“జతగా నువ్వుంటే.!” – A Love Treat By Sainath Gopi

ప్రతి కథ ఒక దగ్గర మొదలవుతుంది. దశరధుడు పిల్లలు పుట్టడం కోసం చేసే యాగంతో “రామాయణం” మొదలవుతే… కురు రాజ్యానికి ఎల్లప్పుడూ సంరక్షకుడిగా ఉంటానని “భీష్ముడు” చేసే శపథంతో “మహాభారతం” మొదలవుతుంది. కానీ నా కథ మాత్రం..“లైఫ్ కి లవ్” మధ్య జరిగే రన్నింగ్ రేస్ తో మొదలవుతుంది. నాకు ఉన్నవి రెండు దారులు. గెలుపు లేకుంటే ఓటమి. కెరీర్ లో గెలుస్తే, ప్రేమలో ఓడిపోతా.. ప్రేమలో గెలవాలంటే కెరీర్ లో ఓడిపోతా. లైఫ్ ముఖ్యమా.? లేకుంటే లవ్ ముఖ్యమా.? అనే ప్రశ్న నాకు ఎదురయ్యింది. లైఫ్ అనే పరీక్ష గెలవాలంటే లవ్ వేసే శిక్ష భరించాలి. ఆ టైం లో నేను నమ్మిన సిద్ధాంతాలు రెండే రెండు. ఒకటి “మన ఆశయం గొప్పది అయితే, అదే మనల్ని ముందుకి నడిపిస్తుంది”. రెండు “మన ప్రేమలో నిజం ఉంటే, అదే మన ప్రేమను గెలిపిస్తుంది”. టైటిల్స్ పడకుండా, ఇంటర్వెల్ సీన్ చెప్తున్నట్టు అనిపిస్తుందా ఈ లైన్స్ చదువుతుంటే. అసలు కథకు ముందు ఇది కొంచెం కొసరు కథ అనుకోండి. ఎంసెట్ అయిపోయి బిటెక్ లో జాయిన్ అవ్వడంతో నా అసలు లవ్ స్టోరీ మొదలైంది. అప్పటి వరకు బ్లాక్ అండ్ వైట్ లో ఉండే నేను రోజు రాసుకునే నా డైరీ…ఒక అమ్మాయి పరిచయంతో అక్షరాలు రంగులను పరిచయం చేసుకొని డైలీ రాసుకునే నా డైరీ లో కొన్ని కలర్స్ నింపాయి.

ఎంసెట్ లో మనకి వచ్చిన రాంక్ కి…రిజర్వేషన్ అనే ఒక సిస్టం ఉన్న దానికి …ఒక నార్మల్ కాలేజీలో సీట్ వచ్చింది. కంప్యూటర్స్ గ్రూప్ అయితే అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అనే అమాయకత్వంతో సీఎస్సిలో జాయిన్ అయ్యా. కానీ నాకు లైఫ్ పార్ట్నర్ అవ్వబోయే అమ్మాయి అదే కాలేజీ లో వేరే గ్రూప్ లో ఉందని అప్పుడు తెలుసుకోలేకపోయా. క్లాస్ మేట్స్ తో పరిచయం అవ్వడమే ఆలస్యం… మేమూ ఉన్నాము అంటూ పరిచయం అయ్యాయి ఇంటర్నల్ ఎగ్జామ్స్. ఎక్స్టర్నల్ అంటేనే ఎదో పైపైన చదివే టైపు మనం. అలాంటిది ఇంటర్నల్ అంటే ఇంట్రెస్ట్ తో ఎలా చదువుతాం.? పైగా మొదటి ఎగ్జామ్ M1 . స్టూడెంట్స్ కి సప్లి పరిచయం చేయడంలో కూడా నెంబర్ వన్. ఎక్జామ్ కి పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి…కారిడార్ లో వెళ్లే వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉన్నా.! ఇంతలో గౌతమ్ మీనన్ సినిమాలో హీరోయిన్ లాగా, సరస్వతి దేవికి చెల్లెలు లాగా టెన్షన్ పడుతూ పరీక్ష హాల్ లోకి ఓ అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. నా కన్నుల గ్యాలరీలో కాప్చర్ అవ్వడం, ఊహల మెమరీ లో స్టోర్ అవ్వడమే కాదు హార్ట్ లోకి కూడా అదే టైం కి ఎంటర్ అయిపోయింది ఆ అమ్మాయి.

ఎక్జామ్ ఏదైనా కనీసం అరగంట ముందైనా హాల్ లో నుండి వెళ్లిపోవడం నాకు అలవాటు. కానీ మొట్టమొదటిసారి ఆ అమ్మాయికోసం ఆ అలవాటు మార్చుకున్నా. పేపర్ పై పెన్ పెట్టలేదు, కనురెప్ప ఆర్పకుండా ఆ అమ్మాయిని చూడటం ఆపలేదు. ఎక్జామ్ అయిపోయిన తర్వాత నేనెప్పుడూ చూడని ఓ ప్లేస్ కి ఆ అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్లాల్సి వచ్చింది. కాలేజీ లో లైబ్రరీ అని ఒక ప్లేస్ ఉందని నాకు తెలిసింది కూడా అప్పుడే. మొదటి చూపులోనే అమ్మాయి నాకు నచ్చేసింది. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ అంటారు. అందుకే అమ్మాయి దృష్టిలో పడదాం అని నేను కూడా లైబ్రరీకి వెళ్లాను. ఎలా మాట్లాడాలో అర్ధం అవ్వక, మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఎక్జామ్స్ కాలం గడిపా. ఇంతలో కల్చరల్ ఫెస్ట్ అని కాలేజీ లో ప్రకటించారు.

ట్రెడిషనల్ డే అంటే…అబ్బాయిలు ట్రెడిషనల్ గా ఉండటం కంటే, ట్రెడిషనల్ గా వచ్చిన అమ్మాయిలను చూడటంపై ఎక్కువ దృష్టి పెడతారు అనడంలో అతిశయోక్తి లేదు అనుకుంట. నేను ఇష్టపడే అమ్మాయి చీర కడుతుందా లేదా అనే కన్ఫ్యూషన్ లో బస్టాప్ వైపు నడుస్తూ ఉన్నా…ఇంతలో ఎదురుగా నీలి రంగు చీరలోని చందమామ లాగా నేను ఇష్టపడే అమ్మాయి కనిపించి కంక్లూషన్ ఇచ్చింది. అందానికి నిర్వచనంలా ఉంది ఆ క్షణంలో తను. కనీసం పేరు కూడా తెలియకుండా ప్రేమించేస్తున్నానే అనుకుంటూ ఉన్నా. ఇంతలో “ఆ అమ్మాయిని పేరేంటి అనే ప్రశ్న అడిగినట్టు,” నా దగ్గరకు వచ్చి “నా పేరు విద్య. మీరు చదువుతున్న కాలేజీ లోనే చదువుతున్నాను. రీసెంట్ గా మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో హాస్టల్ లో ఉంటున్న నేను, ఇక్కడ దగ్గర్లో ఒక ఇంటికి షిఫ్ట్ అయ్యాం. కాలేజీ బస్సు ఏ టైం కి వస్తుంది?” అని అడిగింది…ఇంతలో తన ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వకముందే ఎదురుగా బస్సు వచ్చి క్లారిటీ ఇచ్చింది. బస్సులో తననే చూస్తూ ఉన్నా. పెద్ద పెద్ద కళ్లకు ఇంకొంచెం అందాన్ని యాడ్ చేసినట్టు ఉండే తన కళ్లజోడు, ఆ అందాన్ని దిష్టి చుక్కలాగా లేత తామర రేకులలాంటి పెదాల పక్కనే ఓ పుట్టుమచ్చ. ఆ సమయంలో గాలికి వయ్యారంగా ఊగే తన చెవిపోగు చప్పుడు కూడా నాకు వినిపించేంత నిశ్శబ్ద వాతావరణం నా చుట్టూ ఉన్నట్టుగా నాకు అనిపించింది. ప్రేమలో పడితే అలాగే ఉంటుంది ఏమో. ఇంకా కాలేజీ రాలేదేంటి అని ప్రతి రోజూ అనుకునే నేను. మొట్టమొదటి సారిగా అప్పుడే కాలేజీ వచ్చేసింది ఏంటి అనుకున్నాను. అక్కడినుండి నా లవ్ స్టోరీ ఏడు దశల్లో కొనసాగింది.

ప్రేమలో మొదటి స్టేజి “ఆకర్షణ”. ఆకర్షణకి ఒక లాజిక్ ఉండదు. ఇది యుగాల నుండి ఫాలో అవుతున్న ట్రెండ్. చూడకుండా, చెప్పిన మాటలు వినే కృష్ణుడిని ప్రేమించడం మొదలెట్టింది రుక్మిణి. మొదటి చూపులోనే విద్య నాకు నచ్చేసింది. ఎప్పుడు నాకు కలగని స్వార్థం లేని ఇష్టమనే నా ఫీలింగ్ ని నేను “ప్రేమ” అనే నమ్మాను. ఇక ప్రేమలోని రెండో దశకు నా లవ్ స్టోరీ చేరుకుంది. అదే ఊహల్లో తేలిపోవడం. రెండు నిముషాలు తనని చూస్తే…ఊహించుకోవడానికి 20 నిముషాలు అయిపోతుంది. ఆ ఊహల్లో ఇంత ఆనందం ఉందా అనేది అప్పుడే అర్ధమయ్యింది. సినిమాల్లోని లవ్ స్టోరీస్ కి మనల్ని రిలేట్ చేసుకోవడం కూడా అప్పుడే. మనలో ఒక కాళిదాసు మేలుకోవడం, అక్షరాలతో కవితలను అల్లుకోవడం కూడా అదే టైం లో జరుగుతుంది. అలా తనని ఊహించుకుంటూ కొన్ని కవితలు రాసా. అప్పుడు నేను అనుకోలేదు ఆ కవితలే నా ప్రేమకు పునాదులు అవుతాయని.

తనని వర్ణించడంలో అసలు కథ చెప్పడం మరిచిపోయాను అనుకుంట. కల్చరల్ ఈవెంట్స్, డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే…వెళ్లి ఆడిటోరియం లో కూర్చొని ఫ్రెండ్స్ తో టైం పాస్ చేస్తున్నా. “ఏకదంతాయ వక్రతుండాయ” అనే సాంగ్ తో ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. స్టేజి మీద చూడగానే ఆ పాట పాడుతున్న విద్యను చూసి ఒక్క క్షణం ఫ్రీజ్ అయిపోయా. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత పరిచయాన్ని బలపరుచుకోవడం అనే టాస్క్ చేపట్టా. ప్రేమలో చాలా ముఖ్యమైన దశ అదే. కబడ్డీలో “డూ ఆర్ డై రైడ్” టైపు. నెక్స్ట్ స్టేజికి వెళ్లాలా? వద్దా అని డిసైడ్ చేసే స్టేజి అది. ఇక్కడ కొంచెం అజాగ్రత్తగా వ్యవహరిస్తే పునాదిలోనే ప్రేమను సమాధి చేయాల్సి వస్తుంది. మనకి ఉన్న టాలెంట్ లు కొంచెం చూపించాలి. ముఖ్యంగా కవితలు. మనకి రాకపోతే సినిమాల్లోవి కాపీ అయినా కొట్టాలి. లేకుంటే సింపుల్ గా అయినా ఉండాలి. నేను ఆ చివరిది ఫాలో అయ్యా. నీ సింగింగ్ సూపర్ అంటూ పొగడ్తల వర్షం కురిపించి పరిచయాన్ని స్నేహంగా మార్చుకున్నా.

ధైర్యం ఉన్నవాడికి ప్రేమని గెలిపించడానికి ఓ దారి కనిపిస్తుంది. లేనివాడికి అసలు ప్రేమలో లాజిక్ లేదు అనిపిస్తుంది. నాకు మాత్రం ప్రేమను పరోక్షంగా వ్యక్త పరిచే సమయం తొందరలోనే ఉందని అప్పుడే నాకు అర్ధం అయ్యింది. నెక్స్ట్ ఇయర్ ఫెస్ట్ కి సింగింగ్ అండ్ రైటింగ్ కాంపిటీషన్ పెట్టాలి అనుకుంటున్నారని అప్పుడే తెలిసింది. ఒక సంవత్సరం టైం గ్యాప్ లో ఎన్నో వింతలు జరిగాయి. ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ప్రేమ బోర్డర్ దాకా వెళ్ళింది. కానీ ప్రేమిస్తున్నా అని తను మాత్రం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పగలంతా కాలేజీలో తనతో మాటలు, రాత్రయితే ఫోన్లో మెసేజిలు. 11:59 కి గుడ్ మార్నింగ్ చెప్పడంతో మొదలవుతే..12:01 కి గుడ్ నైట్ తో చాట్ ముగుస్తుంది. తనకోసం రాసే కవితల్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ప్రతి సారి ఫస్ట్ లైక్ తనది ఉంటే బాగుండు అనిపిస్తుంది. వాట్సాప్ చాట్ లిస్ట్ లో తన ఒక్క పేరే ఉంది, కానీ చాట్ మాత్రం మౌంట్ ఎవరెస్ట్ కంటే పెద్దగా ఉంది అనిపిస్తుంది.

ఇంతలో ఏడాది కాలం గడిచింది. నేను ఎదురు చూసిన ఫెస్ట్ వచ్చింది. అనుకోకుండా ఆ ఫెస్ట్ కి గెస్ట్ గా ఓ సంగీత దర్శకుడు వచ్చారు. నా కవితలకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సింగింగ్ లో అందరు గెస్ చేసినట్టుగా విద్యకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కొన్ని రోజులకే ఊహించని విధంగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ నుండి మాకు కాల్ వచ్చింది. నేను రాసిన పాటకు ట్యూన్ కట్టి, విద్యతో పాడించి కొత్తగా రిలీజ్ అవ్వనున్న ఓ సినిమాలో పెడతాను అని పిలిపించాడు. వెళ్లే దారిలో ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాం. నా లవ్ నెక్స్ట్ స్టేజికి చేరింది కూడా అప్పుడే. మాట్లాడడానికి చిరాకు పడకుండా ఇష్టపడి మాట్లాడుతుంది అంటే…ఇష్టాన్ని అభిప్రాయంగా మార్చుకునే స్టేజి వచ్చిందని అర్థమైంది. నేను రాసిన పాటలోని

కనుపాపలు రెండు ఉన్నాయి…రెండు పక్కపక్కనే ఉన్నా ఒకదాన్నొకటి చూసుకో లేకుండున్నది…
నా ఎదురుగా వస్తావా? నా కనులకు అద్దం లాగా…!
పాదాలు రెండు ఉన్నాయి …రెండు పక్కపక్కనే ఉంటే పయనం మాత్రం సాగనంది …నా తోడుగా ఉంటావా? నా అడుగులకు ఉండే నీడ లాగా!
విడిగా విడిగా మనం ఉన్నాం అంటే అర్ధం ఒంటరిగా నేను ఉన్నా అని కాదు …ఇద్దరిలో ప్రాణం ఒక్కటే అని ..!మాటలాడుకోకుండా మౌనంగా ఉన్నాం అంటే అర్ధం ప్రేమ భాష రాదు అని కాదు…మాటలతో మనకి పని లేదు అని…!”

ఈ లైన్స్ నాకు బాగా నచ్చింది అని విద్య చెప్పింది. నిన్ను ఊహించుకొనే అది రాసాను అని ఆ క్షణం చెప్పాలనిపించింది. కానీ చెప్పే సమయం తొందరలోనే ఉందనే ఆశతో చెప్పకుండా ఉండిపోయాను.

ఇంతలో కాలేజీలో చివరి సంవత్సరం మొదలైంది. ప్లేస్ మెంట్స్ బిజీ కూడా మొదలైంది. ముందుగా ఊహించనట్టుగానే విద్యకు మంచి జాబ్ వచ్చింది. కానీ తను మాత్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. పై చదువులకు విదేశాలకు వెళ్తాను అనే పిడుగు లాంటి వార్త మోసుకొచ్చింది. వాకిట్లోనో, వంటిట్లోనో ఉండే రోజులనుండి అమ్మాయిలు వాట్సాప్ కి అతుక్కపోవడం మొదలు పెట్టడమే కాదు విదేశాలకు కూడా వెళ్లేంతగా డెవలప్ అయ్యారు అని సంతోషపడాలో లేక నాకొచ్చిన పాస్ మార్కులకు, మా ఇంట్లో ఉన్న ఫైనాన్సియల్ పరిస్థితికి ఫారిన్ కి వెళ్ళలేను అని బాధ పడాలో అర్ధం కాలేదు. దూరమైపోతుందని తెలుసు…నా ప్రేమను దగ్గర చేయాలని కూడా తెలుసు.! అందుకే ఇక ఆలస్యం చేస్తే అమృతం అవ్వకుండా విషమవుతుందని తెలిసి, నా ప్రేమను తనకు చెప్పా.

కాలేజీ ఎక్జామ్స్ లో బోర్డర్ పాస్ అయినట్టే…ప్రేమలో కూడా బోర్డర్ లో పాస్ అయ్యా.! అంటే ఎటూ తేల్చకుండా సముద్రంలోని నావ పరిష్టితి అయ్యింది నా ప్రేమది. అటు ఫెయిల్ అని చెప్పలేను, ఇటు సక్సెస్ అని చెప్పలేను. చాలా మంది అమ్మాయిల లాగా “నిన్ను ఫ్రెండ్ అనుకున్నా” అనే డైలాగ్ కొట్టకుండా, “నాకు నువ్వంటే ఇష్టమే, బాగా చూసుకోగలవు అనే నమ్మకం నాకుంది..కానీ అదే నమ్మకం మా పేరెంట్స్ కి కూడా కలిగించు, అప్పుడే మన పెళ్లి అవుతుంది. మొదటిసారి ఎక్జామ్ హాల్ లోనే నిన్ను కూడా నేను చూసాను. అదే క్షణంలో ప్రేమలో పడిపోయాను. ఫ్రెండ్ గా పరిచయం అయ్యావు, నేను ప్రేమా అంటే…ఉన్న స్నేహం కూడా పోతుందేమో అని భయపడి చెప్పలేదు. ఇక్కడే ఉంటే మా పేరెంట్స్ నాకు పెళ్లి చేసేస్తారు. అందుకే పై చదువులకు అని చెప్పి వెళుతున్నా. ఈ లోపు నీకు కెరీర్ లో సెటిల్ అవ్వడానికి టైం ఉంటుంది. అల్ ది బెస్ట్ రా..ఐ లవ్ యు సో మచ్” అని చెప్పింది. ప్రేమను పెళ్ళిపీటల దాకా నడిపించాల్సిన స్టేజి వచ్చింది. కానీ విద్య పేరెంట్స్ ను ఒప్పించడం అనే ఒక పెద్ద సవాల్.. నా ఎదురుగా నిలబడింది.

ఈ లోపు విద్య ఫారిన్ వెళ్ళింది. మా మధ్య దూరం పెరిగింది..అదే సమయంలో ప్రేమ కూడా పెరిగింది. నాకు మాత్రం ఉద్యోగం వచ్చే అవకాశాలు తగ్గింది. అనుకోకుండా ఓ సినిమాలో ఓ పాట రాయాలని ఓ పెద్ద డైరెక్టర్ నుండి కాల్ వచ్చింది. కానీ “నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే, నేను చెప్పిన ఉద్యోగమే చేయాలి. నేను రికమెండ్ చేశాను…ఇంటర్వ్యూ కి వెళ్లు” అని మరో పరీక్ష పెట్టారు విద్య నాన్న గారు. పరీక్ష రాయకముందే శిక్ష ఎదురుకోవడం తప్పదు అని నాకు అర్థమైపోయింది. గేయ రచయిత అవ్వాలన్నది ఎప్పటినుండో నా ఆశ. కానీ ఇంటర్వ్యూకి వెళ్లకుంటే విద్య నాకు దూరమవుతుంది. డైరెక్టర్ ని కలవాలా.? లేక ఇంటర్వ్యూ కి వెళ్లాలా.? అనే ఆలోచనలో పడ్డా. విద్య నాన్న గారిని వేరే విధంగా అయినా ఒప్పించచ్చు…కానీ ఇప్పుడు అవకాశం వదులుకుంటే మరోసారి పాటలు రాసే అవకాశం రాదేమో అని భయపడి డైరెక్టర్ గారి దగ్గరకి వెళ్లాను. సిట్యుయేషన్ చెప్పడం, నేను రాసిన పాటనే సినిమాలో పెట్టుకోవడంతో నా కష్టమే నన్ను ముందుకి నడిపిస్తుంది అని అర్థమైంది. కానీ విద్య నాన్న గారికి అది నచ్చక…వెంటనే విద్యను ఇండియాకి పిలిపించి…వేరే పెళ్లి సంభందం కాయం చేసారు.

అదే సమయంలో నేను రాసిన పాట సక్సెస్ అవ్వడంతో నాతో ఇంటర్వ్యూ చేసింది ఓ ప్రముఖ టీవీ ఛానల్. అది చూసిన విద్య నాన్న గారు మనసు మార్చుకున్నారు. విద్యను నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. నాకు తెలియకుండానే నాకో గమ్యాన్ని చూపింది విద్య. తనని ఊహించుకునే మొదటగా నేను రాసిన పాట ఈ రోజూ అవకాశాన్ని తెచ్చిపెట్టింది. చివరికి తన ప్రేమను గెలిచాను, తన లవ్ తో లైఫ్ లో కూడా గెలిచాను.

Written By:

Sainath Gopi (click here to follow on Facebook – fb.com/saigopi777)

(7386587386)

Comments

comments

Share this post

scroll to top