హైద‌రాబాద్‌లో ఉన్న లైబ్ర‌రీలు ఆధునీక‌రణ‌కు నోచుకోనున్నాయి… అందుకు కార‌ణం ఈ యువ‌కుడే..!

ప్ర‌భుత్వం మ‌న ద‌గ్గ‌ర్నుంచి ప‌న్నులు వ‌సూలు చేసేది ఎందుకు..? మ‌న బాగు కోస‌మే క‌దా..! మ‌న‌కు అన్ని స‌దుపాయాలు క‌ల్పించ‌డం కోస‌మే ప్ర‌భుత్వాలు ఆ ప‌ని చేస్తాయి. అలాంట‌ప్పుడు అలా వ‌సూలు చేసిన ప‌న్నులు ఎవ‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌కుండా అలా ఖజానాలో మూలుగుతూ ఉంటే అప్పుడు ప‌న్నులు వ‌సూలు చేసి ఏం లాభం..? ఇలా ఆలోచించాడు కాబ‌ట్టే ఆ యువ‌కుడు చేసిన ప‌ని వ‌ల్ల ఇప్పుడు ఎంతో మంది విద్యార్థుల‌కు, పుస్త‌క ప్రియుల‌కు మేలు జ‌రుగుతోంది, అదీ మ‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న లైబ్ర‌రీల వ‌ల్ల‌..! ఇంత‌కీ అత‌ను ఎవ‌రు..? ఏం చేశాడు..?

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ జిల్లా గ్రంథాల‌య స‌మితులు ఉంటాయి. అవి స్థానికంగా ఉన్న కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు, పంచాయ‌తీల ద్వారా ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బును లైబ్ర‌రీ సెస్ కింద వ‌సూలు చేస్తాయి. అలా వ‌సూలైన మొత్తం జిల్లా గ్రంథాల‌య స‌మితుల‌కు చేరుతాయి. అక్క‌డి నుంచి నిధులు ఆ జిల్లాలో ఉన్న గ్రంథాల‌యాల‌కు వెళ‌తాయి. అప్పుడు ఆ గ్రంథాయాల్లో ప‌నిచేసే సిబ్బందికి జీతాలు ఇస్తారు. ఆ నిధుల‌తోనే పుస్త‌కాలు కొన‌డం, గ్రంథాల‌య నిర్వ‌హ‌ణ వంటివి చేస్తారు. అయితే హైద‌రాబాద్‌లో లైబ్ర‌రీ సెస్‌ను జీహెచ్ఎంసీ వ‌సూలు చేస్తుంది. ఈ క్రమంలోనే 2006 నుంచి 2013 వ‌ర‌కు జీహెచ్ఎంసీ వ‌సూలు చేసిన మొత్తం లైబ్ర‌రీ సెస్ రూ.339 కోట్లుగా ఉంది. కానీ జీహెచ్ఎంసీ నుంచి హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న లైబ్రరీల‌కు నిధుల కింద వెళ్తున్న‌ది ఎంతో తెలుసా..? అక్ష‌రాలా రూ.12.50 ల‌క్షలు మాత్ర‌మే. సిటీలో ఉన్న ప్ర‌తి లైబ్ర‌రీ నిర్వ‌హ‌ణ‌కు క‌నీసం ఎంత లేదన్నా రూ.1 కోటి వ‌ర‌కు కావాలి. అదే సిటీలో ఉన్న హైద‌రాబాద్ సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీకి ఈ ఖ‌ర్చు ఇంకా ఎక్కువే అవుతుంది. ఈ క్ర‌మంలో స‌రైన నిధులు రాక‌పోవ‌డంతో లైబ్ర‌రీలు దీనావ‌స్థ‌కు చేరుకున్నాయి. దీన్ని గ‌మ‌నించాడు ఆ యువ‌కుడు. అత‌ని పేరు దొంతినేని న‌ర‌సింహ‌. ఎంబీఏ చ‌దువుతున్నాడు.

అలా దీనావ‌స్థ‌లో ఉన్న లైబ్ర‌రీల‌ను, వాటిలో ఉన్న స‌దుపాయాల‌ను న‌ర‌సింహ గ‌మ‌నించాడు. దీంతోపాటు లైబ్ర‌రీ లోప‌ల కాకుండా బ‌య‌ట చెట్ల కింద మండుటెండలో పుస్త‌కాల‌ను చ‌దువుకుంటున్న విద్యార్థుల‌ను, పుస్త‌క ప్రియుల‌ను కూడా అత‌ను చూశాడు. వెంట‌నే ఓ ఆలోచ‌న‌కు వ‌చ్చేశాడు. దీంతో ఆర్‌టీఐ ద్వారా స‌మాచారం సేక‌రించాడు. అప్పుడు అత‌నికి పైన చెప్పిన వివ‌రాలు తెలిశాయి. అలా కొన్ని వంద‌ల కోట్ల నిధులు ఉన్నా జీహెచ్ఎంసీ, ప్ర‌భుత్వం ఎందుకు వాటిని విడుద‌ల చేయ‌డం లేదంటూ కోర్టులో ఓ పిల్ వేశాడు. అంతే, దెబ్బ‌కు ప్ర‌భుత్వం దిగి వ‌చ్చింది. లైబ్ర‌రీల‌ను ఆధునీక‌రించేందుకు, డిజిట‌ల్ లైబ్ర‌రీల‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చింది. దీంతో హైద‌రాబాద్ మాత్ర‌మే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లైబ్ర‌రీలు ఇప్పుడు కొత్త సొబ‌గుల‌ను సంత‌రించుకోనున్నాయి. ఇదంతా న‌ర‌సింహ చ‌లువే అంటే నమ్మ‌గ‌ల‌రా..? ఈ విష‌యంలో అతన్ని అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాల్సిందే. అభినంద‌న‌లు తెల‌పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top