ఆ గాత్రం అజ‌రామ‌రం -పాట‌ల తోట‌లో విరిసిన మందారం.!!

గుడిలో దీపం వెలిగిస్తే వెలుతురు వ‌స్తుంది. ఉద‌యం లేస్తే సూర్యోద‌యం క‌నిపిస్తుంది. గుండెను క‌మ్మిన దుఃఖ‌పు తెర‌ల నుండి ఉప‌శ‌మ‌నం పొందాలంటే ల‌తా మంగేష్క‌ర్ పాట‌లు వినాల్సిందే. ఆమె కాలంలో మ‌నం బ‌తికి ఉన్నందుకు అదృష్ట‌వంతులం అనుకోవాలి. తీయ‌ద‌నం ఎలా ఉంటుందో రుచి చూడాల్సిన ప‌నిలేదు..హృద‌యం మూగ‌దై పోయిన‌ప్పుడు..ప్రేమ కోసం సంచారం చేస్తున్న‌ప్పుడు..పాట‌ల తోట‌ల్లోంచి గాత్ర ప‌రిమ‌ళం ధూప‌మై అల్లుకు పోతుంది. ఒక‌టా రెండా 50 వేల‌కు పైగా పాట‌లు పాడారు. లెక్క‌లేన‌న్ని భాష‌ల్లో ఆమె త‌న ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఎంద‌రో సంగీత ద‌ర్శ‌కులు ల‌తాజీలోని గాత్ర మాధుర్యాన్ని చూసి త‌రించి పోయారు. ఒక్క‌సారైనా ఆమెతో పాడించు కోవాల‌ని కొన్ని సినిమాల‌ను కాద‌నుకున్నారు. కొన్నింటిని వ‌దిలేసుకున్నారు కూడా. వారికి ఆమె అంటేనే అంత గౌర‌వం.

కోట్లాది అభిమానుల‌ను సంపాదించుకున్న స్వ‌ర సామ్రాజ్ఞికి 89 ఏళ్లు అంటే న‌మ్మ‌గ‌ల‌మా. ఇప్ప‌టికీ అదే గొంతు..అదే విన‌మ్ర‌త‌. అదే మాధుర్యం. పెద్ద‌దానిగా ఇంటి బాధ్య‌త‌లు చూస్తేనే..క‌ష్ట‌ప‌డుతూ చెల్లెల్ల‌ను ఒక స్థాయిలోకి తీసుకు వ‌చ్చింది. ఆమె చెల్లెలు అద్భుత గాయ‌ని. ఒకానొక స‌మ‌యంలో ఒక‌రిపై మ‌రొక‌రు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డ్డారు. ఎవ‌రి స్వ‌రం వారిదే..ఈమె స‌ముద్రం..ఆమె జ‌ల‌పాతం. ల‌తకు మ‌న తెలుగు స్వ‌ర‌బ్ర‌హ్మ ఎస్.పి. బాల‌సుబ్ర‌మ‌ణ్యం అంటే ప్రేమ‌. బాలూ నీలో గ‌మ్మ‌త్తు దాగుంది అంటూ వుంటారామె. ఇద్ద‌రూ క‌లిసి పాడిన పాట‌లు ఆల్ టైం హిట్ గా నిలిచాయి. జేసుదాస్ తో కూడా పాడారు. నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా ఆమె పాట‌ల సంచారం అలుపు లేకుండా సాగింది.

ఈ రంగంలోకి ఎంతో మంది వ‌చ్చారు. త‌మ గొంతుల‌ను స‌వ‌రించుకున్నారు. కానీ ఈ పాట‌ల మాంత్రికురాలి గాత్రం ముందు అంతా మోక‌రిల్లారు. అంత‌టి విద్వ‌త్తు ఆమెలో ఉన్న‌ది. క‌నుకే ఆమె పాట‌కు స‌లాం అన్నారు వేలాది మంది. హిందీ సినీ నేప‌థ్య గాయ‌నిగా ఇప్ప‌టికీ ఉన్నారు. గాయ‌కురాలే కాదు న‌టి కూడా. 1942 లో క‌ళా ప్ర‌యాణం మొద‌లైంది. 980 సినిమాల‌కు త‌న గొంతును అరువిచ్చింది. 20 భాష‌ల్లో ఆమె పాట‌లు పాడింది. ఆమె చేసిన కృషికి భార‌త‌ర‌త్న బిరుదుతో ప్ర‌భుత్వం గౌర‌వించింది. ఏ సినిమా చూసినా ల‌త‌, ఆషాల గొంతులు మ‌న‌ల్ని మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తాయి.

వీళ్లు పాట‌ల కోయిల‌లు. వ‌సంతాల‌ను విర‌జిమ్మే పూలు. బాల్య‌మంతా ల‌తాజీ క‌ష్టాల‌ను ఎదుర్కొంది. న‌చ్చిన గాయ‌కుడిగా సైగ‌ల్ ను పేర్కొంది. 13 ఏళ్ల‌కే తండ్రి మ‌ర‌ణించ‌డంతో మ‌రాఠీ సినిమా ప‌హ్లా మంగ‌ళ గౌర్లో లో క‌థానాయిక చెల్లెలు పాత్ర‌లో న‌టించి రెండు పాట‌లు పాడింది. ఆ త‌ర్వాత చిముక్లా సుసార్, గ‌జె భావు, జీవ‌న్ యాత్ర , మందిర్ సినిమాల్లో న‌టించింది. ఆ కాలంలో ఖుర్షీద్,నూర్జ‌హాన్, సుర‌య్యాలు గాయ‌నీ గాయ‌కులుగా ఒక రేంజ్ లో ఉన్నారు.

1947లో మ‌జ్ బూర్ సినిమాలో పూర్తి స్థాయి గాయ‌నిగా మొద‌లు పెట్టింది. దేశ విభ‌జ‌న కాలంలో ఖుర్షీద్, నూర్జ‌హాన్‌లు పాకిస్తాన్‌కు వెళ్లారు. నేప‌థ్య సంగీత ప్రాధాన్యం పెర‌గ‌డంతో ల‌త‌కు ఛాన్స్‌లు ద‌క్కాయి. గులాం హైద‌ర్ సంగీత ద‌ర్శ‌కుడిగా ల‌త‌కు అవ‌కాశాలు ఇచ్చాడు. సి. రామ‌చంద్ర ల‌త పాట‌ల‌కు ప్రాణం పోశాడు. అల్బేలా, శివాజీ, అనార్క‌లీలోని పాట‌లు అద్భుత విజ‌యాలు సాధించాయి. అందాజ్, బ‌డీ బ‌హాన్, బ‌ర్సాత్, ఆవారా, శ్రీ 420 , దులారీ చిత్రాల‌లోని పాట‌లు దేశంలో వేలాది అభిమానుల‌ను సంపాదించుకునేలా చేశాయి.

ఆర్డీ బ‌ర్మ‌న్, ల‌క్ష్మీకాంత్ ప్యారేలాల్, క‌ళ్యాణ్ జీ ఆనంద్ జీ, బప్పీల‌హ‌రి, రాం ల‌క్ష్మ‌న్‌, ఏ. ఆర్. రెహ‌మాన్, అనూ మాలిక్, న‌దీం శ్ర‌వ‌ణ్ లాంటి వారంద‌రూ ల‌తతో పాడించారు. ఓపీ న‌య్య‌ర్ మాత్రం ఆమెతో విభేదించాడు. త‌న పాట‌ల‌కు ఆమె స‌రిపోదంటూ..ఆమె చెల్లెలు ఆషా భోంస్లేకు ఛాన్స్‌లు ఇచ్చాడు.
ల‌త సినీ నిర్మాత‌గా మ‌రాఠీలో వాద‌ల్, కాంచ‌న్ గంగా, హిందీలో లేకిన్, ఝూంఝూర్ సినిమాలు తీయ‌గా..మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా రాం రాం ప‌హూనా, మంజుల‌, మేల్ వాలా, స్వాథూ మాన్ సే, త‌దిత‌ర చిత్రాల‌కు ప‌ని చేసింది. క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు న‌వ‌యుగ్ చిత్ర‌ప‌త్ సినిమా కంపెనీ అధినేత వినాయ‌క్ లత కుటుంబాన్ని ఆదుకున్నాడు. గాయ‌నిగా కెరీర్ మొద‌లు పెట్టేందుకు సాయ‌ప‌డ్డాడు. నాచు య‌గ‌డే ..ఆమె మొద‌ట పాడిన పాట‌. దీనికి

1945లో మాస్ట‌ర్ వినాయ‌క్ కంపెనీ ముంబైకి మారి పోయిన‌ప్పుడు ల‌తా కుటుంబంతో స‌హా ఆమె కూడా మారారు. హిందూస్తానీ సంప్ర‌దాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ ద‌గ్గ‌ర నేర్చుకున్నారు. సుభ‌ద్ర సినిమా సంగీత ద‌ర్శ‌కుడు వసంత్ దేశాయ్ కు ప‌రిచ‌య‌మ‌య్యారు ల‌తాజీ. 1948లో వినాయ‌క్ చ‌నిపోవ‌డంతో..ల‌తాకు గులాం హైద‌ర్ పాడేందుకు ప్ర‌యారిటీ ఇచ్చారు. నిర్మాత ముఖ‌ర్జీ ఆమెను ఒప్పుకోలేదు. దిల్ మేరా తోడా, ముఝే క‌హీ కానా చోరా పాట‌తో ల‌త‌కు మొద‌టి సారి హిట్ ఇచ్చారు హైద‌ర్. మ‌హ‌ల్ సినిమాలో ఆయేగా ఆనే వాలా పాట మ‌రో హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మ‌ధుబాల న‌టిగా న‌టించారు.

1950లో ల‌తాజీ లెక్క‌లేన‌న్ని పాట‌లు పాడారు. అనిల్ బిశ్వాస్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో త‌రానా, హీర్ సినిమాలు, శంక‌ర్ జై కిష‌న్, నౌషాద్ ఆలీ, ఎస్డీ బ‌ర్మ‌న్, పండిట్ అమ‌ర్ నాథ్ హుస‌న్ లాల్ భ‌గ‌త్ రాం సంగీత ద‌ర్శ‌క‌త్వంలో బ‌రీ బెహ‌న్, మీనా బ‌జార్, అఫ్సానా, ఆదీరాత్, అన్సూ, చోటీ బాభీ, అద‌ల్ ఏ జ‌హంగీర్ సినిమాల‌కు పాడారు. సి. రామ‌చంద్ర‌, హేమంత్ కుమార్, స‌లీల్ చౌద‌రి, ఖ‌య్యాం, ర‌వి, స‌జ్జ‌ద్ హుస్సేన్, రోష‌న్, క‌ళ్యాన్ జీ ఆనంద్ జీ, వ‌సంత్ దేశాయ్, సుదీర్ ఫ‌డ్కే, హ‌న్స్ రాజ్ భేల్, మ‌ద‌న్ మోహ‌న్, ఉషాఖ‌న్నా వంటి మ్యూజిక్ డైరెక్ట‌ర్ల ద‌గ్గ‌ర ల‌త పాడారు.

1956లో వ‌న‌రాథం త‌మిళ సినిమాకు పాడారు. దీదార్, బైజూ బావ్రా, అమ‌ర్ , ఉర‌న్ ఖోత‌ల‌, మ‌ద‌ర్ ఇండియా సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. వీట‌న్నింటికి నౌషాద్ మ్యూజిక్ ఇచ్చారు. 1958లో మ‌ధుమ‌తి సినిమాలో ల‌త పాడిన ఆజారే ప‌ర‌దేశీ పాట‌కు ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ సినిమాకు స‌లీల్ చౌద‌రి మ్యూజిక్ అందించారు. 1960లో మొఘ‌ల్ ఏ ఆజం సినిమాలో నౌషాద్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో ల‌త పాడిన ప్యార్ కియాతో డ‌ర్నా క్యా పాట హిట్ గా నిలిచింది. దిల్ అప్నా ఔర్ ప్రీత్ ప‌రాయి మూవీలో అజీ ద‌స్తాన్ హై యే పాట ప్రాచుర్యం పొందింది.

1962లో హేమంత్ కుమార్ స్వ‌ర‌ప‌రిచిన బిస్ సాల్ బాద్ సినిమాలోని క‌హీ దీప్ జ‌లే క‌హీ దిల్ పాట‌కు రెండో సారి ఫిలిం ఫేర్ పుర‌స్కారం ద‌క్కింది ల‌త‌కు. ఇదే స‌మ‌యంలో ఆమెపై విష ప్ర‌యోగం జ‌రిగింది. డాక్ట‌ర్ ఆమెకు స్లో పాయిజ‌న్ ఇచ్చార‌ని నిర్ధారించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. ఆ త‌ర్వాత కోలుకున్నారు. మూడు నెల‌ల పాటు మంచంపైనే ఉన్నారు. గేయ ర‌చ‌యిత మ‌జ్రు సుల్తాన్ పూరి ఆమెకు సాయ‌ప‌డ్డారు. ఆమె తినే ప్ర‌తి వంట‌ను ముందు ఆయ‌న తిన్నాకే ఇచ్చే వార‌ని..దీంతో వంట వాడు పారిపోయాడు.

1963లో భార‌త్ ఇండియా యుద్ధ స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌ధాన మంత్రి నెహ్రూ ముందు ఆయే మేరే వ‌త‌న్ కే లోగో అంటూ పాడిన పాట నేటికీ అజ‌రామ‌రంగా నిలిచే ఉంది. ఈ పాట‌ను సి. రామ‌చంద్ర రాయ‌గా..క‌వి ప్ర‌దీప్ రాశాడు. విన్న నెహ్రూ క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌య్యారు. 1963లో మ‌ళ్లీ పాడ‌టం మొద‌లు పెట్టారు. ఆర్డీ బ‌ర్మ‌న్ చోటే న‌వాబ్‌లో పాడారు ల‌త‌. రాహుల్ దేవ్ స్వ‌ర ప‌రిచిన బూత్ బంగ్లా, ప‌తీ ప‌త్నీ, బ‌హారోన్‌కీ సప్పా, అభిలాషా ల‌లో కూడా పాడారు. ఎస్డీ బ‌ర్మ‌న్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గైడ్ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఆజ్ ఫిర్ జీనే కీ త‌మ‌న్నా హై, కిషోర్ కుమార్ తో క‌లిసి గాతా రహా మేరా దిల్ , 1967లో జ్యాయెల్ థీఫ్ లో హోతో పే ఏసా బాత్ అంటూ పాడిన పాట‌లు కుర్ర‌కారును చ‌క్కిలిగింత‌లు పెట్టాయి.

ల‌క్ష్మీకాంత్ ప్యారేలాల్‌తో ల‌త 35 ఏళ్ల పాటు అనుబంధం కొన‌సాగింది. వీరిద్ద‌రి సంగీత ద‌ర్శ‌క‌త్వంలోనే దాదాపు 700 పాట‌ల‌కు పైగా పాడారు ల‌త‌. జీనేకీ రాహ్ సినిమాకి మూడవ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. మరాఠీ సంగీత దర్శకులు హ్రిదయన్త్ మంగేష్కర్, వసంత్ ప్రభు, శ్రీనివాస్ ఖాలే, సుధీర్ ఫడ్కే వంటి వారి సారథ్యంలో పలు మరాఠీ సినిమాలలో పాటలు పాడారు. 1967లో బెల్లెనే బెలగాయితు పాటతో కన్నడలో మొదటి పాట పాడారు. ర‌ఫీ, ల‌త‌ల మ‌ధ్య రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో గొడ‌వ ప‌డ్డారు. శంక‌ర్ జైకిష‌న్ వీరిద్ద‌రి మ‌ధ్య రాజీ కుదిర్చారు.

1972లో విడుదలైన పాకీజా సినిమాలో గులాం మహ్మద్ సంగీత దర్శకత్వంలో చల్తే చల్తే, ఇన్హే లోగో నే వంటి హిట్ పాటలు పాడారు లత. ఎస్.డి.బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ప్రేం పూజారీ లో రంగీలా రే, షర్మీలా లో ఖిల్తే హై గుల్ యహా సాంగ్ హిట్ గా నిలిచాయి. మ‌ద‌న్ మోహన్ స్వ‌ర ప‌రిచిన దస్తక్ , హీర్ రాంఝా , దిల్ కే రహే , హిందుస్తాన్ కీ కసమ్ , హసంతే జఖమ్ , మౌసమ్ , లైలా మజ్నూ లలో అద్భుత‌మైన గీతాలు ఆలాపించారు ల‌త‌.

రాహుల్ దేవ్ సంగీత దర్శకత్వంలో అమర్ ప్రేమ్ , కరావన్ , కటి పతంగ్ , ఆనంది, వంటి సినిమాలలో పాటలు పాడారు. 1973లో పరిచయ్ సినిమా కోసం పాడిన బీతీ నా బితాయ్ పాటతో ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు లత. ఈ పాటను ఆర్.డి.బర్మన్ స్వరపరచగా గుల్జార్ రాశారు. మలయాళంలో ఆమె పాడిన ఒకే ఒక పాట కాదలీ చెనకదలీ. 1975లో కోరా కాగజ్ సినిమాలో కళ్యాణ్ జీ ఆనంద్ జీ స్వరపరచిన రూతే రూతే పియా పాట హిట్ గా నిలిచింది. దీనికి పుర‌స్కారం అందుకున్నారు.

1974లో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో మొదటి విదేశీ సంగీత కచేరీ చేశారామె. ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ కంపోజ్ చేసిన మీరాబాయ్ భజనలు, ఛాలా వాహీ దాస్ ల భక్తి గీతాలతో ఒక ఆల్బంను రిలీజ్ చేశారు లత. 1978లో రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన “సత్యం శివం సుందరం” సినిమాలో టైటిల్ సాంగ్ సత్యం శివం సుందరం ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది.

1980లో రెండో త‌రం మ్యూజిక్ డైరెక్ట‌ర్లతో ల‌త పాట‌లు పాడారు. 1960ల‌లో ఆనాటి ప్ర‌ముఖ స్వ‌ర‌క‌ర్త‌ల కుమారుల‌తో ఆమె పాట‌లు పాడి అల‌రించారు. స‌చిన్ దేవ్ బ‌ర్మ‌న్ కొడుకు రాహుల్ దేవ్ బ‌ర్మ‌న్, రోహ‌న్ కుమారుడు రాజేష్ రోష‌న్, అనుమాలిక్ స‌ర్దార్ మాలిక్ కొడుకు, చిత్ర గుప్త కొడుకులు ఆనంద్ మిలింద్ ల తో ప‌నిచేశారు. అస్సామీ భాష‌లో కూడా పాడారు ల‌త‌. దివంగ‌త భూపేన్ హ‌జారికా మ్యూజిక్‌లో ఆమె పాడిన పాట దిల్ హూం హూం క‌రే పాట హిట్ గా నిలిచింది. శివ్ హ‌రిల‌తో సిల్ సిలా, ఫాస్లే, విజ‌య్, చాందినీ వంటి సినిమాల్లో ఎన్నో పాట‌లు పాడారు ల‌త‌.

రాం ల‌క్ష్మ‌న్ ల సంగీత ద‌ర్శ‌క‌త్వంలో ఉస్తాదీ ఉస్తాద్ సే, బెజుబాన్, వో జో హ‌సీనా, యే కేసా ఫ‌ర్ద్, మైనే ప్యార్ కియా, ఏక్ దుజే కేలియే, కార్జ్, ప్రేమ్ రోగి, ప్యార్ ఝుక్తా, న‌హీ, రామ్ తేరీ గంగా మైలీ, నాగిన్, చాందినీ, రామ్ ల‌ఖ‌న్ వంటి సినిమాల‌కు పాడారు. 1985లో విడుద‌లైన సంజోగ్ సినిమాలోని జు..జు..జూ పాట ఆల్ టైం హిట్ గా నిలిచింది. 1988లో త‌మిళంలో పాడారు. ఇళ‌య‌రాజా స్వ‌ర ప‌రిచిన ఆనంద్, స‌త్య సినిమాల‌కు పాడారు.

రామ్-లక్ష్మణ్ ల సంగీత దర్శకత్వంలో ఉస్తాదీ ఉస్తాద్ సే (1981), బెజుబాన్ (1982), వో జో హసీనా (1983), యే కేసా ఫర్జ్ (1985), మైనే ప్యార్ కియా (1989). ఏక్ ధుజే కే లియే, సిల్ సిలా, కార్జ్, ప్రేమ్ రోగీ, ప్యార్ ఝుక్తా నహీ, రామ్ తేరీ గంగ మిలీ, హీరో నాగిన, చాందినీ రామ్ లఖన్ వంటి పెద్ద బడ్జెట్ సినిమాలలో పాటలు పాడారామె. 1985లో విడుదలైన సంజోగ్ సినిమాలోని జు జు జు పాట ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్. 1988లో మంగేష్కర్ వరుసగా తమిళంలో పాటలు పాడారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆనంద్ సినిమాలో ఆరారో ఆరారో పాట, సత్య సినిమాలో వలై ఒసీ పాట పాడారు లత. బ‌ప్పీల‌హ‌రి మ్యూజిక్ డైరెక్ష‌న్‌లో ల‌త అద్భుత‌మైన హిట్ సాంగ్స్ పాడారు.

ఖ‌య్యూం స్వ‌ర ప‌రిచిన పాట‌ల్లో అన్నీ హిట్‌లే. 1985లో టొరొంటోలో సంగీత క‌చేరి చేశారు. 1, 50, 000 వేల డాల‌ర్లు వ‌చ్చాయి. వాటిని పేద‌ల కోసం పంచారు ల‌త‌. ర‌వీంద్ర జైన్ స్వ‌ర ప‌రిచిన రామ్ తేరీ గంగా మిలీ లో సున్ స‌హిబా సున్ పాట హిట్ . ఎంద‌రో సంగీత ద‌ర్శ‌కుల వ‌ద్ద ఆమె వేలాది పాట‌లు పాడారు. న‌దీం శ్ర‌వ‌ణ్‌, జ‌తిన్ ల‌లిత్, దిలీప్ సేన్ స‌మీర్ సేన్, ఉత్తం సింగ్, అనూ మాలిక్, ఆదేశ్ శ్రీ‌వాస్త‌వ‌, రెహ‌మాన్‌ల‌కు గొంతు అరువిచ్చారు. బాల‌సుబ్ర‌మ‌ణ్యం, ఉదిత్ నారాయ‌ణ్, హ‌రిహ‌ర‌న్, కుమార్ స‌ను, సురేష్ వాడ్క‌ర్, మ‌హ్మ‌ద్ అజీజ్, అభిజిత్ భ‌ట్టాచార్య‌, రూప్ కుమార్ రాథోడ్, వినోద్ రాథోడ్,

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ , హరిహరన్, కుమార్ సను, సురేశ్ వాడ్కర్, మహ్మద్ అజిజ్, అభిజీత్ భట్టాచార్య, రూప్ కుమార్ రాథోడ్, వినోద్ రాథోడ్, గుర్ దాస్ మాన్, సోను నిగమ్ లతో ఎన్నో హిట్ పాటలు పాడారు లత.1990లో లత హిందీ సినీ నిర్మాణ సంస్థ ప్రారంభించారు. గుల్జార్ దర్శకత్వం వహించిన లేకిన్ సినిమాను నిర్మించారు . ఈ సినిమాకు ఆమె తమ్ముడు హృదయనాథ్ సంగీత దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో లత పాడిన యారా సిలి సిలీ పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు.యష్ చోప్రా దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలలోనూ పాటలు పాడారు లతా. చోప్రా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బేనర్ లో వచ్చిన చాందినీ , లమ్హే ( , దార్ , యే దిల్లగీ , దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే , దిల్ తో పాగల్ హై , ఆ తరువాత 2000 దశకంలో విడుదలైన మొహొబ్బతే , ముఝ్సే దోస్తీ కరోగీ , వీర్-జారా వంటి సినిమాలలో కూడా ఆమె పాటలు పాడారు.

ఎ. ఆర్. రెహ‌మాన్ స్వ‌ర ప‌రిచిన దిల్ సే, ఒన్ కా టు ఫోర్, పుకార్, జుబేదా, రంగ్ దే బ‌సంతీ, ల‌గాన్, రాన‌క్ సినిమాలలో పాడారు ల‌తాజీ. 1994లో లతా మంగేష్కర్ అమర గాయకుల హిట్ పాటలను తన స్వంత గొంతుతో పాడి రికార్డ్ లు విడుదల చేశారు. కె.ఎల్.సైగల్, రఫీ, హేమంత్ కుమార్, ముఖేష్, పంకజ్ మల్లిక్, కిషోర్ కుమార్, గీతా దత్, జొహ్రబాయ్, అమీర్ బాయ్, పరౌల్ ఘోష్, కనన్ దేవి వంటి గాయకుల పాటలు పాడి వారికి తన శైలిలో నివాళి ఇచ్చారు. .రాహుల్ దేవ్ బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన మొదటి పాట, ఆఖరి పాట కూడా లతా మంగేష్కర్ పాడటం విశేషం. 1999లో ల‌త పేరు మీద ఫెర్ ఫ్యూం ను విడుద‌ల చేశారు. అదే ఏడాదిలో రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయ్యారు. ఎలాంటి జీతం, వ‌స‌తి తీసుకోలేదు.

2005లో అంటే దాదాపు 14 ఏళ్ల త‌ర్వాత ఆమె మ‌ళ్లీ న‌దీం శ్ర‌వ‌ణ్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బేవ‌ఫా సినిమాలో కైసే పియా మై క‌హూ అంటూ పాడారు ల‌త‌. పేజ్ -3లో కిత్ నే అజీబ్ రిస్తే హై య‌హా న్, జైల్ సినిమాలో దాతా సున్ లే, సత్రంగి ప్యారా చూట్ లో తేరే హ‌స్నే సే ముఝ్కో జీనీ క్యా హై వంటి హిట్ సాంగ్స్ పాడారు. 2012లో ఎల్. ఎం. మ్యూజిక్ ద్వారా భ‌జ‌న పాట‌లు విడుద‌ల చేశారు. త‌న చెల్లెలు ఉషాతో క‌లిసి పాడారు. సాధి మ‌న్ సే మ‌రాఠి సినిమాకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ పుర‌స్కారాన్ని అందుకున్నారు. 1948 నుండి 1978 వ‌ర‌కు 30, 000 వేల పాట‌లు పాడిన ఏకైక గాయ‌నిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో పేరు సంపాదించారు.

గాన కోకిల బిరుదు పొందారు. తెలుగులో సంతానం, ఆఖ‌రి పోరాటం సినిమాల‌లో పాడారు. 1959లో టైం మేగ‌జైన్ క‌వ‌ర్ స్టోరీగా ల‌తా మంగేష్క‌ర్ వ్యాసాన్ని ప్ర‌చురించింది. క్వీన్ ఆఫ్ ఇండియ‌న్ ప్లే బ్యాక్ సింగ‌ర్స్ అంటూ ప్ర‌శంసించింది. 2001లో అప్ప‌టి రాష్ట్రప‌తి కే. ఆర్ .నారాయ‌ణ‌న్ చేతుల మీదుగా భార‌త‌ర‌త్న బిరుదును స్వీక‌రించారు. ప‌ద్మ విభూష‌ణ్ అందుకున్నారు. ఫ్రాన్స్ ప్ర‌భుత్వం నుండి 2006లో ది లీజియ‌న్ ఆఫ్ హాన‌ర్‌తో పాటు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. మ‌హారాష్ట్ర భూష‌న్ , ఎన్టీఆర్ జాతీయ అవార్డు, శాంతినికేత‌న్, విశ్వ భార‌తి , శివాజీ యూనివ‌ర్శిటీల గౌర‌వ డాక్ట‌రేట్ లు అందుకున్నారు. రాజాల‌క్ష్మి పుర‌స్కారం, అఫ్స‌రా , కాళిదాస్ స‌మ్మాన్, తాన్ సేన్, నేపాల్ అకాడెమీ , సోవియ‌ట్ లాండ్ నెహ్రూ అవార్డులు పొందారు.

వ‌సంతం వాడి పోదు..ప‌రిమ‌ళం అలానే అల్లుకు పోతుంది..సూర్య చంద్రులు ఉద‌యిస్తూనే ఉంటాయి. ల‌త గాత్రం మ‌నతో పాటే అల్లుకు పోతుంది. గాతా ర‌హా మేరా దిల్ అనుకుంటూ పాడుకుంటూ పోవ‌డ‌మే…క‌దూ..!

Comments

comments

Share this post

scroll to top