యాభై నాలుగేళ్లకే లోకాన్ని విడిచెల్లిన శ్రీదేవి సుమారు యాభై ఏళ్లపాటు సినీలోకాన్ని అలరించింది..సూపర్ స్టార్ గా వెలుగు వెలిగింది.. అతిలోక సుందరి హఠాత్ మరణాన్ని జీర్ణించుకోలేనివారెందరో ..అలాంటిది కన్న కూతుర్లు,కట్టుకున్న భర్త పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే అసాధ్యం..జాన్వి,ఖుషిలను చూసుకోవడం ఇక నా బాద్యత అని చెప్పుకొచ్చారు బోణి.. మార్చ్ 3 న శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి పుట్టినరోజు.
శ్రీదేవికి తన కూతురంటే పంచప్రాణాలు. చిన్న కూతురు ఖుషి తండ్రితో ఎక్కువ సన్నిహితంగా ఉండేది అంట. కూతురి 21 వ జన్మదిన వేడుకలకు శ్రీదేవి ఎన్నో ప్లాన్స్ వేసింది అంట. కానీ పది రోజుల ముందే ఆమె మరణించడం వారి కుటుంబంలో విషాదం నింపింది. శ్రీదేవి బతికి ఉండుంటే ఎప్పటికి గుర్తుండిపోయే రోజు లాగా తన పుట్టినరోజు జరిగి ఉండేది అని జాన్వీ కంటతడి పెట్టుకుంది. కపూర్ ఫామిలీ అంతా కలిసి డిన్నర్ లో స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేసారంట.
తల్లి మరణించిందని కూతురిని ఎవరు పరామర్శించవద్దు అని. సంతోషంగా తన పుట్టినరోజు జరుపుకోవాలి అని అనుకున్నారంట. అందుకే తల్లి మరణించింది అనే దుఃఖాన్ని దిగమింగి అనాధాశ్రమంకి వెళ్లి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది జాన్వీ. జాన్వీ ప్రతి పుట్టినరోజుకి శ్రీదేవి అలాగే చేసేది అంట. అనాధపిల్లల మధ్య జరుపుకొని వారి జీవితంలో కొద్ది క్షణాలు ఆనందాన్ని నింపేవారంట.
శ్రీదేవికి తన కూతురుని వెండితెరపై చూడాలనే కోరిక అంట. స్వర్గం నుండి కూతురుని ఆశీర్వదించి తల్లి లేని బాధని దిగమింగే ధైర్యాన్ని శ్రీదేవి కూతురికి ప్రసాదిస్తుంది అని ఆశిద్దాం. 21వ జన్మదినోత్సవ సందర్భంగా తన తల్లిని, ఆమెతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జాన్వీ ఒక లేఖను రాసింది.
“ఇప్పుడు నా హృదయానికి తగిలిన గాయంతో బతకడం ఎలాగో నేర్చుకోవాలి. నా చుట్టూ ఇంత శూన్యత ఆవరించి ఉన్నా.. ఇంకా నీ ప్రేమను అనుభూతి చెందుతున్నాను. బాధ నుంచి, విచారం నుంచి నన్ను నువ్వు రక్షిస్తున్నట్టు ఫీలవుతున్నాను. కళ్లు మూసుకుంటే నాకన్నీ మంచి విషయాలే గుర్తుకొస్తున్నాయి. దానికి కారణం నువ్వే అని తెలుసు. సాధ్యమైనంత కాలం మా జీవితాల్లో నువ్వు ఉండడం మేం చేసుకున్న అదృష్టం.నువ్వు చాలా మంచిదానివి. చాలా స్వచ్ఛమైనదానివి. అందుకే నిన్ను దేవుడు త్వరగా తీసుకెళ్లిపోయాడు. నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటానని నా స్నేహితులు అంటూ ఉంటారు. దానికి కారణం నువ్వేనని నాకిప్పుడు అర్థమవుతోంది. నన్ను ఎవరు ఏమన్నా పట్టించుకోలేదు. ఏదీ పెద్ద సమస్యగా అనిపించలేదు. ఏ రోజూ నిస్తేజంగా లేదు. ఎందుకంటే అప్పుడు నువ్వు నాతో ఉన్నావు. నేను ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడలేదు. ఎందుకంటే నాకు కావాల్సిన ఒకేఒక వ్యక్తివి నువ్వు…
నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. నా ఆత్మలో భాగం. మా కోసం నీ జీవితాన్ని అర్పించావు. ఇప్పుడు నీ కోసం నేనూ ఆ పని చేస్తా. నువ్వు గర్వపడేలా చేస్తా. ప్రతీ ఉదయం అదే ప్రతిజ్ఞతో నిద్ర లేస్తా. నువ్వు నాలో, ఖుషీలో, నాన్నలో నిండి ఉన్నావు. మాపై నీ ప్రభావం చాలా బలమైనది. మేం బతకడానికి అది చాలు.. కానీ, నీవు లేని లోటుని పూరించడానికి మాత్రం చాలదు.. ఐ లవ్యూ` అంటూ రాసిన లేఖను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది జాన్వి.. జాన్వి పోస్టు చేసిన లెటర్ నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నది.