ఉద్యోగ విరమణ… ప్రభుత్వ ఉద్యోగులు అయితే నిర్దిష్టమైన రిటైర్మెంట్ వయస్సులో ఉద్యోగ విరమణ చేస్తారు. లేదంటే ముందుగా కూడా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ప్రైవేటు ఉద్యోగులు అయితే ఎప్పుడైనా రాజీనామా చేయవచ్చు. కొత్త ఉద్యోగంలో చేరుతున్నా, పాత ఉద్యోగాన్ని బలవంతంగా మానేసినా, కంపెనీ తీసేసినా, వేరే ఇతర కారణాల వల్లనో లేదంటే మృతి చెందడం వల్లనో ఉద్యోగి విరమణ చెందినట్టు కంపెనీ నిర్దారిస్తుంది. అయితే అలా జాబ్ మానేసే సమయంలో ఏ కంపెనీ అయినా ఉద్యోగికి కొన్ని ప్రయోజనాలు కల్పిస్తాయి. వాటి గురించి కచ్చితంగా ప్రతి ఉద్యోగి తెలుసుకోవాలి. ఎందుకంటే వాటిని చాలా వరకు కంపెనీలు ఇవ్వడం లేదు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటంటే…
1. గ్రాట్యుటీ…
పదవీ విరమణ చెందుతున్న ఉద్యోగికి ఏ కంపెనీ అయినా ఒకే విడతలో ఇచ్చే నగదు ప్రయోజనమే గ్రాట్యుటీ. పదవీ విరమణ చెందినప్పటి వరకు ఉద్యోగి పని చేసిన సేవలకు తగిన గుర్తింపునిస్తూ ఏ కంపెనీ అయినా గ్రాట్యుటీ చెల్లిస్తుంది. ఉద్యోగి తనకు తానే రాజీనామా చేసినా, లేదంటే పదవీ విరమణ చెందినా ఈ ప్రయోజనాన్ని కంపెనీలు కచ్చితంగా కల్పించాలి.
- గ్రాట్యుటీ నిబంధనలు…
ఏ కంపెనీలో అయినా 10 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉంటే ఆ కంపెనీ కచ్చితంగా గ్రాట్యుటీని అందివ్వాలి. అలా అని నిబంధనలు చెబుతున్నాయి. ఒక వేళ 10 లోపు ఉంటే చెల్లించాల్సిన అవసరం లేదు. గడిచిపోయిన సంవత్సర కాలంలో ఏ కంపెనీలో అయినా 10 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉంటే అప్పుడు పదవీ విరమణ అవుతున్న ఉద్యోగికి కంపెనీ గ్రాట్యుటీ చెల్లించాలి. - స్వచ్ఛంద సంస్థలు, హాస్పిటల్స్, విద్యాసంస్థలు ఇలాంటి వన్నీ గ్రాట్యుటీ పరిధిలోకి వస్తాయి. ప్రతి ఉద్యోగి ఈ ప్రయోజనాన్ని అందుకోవాలి. అయితే అలా అందుకోవాలంటే అంతరాయం లేకుండా 5 ఏళ్ల పాటు ఆ కంపెనీలో పని చేసి ఉండాలి.
- ఉద్యోగి కంపెనీకి నష్టం చేసి ఉంటే కంపెనీ గ్రాట్యుటీని చెల్లించాల్సిన పనిలేదు. అయితే నష్టపరిహారం మేర తీసుకుని కంపెనీలు మిగతా మొత్తం ఉద్యోగికి చెల్లించవచ్చు.
- ఉద్యోగి ప్రవర్తన సరిగ్గా లేక, అతని చర్యల వల్ల ఉద్యోగం కోల్పోతే అప్పుడు కూడా గ్రాట్యుటీ చెల్లించాల్సిన పనిలేదు.
- సాధారణంగా కంపెనీలు ఏడాదికి 240 రోజులను మాత్రమే పనిదినాలుగా గుర్తిస్తాయి. అంటే ఏ ఉద్యోగి అయినా 4 ఏళ్ల 8 నెలల పాటు పనిచేస్తే చాలు, గ్రాట్యుటీ పొందవచ్చు. ఇక 5 ఏళ్ల 7 నెలల పనిచేస్తే దాన్ని 6 ఏళ్లుగా రౌండప్ చేస్తారు. అదే 5 ఏళ్ల 5 నెలలు మాత్రమే పనిచేస్తే 5 సంవత్సరాలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. అంతే మొత్తానికి గ్రాట్యుటీ చెల్లిస్తారు.
- సెలవు, అనారోగ్యం, ప్రమాదం, సమ్మె, లేఆఫ్ లేదా లాకవుట్ వంటివి పనిదినాల కింద కౌంట్ కావు.
- మరో ఉద్యోగంలో చేరేందుకు ఉద్యోగులు పదవీ విరమణ చేసినా వారు గ్రాట్యుటీకి అర్హులే అని నిబంధనలు చెబుతున్నాయి. అయితే 5 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా ఉద్యోగంలోనే ఉంటే గ్రాట్యుటీ ఇవ్వరు. గ్రాట్యుటీ అనేది పదవీ విరమణ చెందితేనే ఇస్తారు.
- ప్రమాదవశాత్తూ ఉద్యోగి మరణించినా లేదంటే 5 ఏళ్ల సర్వీసు కాలం పూర్తి కాకముందే ప్రమాదం బారిన పడి అంగ వైకల్యానికి లోనైనా గ్రాట్యుటీని చెల్లించాలి. దీన్ని ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో నామినీలకు లేదా చట్టబద్దమైన వారసులకు అందిస్తారు.
- గ్రాట్యుటీపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. గరిష్టంగా రూ.10 లక్షల వరకు అందుకునే గ్రాట్యుటీపై ఎలాంటి పన్ను కట్టాల్సిన పనిలేదు. అయితే అంత కన్నా ఎక్కువ ఉంటే నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాలి.
- సాధారణంగా ఏ ఉద్యోగికి అయినా ఏడాది పనికాలానికి గాను 15 రోజుల జీతాన్ని గ్రాట్యుటీగా చెల్లిస్తారు. మూల వేతనం (బేసిక్ పే), కరువు భత్యం రెండూ కలిపి గ్రాట్యుటీ చెల్లించాల్స ఉంటుంది. ఉద్యోగి చివరిగా అందుకున్న బేసిక్ పేను బట్టి గ్రాట్యుటీ చెల్లింపులు ఉంటాయి. నెలలో నాలుగు సెలవులను తీసేస్తే వచ్చేవి 26 రోజులు. వీటికి గాను తీసుకునే బేసిక్ పేలో 57.69 శాతాన్ని ఏడాదికి గ్రాట్యుటీగా ఇస్తారు. అయితే ఉద్యోగి దినసరి వేతనంపై పనిచేస్తున్నట్టయితే మూడు నెలల సగటు వేతనాన్ని ఒక రోజు వేతనంగా పరిగణించి గ్రాట్యుటీ చెల్లిస్తారు.
- ఇలా గ్రాట్యుటీ ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందనే చాలా కంపెనీలు బేసిక్ పేను తక్కువగా ఇంటి అద్దె అలవెన్స్, ఇతర అలవెన్స్లను ఎక్కువగా చూపుతుంటాయి.
- వేతనం x పని చేసిన సంవత్సరాలు x 15/26 వేసి చూడండి. ఇలా లెక్కించగా వచ్చే మొత్తమే ఎవరికైనా గ్రాట్యుటీగా లభిస్తుంది.
- కంపెనీ నష్టాల్లో ఉన్నా సరే గ్రాట్యుటీని తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి.
- కంపెనీ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగి కంపెనీని వీడడానికి నెల నుంచి మూడు నెలల ముందే నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగి నోటీసు ఇచ్చి నిర్ణీత కాలం పాటు పనిచేయకపోయినా సరే గ్రాట్యుటీ నిబంధనల మేరకు ఉద్యోగి సర్వీసు కాలం ఉంటే ఆ ప్రయోజనాన్ని అందించాల్సి ఉంటుంది.
2. ఎన్ క్యాష్ మెంట్ లీవ్ (ఈఎల్)…
ఏ ఉద్యోగికి అయినా ఏడాది కాలంపాటు నిరంతరంగా పనిచేస్తే ఆ కంపెనీ ఈఎల్స్ను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అలా లభించే ఈఎల్స్ను ఉద్యోగులు అదే ఏడాది వాడుకోవాలి. లేదంటే మిగిలిపోయిన ఈఎల్స్కు గాను అంత మొత్తం డబ్బును కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ చాలా వరకు కంపెనీలు అలా చేయడం లేదు. మిగిలిపోయిన ఈఎల్స్కు డబ్బులు ఇవ్వకుండా వాటిని తరువాత ఏడాదికి బదిలీ చేస్తున్నాయి. దీంతో వాటిని ఎప్పుడైనా ఉద్యోగులు వాడుకునేందుకు వీలుంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఈఎల్స్ మిగిలిపోతే వాటికి సమానమయ్యే డబ్బును పొందవచ్చు.
3. ఫామ్ 16…
ఉద్యోగులు తాము పనిచేస్తున్న కంపెనీల నుంచి ఏటా ఫామ్ 16 తీసుకోవాలి. దీన్నే శాలరీ సర్టిఫికెట్ అంటారు. ప్రతి ఏటా ఇలాంటి సర్టిఫికెట్లను తీసుకుని జాగ్రత్త చేసుకోవాలి. వీటి వల్ల భవిష్యత్తులో లోన్లు వంటివి తేలిగ్గా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అనుకోకుండా జాబ్ మానేసినా కొత్త కంపెనీలో చేరితే ఫామ్ 16ను చూపించి అంతే మొత్తంలో శాలరీని డిమాండ్ చేయవచ్చు.
4. హెల్త్ ఇన్సూరెన్స్…
చాలా వరకు కంపెనీలు తమ ఉద్యోగులకు గ్రూప్ మెడికల్, హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయాలను అందిస్తుంటాయి. వాటికి గాను నెలకు లేదా సంవత్సరానికి కొంత మొత్తం సొమ్మును వారి జీతాల నుంచి కట్ చేస్తుంటాయి. అయితే జాబ్ మానేశాక ఇలాంటి సదుపాయాలను పొందాలంటే సంబంధిత మెడికల్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీ ప్రతినిధులతో మాట్లాడవచ్చు. దీంతో ఆ గ్రూప్ పాలసీ కాస్తా వ్యక్తిగత పాలసీగా మారేందుకు అవకాశం ఉంటుంది.
5. సేవింగ్స్ అకౌంట్…
ఉద్యోగులు తాము పనిచేస్తున్నంత కాలం జీతం అకౌంట్లో పడుతున్నంత వరకు బ్యాంక్ అకౌంట్లలో నగదును సరిగ్గా మెయింటెయిన్ చేయాల్సిన పనిలేదు. యావరేజ్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నా చాలు. కానీ కంపెనీ నుంచి మానేస్తే ఆ అకౌంట్ కాస్తా నార్మల్ సేవింగ్స్ అకౌంట్ అవుతుంది. అలాంటప్పుడు అందులో కనీస నగదును ఎప్పటికీ ఉంచాల్సి వస్తుంది. దీన్ని తెలుసుకుంటే అనవసర ఫైన్ నుంచి తప్పించుకోవచ్చు.