మీ ఫోన్‌లో సిగ్న‌ల్ స‌మ‌స్య వ‌స్తుందా..? అయితే ఏం చేయాలో తెలుసుకోండి..!

ఎన్ని ర‌కాల మోడ‌ల్స్‌తో, ఫీచ‌ర్ల‌తో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వ‌స్తున్నా బేసిక్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్ దాకా ప్ర‌తి దాంట్లోనూ ఉండేది కాలింగ్‌, ఎస్ఎంఎస్‌. ఈ రెండింటినీ టెలిఫోన్ నెట్‌వ‌ర్క్ ఆప‌రేటర్లు అందిస్తారు. స్మార్ట్‌ఫోన్ల‌లో ఇవి కాకుండా ఇంట‌ర్నెట్, కెమెరా, ఎంపీ3 వంటి అనేక ఫీచ‌ర్లు ఉంటాయ‌నుకోండి. అయినా మ‌న‌కు కామ‌న్‌గా అవ‌స‌రం వ‌చ్చేవి దాదాపుగా ఇవి రెండు మాత్ర‌మే. అందులోనూ ఎక్కువ‌గా వాయిస్ కాల్స్ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఎంత అడ్వాన్స్‌డ్ స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చినా, బేసిక్ ఫోన్ అయినా రెండింటిలోనూ వాయిస్ కాల్స్ ఉంటాయి. వాటికి పెద్ద తేడా ఏమీ ఉండ‌దు. అయితే ఏ ఫోన్ అయినా వాయిస్ కాల్స్ విష‌యానికి వ‌స్తే నేడు అధిక శాతం మంది వినియోగ‌దారులు ఇబ్బంది ప‌డుతోంది నెట్‌వ‌ర్క్ స‌మ‌స్య‌తోనే. దీనికి కార‌ణం స‌రిగ్గా సిగ్న‌ల్ ఉండ‌క‌పోవ‌డ‌మే. నెట్‌వ‌ర్క్ ఆప‌రేటర్ ఏర్పాటు చేసిన ట‌వ‌ర్ వ‌ల్ల మ‌న ఫోన్ల‌లో సిగ్న‌ల్ స‌రిగ్గా ఉండ‌క‌పోతే అది ఓకే. నెట్‌వ‌ర్క్ రాగానే సిగ్న‌ల్ వ‌స్తుంది. కాల్స్ ప్రాబ్లం ఉండ‌దు. మ‌రి మ‌న ఫోన్లోనే స‌మ‌స్య ఉంటే..?

phone-signal

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మ‌న ఫోన్లో స‌మ‌స్య ఉన్నా సిగ్న‌ల్ స‌రిగ్గా అంద‌దు. అంటే అది ఫోన్‌లోని ఏదైనా చిప్ లేదంటే బోర్డు వంటి హార్డ్‌వేర్‌, లేదంటే సాఫ్ట్‌వేర్ వ‌ల్లో ఫోన్‌కు వ‌చ్చిన స‌మ‌స్య కాదు. మ‌రి ఎందుకని అంటారా..? అదేనండీ సిమ్ కార్డు వ‌ల్ల‌… అవును, సిమ్ కార్డు వ‌ల్ల కూడా మీ ఫోన్ల‌లో అప్పుడ‌ప్పుడు సిగ్న‌ల్ స‌మ‌స్య త‌లెత్తుతుంది. దీంతో కాల్స్ స‌రిగ్గా క‌నెక్ట్ కావు. క‌నెక్ట్ అయినా వెంట‌నే కాల్ డ్రాప్ అయిపోతుంది. ఇలా ఉన్న‌ప్పుడు మ‌నం నెట్‌వ‌ర్క్ ఆప‌రేట‌ర్‌ను తిట్టుకుంటాం. కానీ స‌రిగ్గా గ‌మ‌నిస్తే మ‌న స‌మ‌స్య ఏమిటో తెలిసిపోతుంది.

సిమ్ కార్డ్ వ‌ల్ల నెట్‌వ‌ర్క్ స‌మ‌స్య ఎలా వ‌స్తుంద‌నేగా మీ డౌట్‌..! ఏం లేదండీ, ఒక‌ప్పుడంటే అన్నీ బేసిక్ ఫోన్లే ఉండేవి. వాటిలో సిమ్ కార్డుల‌ను అలాగే డైరెక్ట్‌గా వేసుకునేవారు. కానీ ఇప్పుడు వ‌స్తున్న స్మార్ట్‌ఫోన్లు మైక్రో, నానో సైజ్ సిమ్ స్లాట్‌ల‌ను క‌లిగి ఉంటున్నాయి. దీంతో ఇంత‌కు ముందు మ‌నం ఉప‌యోగించిన సిమ్ కార్డుల‌ను కొత్త ఫోన్ల‌లో వేయాలంటే ఆ కార్డుల‌ను క‌ట్ చేసుకోవాల్సి వ‌స్తోంది. అలా క‌ట్ చేసిన‌ప్పుడు నెట్‌వర్క్‌కు సంబంధించిన ప‌లు సిమ్ కార్డ్ మెట‌ల్ స్ట్రిప్స్ క‌ట్ అయిపోతున్నాయి. దీంతో ఆ సిమ్‌ల‌ను ఫోన్లలో వేస్తే నెట్‌వ‌ర్క్ ప్రాబ్లం వ‌స్తుంది. అందుక‌నే అప్పుడ‌ప్పుడు ఫోన్ల‌లో సిగ్న‌ల్ డ్రాప్ అయిపోతుంటుంది.

మీరు కూడా అలాంటి క‌ట్ చేసిన సిమ్‌ల‌ను వాడుతూ, సిగ్న‌ల్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటుంటే వెంట‌నే స‌ద‌రు సిమ్‌ను మార్చేయండి. కొత్త సిమ్ కార్డును తీసుకోండి. అయితే ఆ కొత్త సిమ్‌లో మైక్రో, నానో వంటి సైజ్‌ల‌లో ముందుగానే సిమ్ క‌ట్ అయి ఉంటుంది. కాబ‌ట్టి దాన్ని ఉప‌యోగిస్తే ఇక‌పై మీ ఫోన్‌లో సిగ్న‌ల్ స‌మ‌స్య ఉండ‌దు.

Comments

comments

Share this post

scroll to top