ఇష్టం లేకపోయినా బ్రతుకు దెరువు కోసం చేసే జాబ్‌లో కంటిన్యూ అవ్వాలా..? లేదంటే జాబ్‌ను వదులుకుని జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలా..? సరిగ్గా.. ఇవే రెండు ప్రశ్నలు.. నేటి తరుణంలో చాలా మందికి ఎదురవుతుంటాయి. దీంతో అసలు ఏం చేస్తే బాగుంటుంది..? అన్న సందేహంలోనే చాలా మంది కాలం వెళ్లదీస్తుంటారు. అసలు తమ లక్ష్యం ఏమిటి..? ఏం చేస్తే దాన్ని సాధించవచ్చు..? అని ఎవరూ ఆలోచించరు. అయితే ఆ మహిళ మాత్రం సరిగ్గా ఇలాగే ఆలోచించింది. కనుకనే తాను చేస్తున్న మంచి జాబ్‌ను కూడా వదిలేసింది. చివరకు తాను అనుకున్న లక్ష్యానికి చేరువైంది.
ఆమె పేరు అస్ఫియా. కాశ్మీర్ వాసి. ఈమె న్యూ ఢిల్లీలో అపీజయ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కాలేజీలో బ్యాచిలర్స్ ఇన్ మల్టీమీడియా విద్యను అభ్యసించింది. అనంతరం ఆమెకు కాశ్మీర్ యూనివర్సిటీలో గ్రాఫిక్ డిజైనర్‌గా జాబ్ వచ్చింది. అది మంచి ఉద్యోగం. గొప్ప శాలరీ. అయినా అవి ఆమెకు తృప్తినివ్వలేదు. ఎలాగైనా సొంతంగా బొటిక్ పెట్టాలనుకుంది. అందులో భాగంగానే మొదట ఆమె తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. అనంతరం బొటిక్ ఏర్పాటు దిశగా తన ప్రయత్నాలు ప్రారంభించింది. ఎట్టకేలకు ఆమె బొటిక్‌ను ఓపెన్ చేసింది.
అయితే అస్ఫియా ఓపెన్ చేసిన బొటిక్ ఎక్కడ ఉందో తెలుసా..? శ్రీనగర్‌లో ఉంది. ఆ బొటిక్ పేరు ఇబ్న్ బటుటా. ఇక ఈ బొటిక్ సాధారణ బొటిక్ కాదు. లగ్జరీ బొటిక్. అందులో ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు, నగరాల్లో ఉండే లగ్జరీ ఐటమ్స్ లభిస్తాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా పేరు గాంచిన ప్రముఖ లైఫ్ స్టైల్ ఉత్పత్తులను ఈమె తన బొటిక్‌లో విక్రయిస్తుంది. లెదర్ వస్తువులు, డెకరేషన్ ఐటమ్స్, ఇత్తడితో తయారు చేసిన అలంకరణ వస్తువులు, హ్యాండ్ మేడ్ పేపర్ ప్రోడక్ట్స్, మొరాకో ల్యాంప్ షేడ్స్, గ్లాస్ వేర్, క్లాక్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. అస్ఫియా బొటిక్‌లో ఉండే ఐటమ్స్ లిస్ట్ చాంతాడంత అవుతుంది. అన్ని లగ్జరీ ఐటమ్స్‌ను ఈమె విక్రయిస్తుంది. అంతే కాదు, ఇప్పుడీమె బొటిక్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది కూడా. దీంతో ఎట్టకేలకు అస్ఫియా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. అందుకు ఆమెకు నిజంగా అభినందనలు తెలపాల్సిందే..!