రహదారిపై ఆంబులెన్స్ వెళ్తుంటే కచ్చితంగా ఎవరైనా దానికి దారి ఇస్తారు. ఎంతటి ట్రాఫిక్ జాం ఉన్నా సరే ఆంబులెన్స్‌కు అందరూ దారి ఇస్తారు. దీంతో అందులో ఉన్న బాధితులను సకాలంలో హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యం అందించేందుకు వీలు కలుగుతుంది. అయితే అందరూ ఆంబులెన్స్‌కు దారి ఇచ్చే మంచి వ్యక్తులే ఉండరు కదా, కొందరు చెడ్డ వారు కూడా ఉంటారు. వారు ఎవరి మాటా వినరు. ఆ క్రమంలో వారు ఆంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వరు. ఇప్పుడు మేం చెప్పబోతుంది కూడా అలాంటి ఓ ప్రబుద్దుడి గురించే. అతను ఆంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడం వల్ల ఆ వాహనం 20 నిమిషాలు ఆలస్యంగా హాస్పిటల్‌కు వెళ్లింది. దీంతో అందులో ఉన్న ఓ పసికందుకు చికిత్సనందించడం చాలా కష్టతరమైంది.
కేరళలోని కొచ్చిలో ఉన్న అలువా అనే ప్రాంతమది. ఈ నెల 17వ తేదీన ఆంబులెన్స్‌లో మధు అనే డ్రైవర్ ఓ పసికందును పెరుంబావుర్ నుంచి కలమసెరి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తీసుకెళ్తున్నాడు. అయితే మార్గమధ్యలో నిర్మల్ జోస్ అనే వ్యక్తి అడ్డుగా వచ్చాడు. అతను తన కారును ఆంబులెన్స్‌కు అడ్డుగా నడిపించసాగాడు. ఎంత సేపు హారన్ మోగించినా జోస్ ఆంబులెన్స్‌కు దారి ఇవ్వలేదు. ఆ క్రమంలో అతనికి దారి ఇచ్చేందుకు చాలా సార్లు అవకాశాలు వచ్చాయి. అయినా అతను కారును అడ్డుగా పోనిచ్చాడే తప్ప ఆంబులెన్స్‌కు దారి ఇవ్వలేదు.
దీంతో 15 నిమిషాల్లో హాస్పిటల్‌కు చేరుకోవాల్సిన ఆంబులెన్స్ 20 ఆలస్యం అయి హాస్పిటల్‌కు చేరుకుంది. అప్పటికే అందులో ఉన్న పసికందు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అత్యంత విషమ పరిస్థితి ఆ పసికందుకు కలిగింది. కాగా సదరు కారును నడిపిన నిర్మల్ జోస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇలాంటి నీచులను ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి..!