Movie Title (చిత్రం): కాటమరాయుడు (Kaatamarayudu)
Cast & Crew:
- నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్, నాజర్, అలీ, రావు రమేష్, ప్రదీప్ రావత్, తరుణ్ అరోరా, శివ బాలాజీ, అజయ్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు తదితరులు
- సంగీతం: అనూప్ రూబెన్స్
- కూర్పు: గౌతంరాజు
- ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల
- నిర్మాత: శరత్ మరార్
- దర్శకత్వం: డాలీ
Story:
కాటమరాయుడు(పవన్ కల్యాణ్)కి నలుగురు తమ్ముళ్లు (శివ బాలాజీ, అజయ్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు). వాళ్లంటే రాయుడికి ప్రాణం. వూరికి పెద్దగా.. పేదోళ్ల పాలిట దేవుడిగా రాయుడ్ని కొలుస్తుంటారు గ్రామస్థులు. వాళ్లకి ఏ ఆపద వచ్చినా రాయుడు అండగా నిలబడతాడు. ఇంత మంచి రాయుడికి ఓ బలహీనత కూడా ఉంది. తనకు అమ్మాయిలంటే పడదు. అందుకే పెళ్లీడు వచ్చి దాటిపోతున్నా… పెళ్లి మాటెత్తడు. అన్నయ్యకు పెళ్లికాకపోతే తమ్ముళ్లకెందుకు అవుతుంది? వాళ్లకు అమ్మాయిలు, పెళ్లి, సంసారం లాంటి కలలున్నా… అన్నయ్య కోసం తమ కోరికల్ని, ఆశల్ని చంపేసుకొంటారు. ఇలాంటి కాటమరాయుడి జీవితంలోకి అవంతిక (శ్రుతిహాసన్) ప్రవేశిస్తుంది. అవంతిక ఎవరు? ఆమె వల్ల రాయుడి జీవితంలోకి ఎలాంటి అనూహ్యమైన మార్పులొచ్చాయి? తమ్ముళ్ల ప్రేమకథలు ఎలా మొదలయ్యాయి? అనేదే ‘కాటమరాయుడు’ కథ.
Review:
తమిళంలో ఘనవిజయం సాధించిన ‘వీరమ్’కి రీమేక్ ఇది. దర్శకుడు వీరమ్ కథని దాదాపు ఫాలో అయిపోయాడు. కొత్త మలుపులు, కొత్త క్యారెక్టరైజేషన్ల జోలికి వెళ్లలేదు. కాకపోతే పవన్‌కల్యాణ్ పాత్రపై ప్రత్యేక దృష్టి నిలిపాడు. ఆయన్ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. సినిమా ప్రారంభం.. నడవడిక పవన్ కల్యాణ్‌ను పరిచయం చేసిన పద్ధతి ఇవన్నీ అభిమానులను అలరిస్తాయి. ముఖ్యంగా పవన్, శ్రుతిహాసన్‌ల మధ్య సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పవన్ గత చిత్రాల కన్నా ఎక్కువ రొమాంటిక్‌గా కనిపిస్తాడు. పవన్ నుంచి ఆశించే వినోదం ప్రతి సన్నివేశంలో ఉండేలా జాగ్రత్త పడుతూ కథని నడిపించాడు. తమ్ముళ్లతో అన్నదమ్ముల సన్నివేశాలు, అన్నయ్యను ప్రేమలోకి దింపేందుకు వారు చేసే యత్నాలు.. మధ్య మధ్యలో యాక్షన్ ఎపిసోడ్స్.. వీటితో ప్రథమార్ధం సాఫీగా సాగిపోతుంది. హీరోయిజం, ఎమోషన్స్ సమపాళ్లలో మేళవించిన కథ ఇది. దాంతో ద్వితీయార్థం కాస్త నిదానంగా సాగుతుంది. కథని ముందుకు నడిపించే శక్తి సన్నివేశాలకు లేకపోవడంతో ఆ బాధ్యతను కూడా పవన్‌కల్యాణే తన భుజస్కందాలపై మోశాడు. ద్వితీయార్థం చివర్లో దర్శకుడు మళ్లీ ట్రాక్ ఎక్కడంతో ఎమోషన్స్ క్యారీ అయ్యాయి. అన్నదమ్ముల మధ్య బలమైన భావోద్వేగ సన్నివేశాలు చూపించగలగడంతో పతాక సన్నివేశాలకు న్యాయం జరిగింది.
పవన్‌కల్యాణ్‌లోని చలాకీదనం ఈ సినిమాలోనే కనిపించింది. కాకపోతే పాటల్లో డ్యాన్స్‌ల విషయంలో పవన్ మరింత దృష్టి పెడితే బాగుండేది. శ్రుతిహాసన్ అందంగా కనిపించింది. తమ్ముళ్లు నలుగురు ఉన్నా… అజయ్, శివబాలాజీల పాత్రలకు మాత్రమే ప్రాధాన్యం కన్పించింది. రావురమేష్ పాత్ర ఆకట్టుకుంది. రాయలసీమ మాండలికంలో సాగే సంభాషణలు అలరిస్తాయి. తరుణ్ అరోరా పాత్ర గంభీరంగా సాగినప్పటికీ పూర్తిస్థాయిలో తీర్చిదిద్దలేదు. అలీ, నాజర్, పృథ్వీ వీళ్లంతా ఓకే అనిపిస్తారు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో వినిపించే నేపథ్య సంగీతం ప్రత్యేకంగా అన్పిస్తుంది. ప్రసాద్ మూరెళ్ల తన కెమెరాతో సినిమాకు వన్నె తెచ్చాడు. ఆయన ఎంచుకున్న కలర్ కాంబినేషన్స్, పల్లెటూరి అందాలను చూపించిన తీరు అలరిస్తుంది. వీరమ్ కథకు పవన్ కల్యాణ్ ఇమేజ్ను జోడించి అభిమానులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యాడు.
Plus Points:
- పవన్‌కల్యాణ్
- పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్, లుక్
- ఆలీ కామెడీ
- ఫైట్స్
- స్క్రీన్ ప్లే
- పవన్ ఎంట్రీ ఫైట్
- లవ్‌ట్రాక్
- అన్నదమ్ముల అనుబంధం
Minus Points:
- స్లోగా సాగిన ద్వితీయార్థం
- రొటీన్ లవ్ స్టోరీ
- పాటలు
- సెకండ్ హాఫ్ లో కథ మొత్తం శృతి హస్సన్ చుట్టూ తిరగడం
Final Verdict:
పవన్ అభిమానులకు కాటమరాయుడు పసందైన విందు. సర్దార్ గబ్బర్ సింగ్‌తో నిరాశపడిన అభిమానులను పవన్‌కళ్యాణ్ ఈ సినిమా ద్వారా ఆ లోటు తీర్చే ప్రయత్నం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పవన్‌కల్యాణ్ కోసం.. ఆయన అభిమానుల కోసం తీసిన సినిమా. పవన్ తన అభిమానులను అలరించేందుకు శాయశక్తులా కృషి చేశాడు. పవన్ బలం వినోదం పంచడం. అది ఏ సన్నివేశంలోనూ లోటుకాకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ సినిమా వన్‌మాన్‌షోగా నిలిచిపోయింది.
AP2TG Rating: 3.5/5
Trailer: