరి లోపలికెల్లి లగేజ్ తీసుకుని బయటకొచ్చేసింది ఎక్కడినుండి వచ్చారని స్నానాలు చేయమన్నారో అక్కడికేవెళ్లారు దీపిక,పల్లవి..

గుడిసె బయట చాప పరిచి కూర్చొండమ్మా అని లోపలికెళ్లింది ఇందాక చంటిబిడ్డని ఎత్తుకుని ఉన్న తల్లి రేణుక. సడన్ గా వీళ్లిద్దరూ వచ్చేసరికి, ఏం చేయాలో పాలుపోలేదు,భర్త వెంకన్నతో బయటికి వెళ్లి ఏమన్నా తీసుకురా అయ్యా అంది,నాకాడ డబ్బులు లేవే అని వెంకన్న నోటినుండి వచ్చిన సమాధానానికి ,పట్నం నుండి వచ్చిన అమ్మాయిలు ఈ రేతిరి మన ఇంటి దగ్గర ఉండానికి వచ్చినారు.ఇప్పడు వారికేటి వండిపెట్టాలి నా కాళ్లు సేతులు ఆడట్టేదు.సంపాదించిందంతా నువ్ తాగేత్తే ఇప్పుడ సూడు ఎంత కట్టమొచ్చినాదో అంది.

పల్లవి దీపిక లోపలికొచ్చి మా గురించి మీరు టెన్షన్ పడొద్దు అన్నం ,నీళ్లు,ఉప్పు ఉంటే చాలు అని,తమతో తెచ్చుకున్న పచ్చడి నంజుకుని తిని వారితో పాటే గుడిసె బయట పడుకున్నారు.

ఆకాశంలో చుక్కల్ని చూస్తూ దీపూ కులం లేదు, ఈ రోజుల్లో ఇంకా అంటరానితనం ఎక్కడుందే,కులం పేరుతో వేలెత్తి చూపితే ఎవరూరుకుంటారు అని నాతో వాదించేదానివి గుర్తుందా. ఈ రోజు నువ్ చూసిందేనే కులం..కేసులు,చట్టాల గురించే వీళ్లకి తెలిసుంటే ఈ రోజు మనం ఆ ఇంటి నుండి ఇక్కడికొచ్చినందుకు మనకేం పెట్టాలో టెన్షన్ పడకుండా,మా దగ్గరికొస్తే మీ ఇంట ఉండనివ్వరా అని వారిని ఎదురించేవాళ్లు.దీనికంతటికి కారణం నిరక్షరాస్యత.చదువుంటే ఆటోమేటిక్ గా అన్ని విషయాలు తెలుస్తాయి.అందుకే అలాంటి చదువునే వీరికి అందకుండా చేస్తున్నారు అని పల్లవి చెప్తూ పోతుంటే దీపిక మౌనంగా వింటుంది,పడుకున్నారనుకున్న రేణుక,వెంకన్న కూడా ..

ఉన్నన్ని రోజులు స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తూ,ఒక రోజు ఊర్లో ఉన్న ఆడాళ్లందరిని తీస్కెల్లి మందు షాపుని మూయించేసారు,సాయంత్రం పూట వీదుల్లో పెద్దవాళ్లకి పాఠాలు చెప్తూ ఫీల్డ్ ట్రిప్ కంప్లీట్ చేసి తిరిగు ప్రయాణం అయ్యారు పల్లవి,దీపిక..

నర్సీపట్నం నుండి సిటీ కి వచ్చేసరికి రాత్రి పదయింది.ప్రయాణ బడలిక వలన ఇద్దరూ డిన్నర్ చేయకుండానే పడుకున్నారు..

పల్లవి,దీపిక ఫీల్డ్ చివరి రోజు స్కూల్లో ఫంక్షన్ ఏర్పాటు చేశారు.పిల్లలు పల్లవి పాడిన పాట పాడి బాగా చదువుకుంటాం అని మాట ఇచ్చారు,తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తాం,మందు తాగమమ్మా అని అంటుంటే పల్లవికి కాల్ వచ్చింది మహేశ్ చనిపోయాడని సడన్ గా సిటీకి బయల్దేరారు..బస్ లో ప్రయాణం చేస్తున్నంత సేపు పల్లవి ఏడుస్తూనే ఉంది ఓదార్చడానికి తన పక్కన దీపిక లేదు..ఉలిక్కిపడి లేచింది..తను హాస్టల్లో ఉంది .తన పక్కనే దీపూ మంచి నిద్రలో ఉంది.టైం చూస్తే ఐదు అవుతుంది..కలలు కనడమే ఇష్టంలేని పల్లవికి వచ్చిన మొదటి కల,కొంచెం భయమేసింది. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయని ఎక్కడో విన్న మాట గుర్తొచ్చి అదంతా ట్రాష్ అని కొట్టిపారేసి,మళ్లీ పడుకునే ప్రయత్నం చేసింది కానీ నిద్ర రావట్లే,తెల్లవారాక దీపూని ఒకసారి వాళ్ల మావయ్యకి కాల్ చేయమంది,ఒకటి రెండు మూడు సార్లు చేసిన కాల్ లిప్ట్ చేయరే..పల్లవి టెన్షన్ పెరిగిపోయి గబగబా ఫ్రెష్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని నేను ఇప్పుడే మీ అమ్మమ్మ వాళ్లింటికెళ్లొస్తా అని పరుగున బస్టాప్ కి వెళ్లి బస్ అందుకుంది..

బస్ దిగి వెళ్లేసరికి ఇంట్లో ఎవరూ కనపడట్లే..హాల్లో టీవీ లో పాటలు వినిపిస్తున్నాయి.డోర్ కొట్టాలా వద్దా అనుకుంటూ లోపలికి తొంగిచూసింది ..అప్పుడే కిచెన్ లోనుండి టీ కప్ తో బయటికి వస్తూ కనపడ్డాడు మహేశ్..కళ్లల్లో నీళ్లతో మీరూ..మీరూ..మీరూ..అంటుంటే..

ఏంటి ఏమైంది నేను చనిపోయాననుకున్నావా ఏంటీ, నువ్ ఐ టూ చెప్పలేదని సూసైడ్ చేసుకునేంత పిరికివాడిలా కనిపిస్తున్నానా..నేను చనిపోవాలనుకుంటే పుట్టినప్పటినుండి పడిన కష్టాలకు ఈ పాటికి కొన్ని వందలసార్లు చనిపోవాల్సింది.వాస్తవానికి శ్రీ నాకు దూరమైనందుకు బాదగా ఉన్నా,తను ఆత్మహత్య చేసుకున్నందుకు తనపైనాకు ఎప్పటికీ కోపం ఉంటుంది.ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నవాల్లంటే నాకుకోపం,అసహ్యం..ఏదన్నా బతికి సాధించాలి..ఈ లోకంలో చావే అన్నింటికి పరిష్కారం అనుకుంటే మనిషనేవాడే బతికి ఉండేవాడుకాడేమో అని మహేశ్ చెప్తుంటే తన మాటలు అతనినోటి వెంట విని మళ్లీ షాక్ అయింది పల్లవి..

”ఒక ఆత్మ రెండు శరీరాలు” అనే శ్రీ,మహేశ్ గుర్తొచ్చి నవ్వుకుంది..

రా టీ తాగుదువ్ కానీ ఈ టైంలో మంచి పాటలోస్తాయ్ మా టీవీలో అని సౌండ్ పెట్టాడు..

ఒక్కసారిగా లోపలికి ఒక అడుగు వేసి మహేశ్ ని హత్తుకుంది……

నీ కళ్లతోటి నా కళ్లలోకి చూస్తేనే చంద్రోదయం అంటూ టీవిలో పాట…

కట్ చేస్తే శ్రీ స్కెచ్ ప్లేస్ లో ..పల్లవి,మహేశ్ ల పెళ్లి ఫొటో….

 

Comments

comments

Share this post

scroll to top