ఆ దేశంలో జైళ్లను మూసివేస్తున్నారట… ఎందుకో తెలుసా..? 

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలోనూ ఏటా జనాభా పెరిగిపోతూనే ఉంది. ఈ క్రమంలో నేరస్థులు, నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో వృద్ధి చెందుతోంది. అందుకు తగిన విధంగా సంబంధిత అధికారులు కొత్త కొత్త జైళ్లను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. అయితే ప్రతి దేశంలోనూ సాధారణంగా జరిగేది ఇదే. కానీ ఆ దేశంలో మాత్రం ఇందుకు విభిన్నంగా జరుగుతోంది. అదేమిటంటే అక్కడ ఇప్పుడు కొన్ని జైళ్లను మూసివేస్తున్నారట. అందుకు కారణం ఏమిటో తెలుసా? తెలుసుకుందాం రండి.
నెదర్లాండ్స్‌లో గత 10 ఏళ్లుగా నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందట. ఈ నేపథ్యంలో ప్రతి లక్ష మంది ప్రజల్లో కేవలం 69 మంది మాత్రమే జైళ్లలో ఉంటున్నారట. దీంతో ఖాళీగా ఉన్న జైళ్లను నిర్వహించడం డచ్ పోలీసు అధికారులకు భారంగా మారిందట. ఈ క్రమంలోనే గత 3 ఏళ్ల కింద ఆ ప్రభుత్వం 19 జైళ్లను మూసివేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా 5 జైళ్లను మూసివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
jails
కాగా నేరాల సంఖ్య తక్కువగా ఉండడంతో నెదర్లాండ్స్ ఇప్పుడు అత్యంత సురక్షితమైన దేశాల్లో మొదటి స్థానంలో నిలిచిందట. ఈ అంశంలో అమెరికా కూడా నెదర్లాండ్స్‌కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయిందట. ఇంతకీ నెదర్లాండ్స్‌లో నేరాలు అంతగా తగ్గుముఖం పట్టడానికి కారణమేంటయ్యా అంటే… అక్కడి నేరస్థులకు శిక్షా కాలం కొంత తగ్గించి, వారిని ముందుగానే విడుదల చేసి, స్వయం ఉపాధి కార్యక్రమాలను కల్పిస్తూ వారు నిత్యం చేసే పనులను యాంకిల్ మానిటర్ అనే ఓ ప్రత్యేకమైన పరికరంతో ట్రాక్ చేస్తున్నారట. ఈ క్రమంలో ఆయా నేరస్థులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ వారిలో మార్పు తెచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో పోలీసు అధికారులు ఆశించిన స్థాయిలో ఆ నేరస్తుల్లో మార్పు వస్తోందట. అందుకే గత 10 ఏళ్లుగా నేరాల సంఖ్య కూడా బాగా తగ్గిపోయిందట.
జైళ్లంటే ఖైదీలకు శిక్ష వేయడానికే కాదు, వారిలో మార్పు కూడా తీసుకురావాలి, అనే సత్యాన్ని అక్షరాలా చాటి చెబుతున్న నెదర్లాండ్స్ పోలీస్ అధికారులకు నిజంగా మనం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. వారు చేసిన విధంగానే ప్రతి దేశంలోనూ చేస్తే అప్పుడు ఎక్కడా అసలు నేరాలనేవే జరగవు కాబోలు. దీంతో సాధారణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖంగా జీవించగలుగుతారు.

Comments

comments

Share this post

scroll to top