దేశానికే తలమానికంగా పేర్కొంటున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. ఈ విషయంలో లెక్కలేనన్ని కేసులు న్యాయ స్థానంలో ఉన్నాయి. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో లెక్క ఇంకా తేలలేదు. భారీ విజయం నమోదు చేసుకొని ప్రభుత్వం కొలువు తీరినా పూర్తి స్థాయిలో మంత్రివర్గం విస్తరణ జరగలేదు. ఫెడరల్ ఫ్రంట్ ను బలోపేతం చేయడంలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసినా..ఇంకా విజయోత్సవ సభలతో తెలంగాణ దద్దరిల్లుతోంది. ఎక్కడ చూసినా జిగేల్ మనిపించే గులాబీ జెండాలు, కళ్లు చెదిరేలా వాహనాలతో నిండి పోయాయి. ఏ శాఖ ఎవరికి దక్కుతుందోనని ఎన్నికైన మారాజులు ప్రయత్నాలలో మునిగి పోయారు. ఇక ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్లలో నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమానికి వేతనాలు పొందుతున్న ఉద్యోగులు రాలేక పోతున్నారు.
అన్ని జిల్లాలే ..ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ దందాలే. చేసేందుకు పనులు లేవు. బతుకులకు భద్రత లేదు. కనీసం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టులు కూడా భర్తీ చేయడంలో శ్రద్ధ చూపడం లేదు. అన్ని శాఖలలో కొలువులు ఖాళీలున్నా ఎప్పుడు భర్తీ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. యుద్ద ప్రాతిపదికన ప్రకటించిన పంచాయతీ కార్యదర్శి పోస్టుల ప్రక్రియ డొల్లతనాన్ని బయట పెట్టింది. మిషన్ భగీరథ, కాకతీయ, సంక్షేమ పథకాల పేర్లు పలకడానికి బాగానే ఉన్నా.. ఏజ్ బార్ అయి నిరుద్యోగులు కోచింగ్ గదుల్లో ఉండి పోయారు.
టీఎస్ పీఎ స్సీ లో 30 లక్షల దాకా నమోదు చేసుకున్నారంటే నిరుద్యోగం ఎంత ప్రమాదకరంగా తయారైందో సర్కార్ ఆలోచించాలి. స్టార్టప్‌లు, ఐటీ కంపెనీలు తెలంగాణ పిల్లలకు భరోసా కల్పించలేక పోతున్నాయి. టీచర్ పోస్టులు భర్తీ కాక పిల్లలకు పాఠాలు పూర్తి కావడం లేదు. సాంస్కృతిక శాఖ ఏం చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అటెండర్ పోస్టుకు సైతం నోటిఫికేషన్ వేస్తున్న సమయంలో ఏకంగా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే 550 మంది కళాకారులు 20 వేలకు పైగా నెల జీతంతో నాలుగున్నర ఏళ్లు పనిచేశారంటే ఎంత విచిత్రం. ఎవరికి ఉద్యోగాలు దక్కాయో సమాచారం లేదు. ఈ విషయమై కొందరు కోర్టు మెట్లు ఎక్కారు. సాంస్కృతిక వారధి ఎంపిక ప్రక్రియ తెలుసుకుని ..అక్రమాలకు తావు లేకుండా భర్తీ చేయాలని కోర్టు తీవ్ర స్థాయిలో ఆదేశించింది.
నాలుగేళ్ల కిందట చేపట్టిన నియామకాలకు మళ్లీ దరఖాస్తులు కోరుతున్నారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 1 నుండి 19 వరకు గడువు విధించింది. ఫీజు చెల్లించేందుకు 18 ఆఖరు తేది. తగిన అర్హతలు లేకపోతే కొందరు కొలువులు కోల్పోయే ప్రమాదం ఉంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కళాకారులకు జాబ్‌లు ఇవ్వాలన్న ఉద్ధేశంతో 2014లో పోస్టులను సృష్టించింది. 550 మంది కళాకారులను కన్సాలిడేటెడ్ వేతనంపై నియమించింది.
వారికి ప్రతి నెలా 24వేల 146 రూపాయలను చెల్లించింది. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించేందుకు వీరు పనిచేస్తారు. ఇష్టారీతిన భర్తీ చేశారని..డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వచ్చాయి. రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయాల్సి ఉండగా వాటిని పక్కన పెట్టారంటూ భువనగిరి జిల్లా టంగుటూర్ కు చెందిన రమేష్ తోపాటు మరో ఇద్దరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా నాలుగేళ్లు పోరాటం చేశారు.
నియామకాల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించక పోవడంపై గత ఏడాది జూలైలో హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు, వివిధ అంశాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు కళాకారులను నియమించామని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ నివేదించారు. వారికి జీతాలు ఎలా చెల్లిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రత్యేక నిధి నుంచి ఇస్తున్నామని అదనపు ఏజీ బదులివ్వడంతో.. ‘‘చిన్నారులకైతే బుజ్జగించి చెప్పవచ్చు.పెద్దలకు కఠినంగా చెప్పడమే సరైంది’’ అని వ్యాఖ్యానిస్తూ.. నోటిఫికేషన్ ఇవ్వకుండా, దరఖాస్తులు కూడా స్వీకరించకుండా నియామకాలు చేపట్టడం సరికాదని స్పష్టం చేసింది.
‘‘నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు. సాంస్కృతిక సారథి చెప్పిన కళాకారులనే నియమించారు. దీనివల్ల అర్హులకు తీవ్ర అన్యాయం జరిగింది. కనక ఆ నియామకాలు చెల్లవు’’ అని ఆదేశించింది. మూడు వారాల్లో తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్దేశించింది. నియామక ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కొత్త నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ 550 మంది కళాకారులను కొనసాగించవచ్చని సూచించింది. ధర్మాసనం తీర్పుతోనైనా నిజమైన మట్టి బిడ్డలకు కొలువులు దక్కితే చాలని నిరుద్యోగులు కోరుతున్నారు.