ఏదైనా ఒక అంశాన్ని అది వివాదం చేయగలదు. లేదనుకుంటే సెన్సేషన్ సృష్టించగలదు. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మార్చగలదు. ఏ వ్యక్తినైనా రాత్రికి రాత్రే సెలబ్రిటీని చేయగలదు. అదే సోషల్ మీడియా..! దీని ప్రభావం జనాలపై ఎలా ఉందో ఇప్పుడు అందరికీ బాగా తెలుసు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు ఈ మధ్య సోషల్ మీడియా అంటే ఓ సారి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏ అంశం పోస్ట్ చేస్తే జనాలు ఎలా స్పందిస్తారో తెలియదు కదా. వారి సంగతి సరే, మరి సాధారణ ప్రజల సంగతి మాటేమిటి..? అయితే వారూ సెలబ్రిటీలు అయిపోవచ్చు. అది ఎలా అంటారా..? ఆకట్టుకునే రూపం, మంచి శరీర ఆకృతి, సౌష్టవం ఉంటే చాలు… అలాంటి వారిని సోషల్ మీడియా స్టార్లుగా చేస్తుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణలను మనం ఇది వరకే చూశాం.
watch video here:
అర్షద్‌ఖాన్ తెలుసుగా. పాకిస్థాన్‌కు చెందిన చాయ్‌వాలా. ఓ ఫొటోగ్రాఫర్ అతని ఫొటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే, ఇంకే ముంది… రాత్రికి రాత్రే ఆ ఫొటో కాస్తా వైరల్‌గా మారి అతను తెల్లారేసరికి పెద్ద మోడల్ అయ్యాడు. అతనే కాదు, సోషల్ మీడియా పవర్‌తో అలా స్టార్లుగా మారిన పలువురు సాధారణ వ్యక్తులను కూడా మనం ఇది వరకు చూసి ఉన్నాం. అయితే నేపాల్‌కు చెందిన ఆ యువతి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. అంటే, ఆమె ఇంకా మోడల్ కాలేదు. కానీ ఆమెకు చెందిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.
అది నేపాల్ దేశం. భరత్పూర్ నగరం. నేపాల్‌లోనే 5వ పెద్ద నగరం. అక్కడికి సమీపంలో గోర్ఖా, చిత్వాన్ అనే రెండు ప్రాంతాలు ఉన్నాయి. ఆ రెండింటి మధ్య ఓ చిన్నపాటి బ్రిడ్జి కూడా ఉంది. అయితే అది కేవలం పాదచారులకు మాత్రమే ఉద్దేశించబడినది. ఈ క్రమంలో ఆ బ్రిడ్జిపై రెండు పెద్ద పెద్ద టమాటా పెట్టెలను మోస్తూ వస్తోంది ఆ యువతి. అదే సమయానికి అక్కడికి వచ్చిన రూప్‌చంద్ర మహాజన్ అనే ఫొటో జర్నలిస్ట్ సదరు యువతిని ఫొటోలు తీసింది. అంతే కాదు ఆమెను ఫాలో అయి మార్కెట్లో ఫోన్లో మాట్లాడుతుండగా మరో ఫొటో తీసింది. వెంటనే స్థానిక సైట్లలో షేర్ చేసింది. అంతే, ఇప్పుడవి నేపాల్‌లో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ఆమె అందాన్ని చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఏదో కంపెనీ లేదంటే ఎవరో కావాలనే అలా ఫొటో షూట్ చేశారని, చూసేందుకు ఆమె కూరగాయల వ్యాపారిలా లేదని కొందరంటుంటే, ఇంకా కొందరు మాత్రం దాన్ని కొట్టి పారేస్తున్నారు. నిజంగా ఆమె కూరగాయలు అమ్ముతుందని, ఫొటో తీసినందు వల్లే ఆమె గురించి అందరికీ తెలిసిందని, అతి త్వరలోనే ఏదో ఒక మోడలింగ్ కంపెనీ ఆమెకు కూడా ఆఫర్ ఇస్తుందని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఆ ఫొటోలో ఉన్న నేపాల్ యువతి మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంది కదూ..! నిజంగా ఆమె కూరగాయల వ్యాపారి అయితే అర్షద్ ఖాన్‌లా ఆమె కూడా రాత్రికి రాత్రే పాపులర్ అవ్వాలని ఆశిద్దాం..!