ఎప్పటిలాగే ఈ హాట్ సమ్మర్లో హీట్ పెంచే ఐపీఎల్ టోర్నమెంట్ షురూ అయింది. ఇప్పటికే పలు మ్యాచ్‌లు జరగ్గా క్రికెట్ అభిమానులకు చాలినంత వినోదం లభించింది. ఇకపై జరగనున్న మ్యాచ్‌లలోనూ మరింత వినోదాన్ని వారు అందుకోనున్నారు. అయితే ఈ నెల 9వ తేదీన సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా టాస్ వేసే సమయంలో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. నిజానికి ఐపీఎల్లో ఇలా జరగడం ఇదే మొదటి సారి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
ఐపీఎల్ టోర్నమెంట్లో భాగంగా ఈ నెల 9వ తేదీన సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ వేసే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు తమ జట్టులో ఆడనున్న నలుగురు విదేశీ ఆటగాళ్లలో చివరి అతని పేరు గుర్తు రాలేదు. దీంతో మొదటి ముగ్గురు విదేశీ ఆటగాళ్ల పేర్లను చెప్పిన అతను చివరి ఆటగాడి పేరును మరిచిపోయాడు. ఈ క్రమంలో కల్పించుకున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్యా రహానే విలియమ్సన్కు ఆ పేరు గుర్తు చేశాడు. ఆ ఆటగాడి పేరు షకిబ్ అల్ హసన్ అని చెప్పడంతో విలియమ్సన్ నవ్వుతూ ఆ పేరు చెప్పేశాడు.
అయితే ఇలా ఓ జట్టుకు చెందిన కెప్టెన్ తమ జట్టు ప్లేయర్ పేరును మరిచిపోవడం ఐపీఎల్ లో ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. దీంతో టాస్ సందర్భంగా జరిగిన ఆ ఘటనకు చెందిన వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అయింది. అయితే తన పేరును తమ జట్టు కెప్టెన్ చెప్పడం మరిచిపోయినా షకిబ్ అల్ హసన్ మాత్రం అందుకు చింతించలేదు. పైగా మ్యాచ్‌లో కీలక సమయంలో రెండు వికెట్లు తీసి తమ జట్టు విజయంలో అద్భుతమైన పాత్ర పోషించాడు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ ప్లేయర్లు చాలా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించారు. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి సన్ రైజర్స్ హైదరాబాద్ 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. శిఖర్ ధావన్ 54 బంతుల్లో 73 పరుగులు, విలియమ్సన్ 35 బంతులు 36 పరుగులతో జట్టును విజయపథంలో నడిపించారు. దీంతో సోమవారం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది.