ల్యాప్‌టాప్ కొంటున్నారా..? అయితే ఈ విష‌యాల‌ను ఓ సారి ప‌రిశీలించండి..!

ల్యాప్‌టాప్‌… ఒక‌ప్పుడు ఇది కేవ‌లం డ‌బ్బున్న వారి ద‌గ్గ‌ర మాత్ర‌మే ఉన్న విలాస‌వంత‌మైన వ‌స్తువు. కానీ… రోజు రోజుకీ టెక్నాల‌జీలో వస్తున్న విప్ల‌వాత్మ‌క మార్పుల కార‌ణంగా ఇప్పుడ‌వి సామాన్య జ‌నాల‌కు కూడా ద‌గ్గ‌ర‌య్యాయి. ఒక‌ప్పుడు డెస్క్‌టాప్ కంప్యూట‌ర్ల‌ను కొనుగోలు చేసినంత ఈజీగా ఇప్పుడు చాలా మంది ల్యాప్‌టాప్‌ల‌ను కొంటున్నారు. మునుప‌టిలా ఇప్పుడు మొత్తం డ‌బ్బు వెచ్చించాల్సిన ప‌నిలేకుండానే కొంత మొత్తం డౌన్ పేమెంట్ రూపంలో క‌డితే చాలు, నెల‌వారీ ఈఎంఐ ప‌ద్ధ‌తుల్లో ల్యాప్‌టాప్‌ల‌ను అందిస్తున్నారు. దీంతో చాలా మంది ఇళ్ల‌లో ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు ద‌ర్శ‌నమిస్తున్నాయి. అయితే ఇంత వ‌ర‌కు ఓకే..! కానీ… ల్యాప్‌టాప్‌ల‌ను కొనేట‌ప్పుడు చాలా మందికి ఉద‌యించే ప్ర‌శ్న ఒక్క‌టే..! అదేటంటంటే… ఎలాంటి కాన్ఫిగ‌రేష‌న్ ఉన్న ల్యాప్‌టాప్ తీసుకోవాలి..? ఏయే ఫీచ‌ర్లు ఉన్న ల్యాప్‌టాప్ తీసుకుంటే మ‌న అవ‌స‌రాల‌కు స‌రిపోతుంది..? ఇవే ప్ర‌శ్న‌లు చాలా మందికి ఉద్భవిస్తాయి. ఈ క్ర‌మంలో అస‌లు ఎవ‌రు, ఎలాంటి ఫీచ‌ర్లు ఉన్న ల్యాప్‌టాప్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

laptop

డిస్‌ప్లే సైజ్‌…
ల్యాప్‌టాప్ అంటేనే పోర్ట‌బుల్ కంప్యూట‌ర్ అని అర్థం. అంటే దాన్ని ఎక్క‌డికి ప‌డితే అక్క‌డికి తీసుకెళ్లే వీలుంటుంది. ఈ క్ర‌మంలో అలా ల్యాప్‌టాప్‌ల‌ను నిత్యం క్యారీ చేసే వారు డిస్‌ప్లే సైజ్ 12 నుంచి 14 ఇంచులు ఉండేలా చూసుకుంటే బెట‌ర్‌. దాంతో వాటిని సుల‌భంగా ఎక్క‌డికైనా తీసుకెళ్ల‌వ‌చ్చు. అయితే వీడియో ఎడిటింగ్‌, గ్రాఫిక్స్‌, యానిమేష‌న్ వంటి ప‌నులు చేసే వారు 15.6 ఇంచుల డిస్‌ప్లే సైజ్ ఉండేలా చూసుకుంటే మంచిది. దీంతో వారి ప‌నికి ఉప‌యుక్తంగా ఉంటుంది. ఇక ఇలాంటి ప‌ని చేసే వారు అవ‌స‌రం అనుకుంటే 17 ఇంచుల సైజ్ ఉన్న ల్యాప్‌టాప్‌లు కూడా తీసుకోవ‌చ్చు. అది వారి ఇష్టం. అయితే సాధారణ వ‌ర్క్ చేసే వారికి మాత్రం ముందు చెప్పిన‌ట్టుగా 12 నుంచి 14 ఇంచుల డిస్‌ప్లే సైజ్ ఉన్న ల్యాప్‌టాప్‌లు క‌రెక్ట్‌గా సెట్ అవుతాయి.

ప్రాసెస‌ర్‌, ర్యామ్‌…
ప్రాసెస‌ర్‌, ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే ల్యాప్‌టాప్ అంత స్పీడ్‌గా ప‌నిచేస్తుంద‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో సాధార‌ణ వ‌ర్క్ చేసే వారికైతే క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్లు స‌రిపోతాయి. అదే కొంచెం ఎక్కువ వ‌ర్క్ చేసేవారు అయితే ఇంటెల్‌లో కోర్ ఐ3, ఐ5, ఐ7 ప్రాసెస‌ర్లు, ఏఎండీలో ఎ8, ఎ10 ప్రాసెస‌ర్ల‌ను తీసుకుంటే మంచిది. కానీ… ప్ర‌ద‌ర్శ‌న విష‌యానికి వ‌స్తే ఇంటెల్ ప్రాసెస‌ర్లే దాదాపుగా మెరుగ్గా ఉంటాయి. క‌నుక వినియోగ‌దారులు వాటిని తీసుకుంటే ఉత్తమ పెర్‌ఫార్మెన్స్ ల‌భిస్తుంది. ఇక ర్యామ్ అయితే సాధార‌ణ వ‌ర్క్‌కు 4జీబీ నుంచి 8జీబీ వ‌ర‌కు చాలు. గ్రాఫిక్స్, ఎడిటింగ్ వంటి వ‌ర్క్ అయితే 16జీబీ, 32 జీబీ వ‌ర‌కు తీసుకోవాల్సి ఉంటుంది.

గ్రాఫిక్స్ మెమోరీ…
సాధార‌ణ యూజ‌ర్లు గ్రాఫిక్స్ మెమోరీ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కానీ వీడియో ఎడిటింగ్‌, గ్రాఫిక్స్‌, 3డీ గేమ్స్ ఆడే వారు గ్రాఫిక్స్ మెమోరీపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆ మెమోరీ ఎంత ఎక్కువ ఉంటే గ్రాఫిక్స్, ఎడిటింగ్ వంటి ప‌నులు అంత వేగంగా చేసుకోవ‌చ్చు. క‌నుక అలాంటి వారు క‌నీసం 8 జీబీ నుంచి 16 జీబీ వ‌ర‌కు గ్రాఫిక్స్ మెమోరీ ఉండేలా ల్యాప్‌టాప్ తీసుకోవాలి.

హార్డ్ డిస్క్…
ఒక‌ప్పుడంటే హార్డ్ డిస్క్‌లు బాగా మందంగా బ‌రువుగా వ‌చ్చేవి. కానీ వాటికి బ‌దులుగా ఇప్పుడు ఎస్ఎస్‌డీలు ల‌భ్య‌మ‌వుతున్నాయి. ఇవి కూడా హార్డ్ డిస్క్ ల‌లాగే ప‌నిచేస్తాయి. కానీ చాలా తేలిగ్గా ఉంటాయి. ధ‌ర ఎక్కువ‌. చాలా స్పీడ్‌గా డేటా కాపీ అవుతుంది. క‌నుక ల్యాప్‌టాప్‌లో ఫైల్స్ కాపీయింగ్ వేగంగా కావాల‌నుకునే వారు సాధార‌ణ హార్డ్ డిస్క్‌ల‌కు బ‌దులుగా ఎస్ఎస్‌డీల‌ను తీసుకోవ‌చ్చు. ఇవి కూడా 512 జీబీ, 1 టీబీ వంటి కెపాసిటీల్లో ల‌భ్య‌మ‌వుతున్నాయి.

బ్యాట‌రీ…
ఒక‌ప్పుడు ల్యాప్‌టాప్‌ల‌లో 3 నుంచి 4 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్ వ‌స్తే మ‌హా ఎక్కువ. కానీ ఇప్పుడు అలా కాదు. ఏకంగా 7 నుంచి 8 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్ ఇచ్చే ల్యాప్‌టాప్స్ ల‌భిస్తున్నాయి. కనుక వాటిని చూసి తీసుకుంటే బెట‌ర్‌. దీంతో క‌రెంట్ చాలా సేపు అందుబాటులో లేకున్నా ఎక్కువ స‌మ‌యం పాటు ల్యాప్‌టాప్‌పై ప‌నిచేసుకోవ‌చ్చు.

పోర్టులు…
యూఎస్‌బీ టైప్ సి, యూఎస్‌బీ 3.0, హెచ్‌డీఎంఐ, వీజీఏ, ఈథ‌ర్‌నెట్‌, మైక్రో ఎస్‌డీ కార్డ్ రీడ‌ర్ వంటి వివిధ ర‌కాల పోర్టులు ల్యాప్‌టాప్‌ల‌కు ఉంటాయి. క‌నుక ఈ పోర్టులు అన్నీ ఉండే విధంగా ల్యాప్‌టాప్‌ను తీసుకుంటే బెటర్‌.

క‌నెక్టివిటీ…
బ్లూటూత్‌, వైఫై క‌నెక్టివిటీ ల్యాప్‌టాప్‌ల‌లో క‌చ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే నేడు ఎక్క‌డికెళ్లినా మ‌న‌కు ఇంట‌ర్నెట్ ఈ రెండు మాధ్య‌మాల ద్వారా ల‌భిస్తుంది క‌నుక‌, ఈ రెండు క‌నెక్టివిటీ ఆప్ష‌న్లు క‌చ్చితంగా ఉండాలి. దీంతోపాటు కొన్ని ల్యాప్‌టాప్‌ల‌లో ఏకంగా సిమ్ కార్డుల‌ను వేసుకునే ఫీచ‌ర్ కూడా ఇస్తున్నారు. క‌నుక ఆ ఫీచ‌ర్ కూడా ఉండేలా ల్యాప్ టాప్ తీసుకుంటే బెట‌ర్‌.

ఇక చివ‌రిగా… డీవీడీ/బ్లూ రే రైట‌ర్‌, వెబ్‌కామ్ వంటి ఫీచ‌ర్లు కూడా ల్యాప్‌టాప్‌ల‌లో ఉండేలా చూసుకోవాలి. అవి లేక‌పోతే ఇంట‌ర్నెట్‌ను వాడేట‌ప్పుడు లేదంటే డిస్క్‌లు రైట్ చేయాల‌న్నా ఇబ్బందులు వ‌స్తాయి. క‌నుక ఈ ఫీచ‌ర్లు కూడా క‌చ్చితంగా ఉండాల్సిందే. ఇవ‌న్నీ ఫీచ‌ర్ల‌ను గ‌మ‌నించి తీసుకుంటే క‌చ్చితంగా మీ అవ‌స‌రాల‌కు త‌గిన ల్యాప్‌టాప్ దొరుకుతుంది. కాబ‌ట్టి ల్యాప్‌టాప్ కొనుగోలు విష‌యంలో ఈ సూచ‌న‌లన్నీ ఓసారి ప‌రిశీలించి మ‌రీ తీసుకోండి. లేదంటే ఓసారి ల్యాప్‌టాప్ కొన్నాక అందులో ఫీచ‌ర్లు న‌చ్చ‌క‌పోతే దాన్ని అప్‌గ్రేడ్ చేయించ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది.

Comments

comments

Share this post

scroll to top