చెన్నై సూపర్ కింగ్స్ కు పెద్ద షాక్..! ఆ చొక్కా వేసుకొస్తే నో ఎంట్రీ! ఎందుకో తెలుసా..?

రెండేళ్ల విరామం త‌రువాత ఎట్ట‌కేల‌కు ఐపీఎల్ 2018 టోర్న‌మెంట్‌లోకి మ‌ళ్లీ చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు రీ ఎంట్రీ ఇచ్చాయి. ఇప్ప‌టికే ఐపీఎల్ కూడా ప్రారంభం కాగా తొలి మ్యాచ్‌లో ముంబైపై చెన్నై ఘ‌న విజ‌యం సాధించింది. రెండేళ్ల‌పాటు టోర్న‌మెంట్‌కు దూర‌మైనా చెన్నై జ‌ట్టు దూకుడు ఏమాత్రం త‌గ్గ‌లేదు. అయితే ఎట్టకేల‌కు ఐపీఎల్‌లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాం.. అని ఆ జ‌ట్టు ఊపిరి పీల్చుకుంటుండ‌గా ఇప్పుడు ఆ టీంకు మ‌ళ్లీ మ‌రో సెగ ఎదురైంది. అది త‌మిళ‌నాడు కావేరీ జ‌ల వివాదం రూపంలో..

కావేరీ జ‌ల వివాదాల‌ను ప‌రిష్క‌రించేందుకు కావేరీ వాట‌ర్ బోర్డును ఏర్పాటు చేయాల‌ని గ‌త కొన్ని రోజులుగా త‌మిళ‌నాడులో ఆందోళ‌నలు కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. మొన్న‌టి వ‌ర‌కు జరిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనూ అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు ఇదే విష‌య‌మై రోజూ స‌భ‌లో ఆందోళ‌న చేశారు. దీంతో స‌భ స‌జావుగా జ‌ర‌గ‌లేదు. ఇక ఇప్పుడు ఆందోళ‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో మ‌రింత ఉధృత‌మైంది. కావేరీ వాట‌ర్ బోర్డు ఏర్పాటును కోరుతూ ఆ రాష్ట్రంలో రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జా ప్ర‌తినిధులు చేస్తున్న నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌కు అక్క‌డి ప్ర‌జ‌లే కాదు, ఆ రాష్ట్ర సినీ స్టార్లు కూడా మ‌ద్ద‌తు ప‌లికారు.

తాజాగా కావేరీ జ‌ల వివాదాల‌ను ప‌రిష్క‌రించాల‌ని, కావేరీ వాట‌ర్ బోర్డును ఏర్పాటు చేయాల‌ని కోరుతూ త‌మిళులు చేప‌ట్టిన నిర‌స‌న‌కు త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు ప‌లికింది. ఈ నెల 8వ తేదీన ఆదివారం త‌మిళ స్టార్ హీరోలంద‌రూ క‌లిసి చెన్నై న‌గ‌రంలో శాంతియుతంగా నిర‌స‌న చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో నిర‌స‌న‌లో పాల్గొన్న త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ.. చెన్నైలో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని పిలుపునిచ్చారు. దీంతోపాటు త‌మిళ ప్ర‌జ‌ల నిర‌స‌న‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతూ చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఆట‌గాళ్లు న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించాల‌ని ఆయ‌న కోరారు.

చెన్నై సూపర్ కింగ్స్ టీం స్వ‌యంగా త‌మ మ్యాచ్‌ల‌ను తామే బ్యాన్ చేసుకోవాల‌ని, అలా వీలు కాని ప‌క్షంలో క‌నీసం మ్యాచ్‌లు ఆడే స‌మ‌యంలోనైనా న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించాల‌ని ర‌జ‌నీకాంత్ కోరారు. ఇందుకు బీసీసీఐ, ఐపీఎల్, చెన్నై జ‌ట్టు యాజ‌మాన్యాలు అంగీక‌రించాల‌ని ఆయ‌న అన్నారు. క‌నీసం ఇలా చేస్తేనైనా త‌మిళ ప్ర‌జ‌ల నిర‌స‌న యావ‌త్ దేశానికి తెలుస్తుంద‌ని, దీంతో వారి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ర‌జనీ అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ర‌జ‌నీ వ్యాఖ్య‌ల‌కు మ‌రో వైపు బీసీసీఐ స్పందించింది. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీయే స్వయంగా మ్యాచ్‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని పిలుపునిచ్చినందున అందుకు పెద్ద ఎత్తున స్పంద‌న వ‌చ్చే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో చెన్నై మ్యాచ్‌లు ఆడేట‌ప్పుడు స్టేడియంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ముందస్తుగా బీసీసీఐ చ‌ర్య‌లు చేప‌ట్టింది.

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మంగ‌ళ‌వారం చెన్నై, రాజ‌స్థాన్ జట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌క్ర‌మంలో ఆ మ్యాచ్‌కు ఎవ‌రైనా న‌లుపు రంగు దుస్తులు వేసుకుని వ‌స్తే అనుమ‌తించేది లేద‌ని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ క్ర‌మంలోనే ఈ మ్యాచ్‌కు పోలీసులు కూడా రెండింత‌ల ఎక్కువ భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు. దీంతో ఐపీఎల్ యాజ‌మాన్యం మ్యాచ్‌ను చెన్నైలోనే కొన‌సాగించ‌నుంది. ఇక ఇలాంటి ప‌రిణామాల మ‌ధ్య చెన్నైలో అస‌లు రేప‌టి మ్యాచ్‌లో ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top