వాట్సాప్ కు భారీ జ‌రిమానా ప‌డింది. ఎందుకో తెలుసా..?

వాట్సాప్‌… ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక మంది యూజ‌ర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఇది. ఎప్ప‌టిక‌ప్పుడు యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో కొత్త అప్‌డేట్ల‌ను విడుద‌ల చేస్తూనే ఉంది. 2014లో వాట్సాప్ ను ప్ర‌ముఖ సోష‌ల్ సైట్ ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది. ఇక అప్ప‌టి నుంచి వాట్సాప్‌కు మ‌రింత ఆద‌ర‌ణ పెరిగిందనే చెప్ప‌వ‌చ్చు. అయితే ఇటీవ‌లి కాలంలో వాట్సాప్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఓ పెద్ద స‌మ‌స్య‌ను ఎదుర్కొంటుంది. అదేమిటంటే… ఫేస్‌బుక్ త‌న వాట్సాప్ నుంచి యూజర్ల డేటాను తీసుకుంటుంద‌ని ప్ర‌ముఖంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం ప‌ట్ల వాట్సాప్ చాలా ఇబ్బందుల‌నే ఎదుర్కొంటోంది.

తాజాగా ఇట‌లీ ప్ర‌భుత్వం వాట్సాప్‌కు రూ.21కోట్ల ఫైన్ వేసింది. అందుకు పైన చెప్పిన స‌మ‌స్యే కార‌ణం. వాట్సాప్ నుంచి యూజ‌ర్ల‌కు తెలియ‌కుండా ఫేస్‌బుక్ డేటా తీసుకుంటుంద‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కొన్ని సంస్థ‌లు, యూజ‌ర్ల ఫిర్యాదు మేర‌కు ఇట‌లీ ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రిపి ఈ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఇత‌ర యురోపియ‌న్ దేశాలు కూడా ఇదే బాట‌లో న‌డ‌వ‌నున్న‌ట్టు తెలిసింది. అదే నిజ‌మైతే వాట్సాప్‌కు భారీ జ‌రిమానాలు వరుస‌గా ప‌డే అవ‌కాశం ఉంది.

కాగా ఇండియాలో కూడా దీనిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 2016 సెప్టెంబర్ లో వాట్సాప్ కొత్త పాలసీపై ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదులు కూడా దాఖలయ్యాయి. 2016 సెప్టెంబర్ 25కు ముందు సేకరించిన యూజర్ల డేటాను ఫేస్ బుక్ లేదా మరే ఇతర సంబంధిత కంపెనీలతో పంచుకోకూడదని ఢిల్లీ హైకోర్టు వాట్సాప్ ను ఆదేశించింది. వాట్సాప్ ను ఫేస్ బుక్ సొంతం చేసుకున్నప్పటి నుంచి ఆ కంపెనీ డేటా ప్రొటక్షన్ చట్టాలను ఉల్లంఘిస్తుందని ఫేస్‌బుక్ పై ఏప్రిల్ నుంచి జర్మన్ అథారిటీలు నిషేధం విధించాయి. ఈ క్ర‌మంలో వాట్సాప్ దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌ల‌కు గ‌డ్డు కాలం త‌ప్పేలా లేదు. మ‌రి ఈ విష‌యంలో ఆ సంస్థ‌లు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top