మన దేశంలో ఉన్న మెట్రో నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థ ఎంత దీనావస్థలో ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రజలకు సరిపోయిన బస్సులు ఉండవు. కిక్కిరిసి ఉంటాయి. కొన్ని రూట్లలో బస్సులు ఉండవు. ప్రైవేటు వాహనాలే గతి. ఇక మెట్రో రైళ్ల సంగతి సరే సరి. వాటిలోనూ ఇసుక వేస్తే రాలనంత జనం ప్రయాణిస్తుంటారు. దీనికి తోడు బస్సులైనా, రైళ్లయినా ఏ వేళల్లో నడుస్తాయో, వాటిలో రద్దీ ఎంత ఉందో తెలుసుకోవడం చాలా కష్టం. అయితే ఇకపై అలాంటి ఇబ్బందులకు తెర దించేందుకు ప్రయత్నిస్తోంది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. అక్కడి కోల్‌కతా నగరంలో రెండు ప్రాజెక్టులను ఆ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అవేమిటంటే…
ఒకటి ఉచిత ప్రీపెయిడ్ స్మార్ట్ కార్డ్. రెండోది పతాదిశా యాప్. ప్రీపెయిడ్ స్మార్ట్ కార్డ్‌లు ఎలా పనిచేస్తాయంటే వాటిని వినియోగదారులు ఉచితంగానే పొందవచ్చు. కాకపోతే అందులో బ్యాలెన్స్ వేసుకోవాలి. నగరంలో నిర్దేశించిన కేంద్రాల్లో డబ్బులు చెల్లించి లేదా ఆన్లైన్ ద్వారా ఆ కార్డుల్లో రీచార్జి చేయించుకోవచ్చు. అలా చేయించుకున్నాక వినియోగదారులు తమకు నచ్చిన విధంగా ప్రయాణించవచ్చు. బస్సు, ట్రాము, ఫెర్రీ ఇలా ఎందులోనైనా ఆ కార్డు స్వైప్ చేసి ప్రయాణించవచ్చు. దీంతో అందుకు అయ్యే చార్జి మొత్తం ఆ కార్డు నుంచి కట్ అవుతుంది. దేశంలో ఇలాంటి కార్డును ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా వెస్ట్ బెంగాల్ రికార్డు సృష్టించింది.
ఇక రెండోది పతాదిశా యాప్. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌పై పనిచేస్తుంది. దీన్ని ఫోన్లో వేసుకుంటే చాలు, కోల్‌కతా నగరంలో ప్రయాణికులకు ఏ బస్సు ఎక్కడికి వెళ్తుంది, దాని మార్గం, ఎక్కడ ఉంది, అందులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు, దాని సమయ వేళలు వంటి వివరాలు అన్నీ తెలుస్తాయి. అంతేకాదు, బస్సుల్లో జీపీఎస్ కూడా అమర్చుతున్నారు. దీని వల్ల ఆ బస్సుకు ఏదైనా యాక్సిడెంట్ అయినా, లేదంటే ప్రయాణికులకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే పానిక్ బటన్ ప్రెస్ చేయవచ్చు. దీంతో ఆ సమాచారం పోలీసు, అగ్ని మాపక శాఖ, వైద్య శాఖలకు చేరుతుంది. ఈ క్రమంలో ఆయా విభాగాల అధికారులు వెంటనే బస్సు వద్దకు చేరుకుని సేవలను అందించేందుకు వీలు కలుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. త్వరలోనే కోల్‌కతా నగరమంతటా, ఆపై ఆ రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. ఏది ఏమైనా… వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రెండు ప్రాజెక్టులు చాలా బాగున్నాయి కదూ..! దేశమంతటా ఇలా చేస్తే బాగుంటుంది..!