లోక‌ల్ వార్‌కు రంగం సిద్ధం – ఇక పంచాయ‌తీ షురూ – మంత్రులే కింగ్ మేక‌ర్లు

ప‌క్కా ప్ర‌ణాళిక‌తో తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌..ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు పార్టీ శ్రేణుల‌ను దిశా నిర్దేశ‌నం చేస్తున్నారు. ప‌రిపాల‌న‌ను ప‌రుగులు పెట్టిస్తూనే ..కింది స్థాయి నుంచి పై స్థాయి వ‌ర‌కు ఉన్న పార్టీ కేడ‌ర్ లో జోష్ నింపుతున్నారు. ఇప్ప‌టికే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య బావుటా ఎగుర‌వేసిన ఎమ్మెల్యేల‌ను ఆయ‌న ప్ర‌త్యేకంగా అభినందిస్తూనే ..పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి పార్టీ స‌త్తా ఏమిటో చూపించాల‌ని ఆదేశించారు. ఆ మేర‌కు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు , మంత్రులు అంతా ఒక్క‌టై ఆయా పార్ల‌మెంట‌రీ స్థానాల్లో బ‌రిలోకి దిగిన ఎంపీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ధ‌తుగా ప్ర‌చారం చేశారు. దీంతో అంత‌ర్గ‌త నివేదిక‌లు తెప్పించుకున్న కేసీఆర్ మొత్తం 17 పార్ల‌మెంట్ స్థానాల్లో మిత్ర‌ప‌క్షంగా ఉన్న ఎంఐఎంకు త‌ప్ప మిగ‌తా 16 సీట్ల‌లో గులాబీ జెండా రెప‌రెప‌లాడాల‌ని ఆదేశించారు.

పోలింగ్ రోజున కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినా ఆ త‌ర్వాత అంతా స‌ర్దుకుంది. ఎన్నిక‌లు ప్రశాంతంగా ముగిశాయి. ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యేందుకు కొన్ని రోజులు ఉండ‌డంతో పార్టీ ప‌రంగా విస్తృత స‌మావేశం ఏర్పాటు చేశారు. స‌ర్పంచ్ ఎన్నిక‌లు నిర్వ‌హించిన ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఏకంగా స్థానిక పంచాయ‌తీకి తెర లేపింది. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ ఛైర్మ‌న్ల ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అంత‌కు ముందు ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ర్యాద పూర్వ‌కంగా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను క‌లిశారు. రెవిన్యూ చ‌ట్టంలో స‌మూల మార్పులు చేయ‌డంతో మ‌రికొన్ని అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. స‌గ‌టున రెండు పంచాయ‌తీల ప‌రిధిలోకి ఒక్కో ఎంపీటీసీ ప‌ద‌వితో పాటు కొత్త‌గా ఏర్పాటైన మండ‌లాల‌లో కొత్త‌గా 94 జెడ్పీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తంగా ఎంపీటీసీల వ‌ర‌కైతే 5 వేల 857 ఎంపీటీసీ స్థానాల‌కు పోటీ ప‌డ‌నున్నారు.

వీరి నుండే మండ‌లాల‌కు ఎంపీపీలను ఎన్నుకోనున్నారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు గాను పంచాయ‌తీరాజ్ క‌మిష‌న‌ర్ ఇప్ప‌టికే ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు స‌మాచారం అందించారు. 12 వేల 751 గ్రామ పంచాయ‌తీలు ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌కు స‌ర్కార్ ప‌చ్చ జెండా ఊప‌డంతో ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు ముమ్మ‌రం చేసింది. గ‌తంలో కంటే 623 ఎంపీటీసీ స్థానాలు త‌గ్గాయి. న‌ల్ల‌గొండ జిల్లాలో అత్య‌ధికంగా 349 మంది ..మేడ్చ‌ల్ మ‌ల్కాజ్ గిరి జిల్లాలో అత్య‌ల్పంగా 42 మంది ఎంపీటీసీ స‌భ్యులు ఉన్న‌ట్లు ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది. నూత‌న మండ‌లాల ఏర్పాటుతో జెడ్పీటీసీల సంఖ్య 441 నుండి 535 కు పెరిగింది. స‌భ్యుల ప‌ద‌వుల‌కు పార్టీ ప్రాతిప‌దిక‌న ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు రెడీ అయ్యింది. జిల్లాల నుండి వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల మేర‌కు రెండు మూడు విడ‌త‌లుగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు.

50 వేల మందికి పైగా పోలీసులు ఎన్నిక‌ల కోసం అవ‌స‌ర‌మ‌వుతార‌ని డీజీపీ అంచ‌నా వేశారు. బ‌ల‌గాల కోసం ఇత‌ర రాష్ట్రాల నుండి ఇక్క‌డికి ర‌ప్పించనున్నారు. 32 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. అధికార పార్టీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో రాష్ట్రంలో స్థానిక పోరుకు పార్టీ శ్రేణులు రెడీ అయ్యాయి. మ‌రోసారి ఎన్నిక‌ల జోరు ఊపందుకోనుంది. అయితే గులాబీ బాస్ మాత్రం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ ఛైర్మ‌న్ల ఎంపిక బాధ్య‌త‌ను ఆయా జిల్లాలో మంత్రుల‌కు స‌ర్వాధికారాలు అప్ప‌గిస్తూ ప్ర‌క‌టించారు. ఇత‌ర పార్టీల నుండి గులాబీ పార్టీలోకి జంపింగ్ అయిన వారంద‌రికీ స‌ముచిత స్థానం ల‌భిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిప‌క్షాలు మ‌రో స‌మ‌రానికి సిద్ధం కావాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

Comments

comments

Share this post

scroll to top