క్రిస్ గేల్ రాకతో ఐపీఎల్లో పంజాబ్ టీం జోరు మీదున్న విషయం విదితమే. గేల్ విధ్వంసానికి కేఎల్ రాహుల్ మెరుపులు కూడా తోడవుతుండడంలో ప్రతి మ్యాచ్‌లోనూ పంజాబ్ విజయం సాధిస్తూ వస్తోంది. కేవలం ఒక్క మ్యాచ్ తప్ప పంజాబ్ ఇప్పటి వరకు తాను ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ 4 స్థానాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లోనూ పంజాబ్ ఘన విజయం సాధించింది.
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన పంజాబ్ దూకుడుగా ఆడింది. అయితే ఆటకు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో టార్గెట్‌ను కుదించారు. 13 ఓవర్లలో 125 పరుగుల టార్గెట్ ఫిక్స్ చేయగా, గేల్, రాహుల్ లు రెచ్చిపోయి ఆడడంతో పంజాబ్ ఆ మ్యాచ్‌లో కోల్‌కతాపై అలవోకగా విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం పంజాబ్ టీం ఓనర్, నటి ప్రీతి జింటా, ఆటగాడు కేఎల్ రాహుల్‌తో యాంకర్లు మాట్లాడించారు.
అలా మాట్లాడుతుండగా ఓ సందర్భంలో కేఎల్ రాహుల్ తమ టీం (పంజాబ్) ఐపీఎల్ గెలిస్తే ఏం చేస్తావ్ ? అని ఓనర్ అయిన ప్రీతి జింటాను అడిగాడు. అందుకు ప్రీతి నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే.. తమ టీం గెలిస్తే కచ్చితంగా ఆటగాళ్లకు మంచి పార్టీ ఇస్తానని, దీంతోపాటు ఓ స్పెషల్ సర్ప్రైజ్ కూడా ఉంటుందని ప్రీతి తెలిపింది. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే.. ఐపీఎల్లో పంజాబ్ విన్ అయితేనే అది మనకు తెలుస్తుంది..! చూద్దాం.. ఒక వేళ పంజాబ్ ఈ ఏడాది ఐపీఎల్ గెలిస్తే ఆ టీం ఓనర్ ప్రీతి జింటా ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందో..! వేచి చూస్తే తెలుస్తుంది..!