మీరు విన్న మీకిష్ట‌మైన పాట స‌రిగ్గా గుర్తుకు రాక మైండ్‌లో అలాగే తిరుగుతుందా..? అయితే అలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసుకోండి..!

సంగీత విన‌డం అంటే ఎవ‌రికైనా ఇష్ట‌మే. అభిమాన సంగీత ద‌ర్శ‌కుడో, గాయ‌కుడో, గాయ‌కురాలో, సినిమా పాటో లేదా ఇత‌ర ఏ పాటైనా మ‌న‌సుకు న‌చ్చింది వింటే క‌లిగే ఆ ఉత్తేజ‌మే వేరుగా ఉంటుంది. అయితే కొన్ని సంద‌ర్భాల్లో మ‌న‌కు ఎంత‌గానో న‌చ్చిన పాట‌, తెలిసిన పాట ఒక్కోసారి పెదాల‌పైనే ఉంటుంది, కానీ బ‌య‌టికి రాదు. దాని గురించి ఎంత ఆలోచించినా అస‌లు ఆ పాట ముందు ప్రారంభం ఏమిటో అస్స‌లు గుర్తుకు రాదు. దీంతో అదో ర‌క‌మైన ఆతుర‌త మ‌న‌సులో చోటు చేసుకుంటుంది. ఇక ఆ పాట తెలిసే వ‌ర‌కు ఆ ఆతుర‌త మెద‌డులో కొన‌సాగుతూనే ఉంటుంది. దీన్నే ఆంగ్లంలో ఇయ‌ర్ వార్మ్ (ear worm) అని కూడా పిలుస్తారు. అస‌లు ఇది ఎందుకు వ‌స్తుందో ఇప్పుడు చూద్దాం…

ear-worm
సంగీతం త‌ర‌చుగా వినే వారిలో దాదాపు 92 శాతం మందికి వారానికి ఒక‌సారైనా పైన చెప్పిన ఇయ‌ర్ వార్మ్ స్థితి వ‌స్తుంద‌ట‌. సాధార‌ణంగా ఇలా గుర్తుకు రాని పాట‌ల నిడివి ఎక్కువ‌గానే ఉంటుంద‌ట‌. అలా ఇయ‌ర్ వార్మ్ స్థితిలో ఉన్న‌ప్పుడు పాట మొత్తం గుర్తుకు రాదు, కానీ అందులో 8 సెకన్ల ట్యూన్ మాత్రమే గుర్తుంటుద‌ట‌. అదే మ‌న మైండ్‌లో తిరుగుతూ ఉంటుంద‌ట‌. అయితే ఇష్ట‌మైన పాట‌ను ఎక్కువ సార్లు విన‌డం, వినేట‌ప్పుడు వాయిస్‌పై కాకుండా సంగీతంపై దృష్టి పెట్ట‌డం, పాట‌లో కోర‌స్ వంటివి ఎక్కువ‌గా ఉండ‌డం, రోజులో సంగీతం ఎక్కువ‌గా వింటుండ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల ఇయ‌ర్ వార్మ్ స్థితి ఎక్కువ‌గా వ‌స్తుంద‌ట‌. కాగా పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ‌గా ఈ ఇయ‌ర్ వార్మ్ స్థితిని ఎదుర్కొంటార‌ట‌.

songs-listening
ఇయ‌ర్ వార్మ్ స్థితి గురించి డార్ట్‌మౌత్ కాలేజ్ ప‌రిశోధ‌కులు ఓ ప‌రిశోధ‌న చేశారు. దీంతో వారికి తెలిసిందేమిటంటే మ‌న మెద‌డులో ఉండే ఆడిట‌రీ కార్టెక్స్ అనే ఓ ప్ర‌దేశంలో మ‌నం వినే పాట‌ల‌కు చెందిన ట్యూన్లు నిక్షిప్త‌మ‌వుతాయ‌ట‌. ఈ క్ర‌మంలో ఆ ప్ర‌దేశం వ‌ల్ల ఇయ‌ర్ వార్మ్ స్థితి వ‌స్తుంద‌ట‌. అయితే ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. అదేమిటంటే మ‌నం ఏదైనా ప‌నిలో ఉన్న‌ప్పుడు ఏదైనా పాట వింటే, మ‌ళ్లీ ఆ ప‌ని ఎప్పుడైనా చేసిన‌ప్పుడు మ‌నం విన్న పాట ఆ స‌మ‌యంలో గుర్తుకు వ‌స్తుంద‌ట‌. అంటే… ఉదాహ‌ర‌ణ‌కు మీకు ప‌వ‌న్ కల్యాణ్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాలోని గ‌బ్బ‌ర్‌సింగ్ పాట అంటే ఇష్టం ఉంద‌ని అనుకుందాం. కంప్యూట‌ర్‌పై ప‌నిచేస్తున్న‌ప్పుడో, వాకింగ్ చేస్తూనో, బ‌స్సులో వెళ్తూనో ఆ పాట‌ను విన్నార‌నుకుందాం. మ‌ళ్లీ మీరు ఆ ప‌నిలో ఏదైనా ఒక ప‌ని చేస్తూ ఉన్న‌ప్పుడు గబ్బ‌ర్‌సింగ్ పాట దానంత‌ట అదే గుర్తుకు వ‌స్తుంద‌ట‌. కాగా ఇలాంటి ఇయ‌ర్ వార్మ్ స్థితిలో ఉన్న‌వారు ప‌లు ర‌కాల ఎమోష‌న్స్‌కు కూడా బాగా స్పందిస్తార‌ట‌. అయితే ఓ సింపుల్ చిట్కాను పాటిస్తే ఈ ఇయ‌ర్ వార్మ్ స్థితిని అధిక శాతం వ‌ర‌కు దూరం చేసుకోవ‌చ్చ‌ని స‌ద‌రు ప‌రిశోధ‌కులు సెల‌విచ్చారు.

ఈ సారి మీరు ఏదైనా ఇష్ట‌మున్న పాట‌ను విన్న‌ప్పుడు కేవ‌లం ఒకేసారి కాకుండా ఒక రెండు, మూడు సార్లు వినండి. అనంత‌రం క్రాస్‌వ‌ర్డ్‌, సుడోకు వంటి మెద‌డుకు మేత పెట్టే ప‌లు పజిల్స్‌ను పూర్తి చేయండి. అంతే! ఆ పాట మీకు ఎప్ప‌టికీ గుర్తుంటుంది. ఇక‌పై అలాంటి ఇయ‌ర్ వార్మ్ స్థితి రాదు.

Comments

comments

Share this post

scroll to top