ఇంట్రస్టింగ్ రియల్ క్రైమ్ మిస్టరీ ఛేజింగ్ స్టోరి.

మాజీ డీజీపీ ఎ.కె.ఖాన్ చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ  కరీంనగర్ జిల్లాలో ఏఎస్పీగా పనిచేస్తున్నప్పుడు నేను ఛేదించిన ఒక కేసు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కరీంనగర్‌కి, వరంగల్‌కి సరిహద్దు ప్రాంతం తాడిచర్ల మండలం దగ్గర జరిగిన ఘటన అది. ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు కబురు వచ్చింది. దగ్గర్లోని అటవీ అధికారులపై జంతువులు దాడి చేసి చంపేశాయని. ఎక్కడో, ఏమిటో వివరాలు సరిగ్గా లేవు.

నేను, ముగ్గురు పోలీసులం జీపులో బయలుదేరాం. కొంతదూరం వెళ్లాక కాలినడకన ప్రయాణం మొదలుపెట్టాం. అమావాస్య రోజులు కావడంతో చిమ్మచీకటి. టార్చిలైట్ల వెలుతురులో అడుగులు వేసుకుంటూ వెళుతుంటే దారికడ్డంగా కొండచిలువ. దాని తలెక్కడుందో తెలీలేదు. మెల్లగా తప్పించుకుని ముందుకు వెళ్లాం. విషయం ఏంటంటే ఆ అడవి క్రూరమృగాలకు నెలవు. చిరుతపులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా ఉండేవి. పైగా వాటి ‘చేతిలో’ చనిపోయిన అధికారుల దేహాలను వెతకడానికి వెళుతున్నాం. భయం ఖాకీ చొక్కాకి ఉండదేమోగానీ ఆ చొక్కా లోపల ఉన్న మాకుంటుంది కదా!

రాత్రి రెండు గంటలకు…
ఓ రెండుగంటల కాలినడక ప్రయాణం తర్వాత అటవీ అధికారుల మృతదేహాలు కనిపించాయి. ఒళ్లంతా రక్కినట్టు ఉంది. పులి దాడిచేసిందనుకున్నాం. మృతదేహాలను అడవిని ఆనుకుని ఉన్న తండాకు తీసుకెళ్లాం. తెల్లారాక తిరిగి ఆ మృతదేహాలు దొరికిన సంఘటనా స్థలానికి వెళ్లాం. అంతకు ముందురోజు మేం నడిచిన ఆనవాళ్లతో సహా సంఘటనా స్థలంలో కూడా కొన్ని గుర్తులు కనిపించాయి. ముఖ్యంగా మృతదేహాలు దొరికిన చోటుకు నాలుగు అడుగుల దూరంలో ఎండ్లబండి చక్రాల గుర్తులు కనిపించాయి.
‘‘సార్, పులులు దాడి చేసి చంపి వుంటే ఇక్కడ ఈ ఎండ్లబండి చక్రాల ఆనవాళ్లేంటి? ఎవరో వీరిని చంపి ఇక్కడ పడేయలేదు కదా’’ అన్న మా కానిస్టేబుల్ మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి.

ఆ చక్రాల గుర్తులు ఎండ్లబండివే కానీ చక్రానికీ, చక్రానికీ మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆ ఎండ్లబండి అందరి దగ్గర ఉండే ఎండ్లబండి లాంటిది కాదు! వెంటనే ఆ చక్రాల మధ్య ఉన్న దూరాన్ని కొలిచి… చుట్టుపక్కల ఊళ్లలోకి వెళ్లి అలాంటి బండ్లు ఎక్కడున్నాయో తెలుసుకున్నాం. అడవి చుట్టుపక్కల పది ఊళ్లలో అలాంటి బండ్లు మూడు ఉన్నట్టు తెలిసింది.

10533233-Two-oxen-used-as-a-means-of-transport-pulling-a-cart-in-Cuba--Stock-Photo

రక్తపు చుక్కలు…
మూడు బండ్ల యజమానులను రప్పించి మాట్లాడాం. అధికారులు చనిపోయిన రాత్రి ఆ మూడు బండ్లు ఎక్కడున్నాయో సాక్ష్యాలతో చెప్పమన్నాం. రెండు బండ్ల సమాచారం బాగానే వచ్చింది కానీ మూడో బండి యజమాని చెప్పిన విషయాలు కాస్త తేడాగా అనిపించాయి. ‘‘అంతకు ముందురోజు మా పక్కూరి నుంచి బండి కావాలని వచ్చారు సార్. పైసలిస్తామన్నారు కదా అని ఇచ్చాను. మరి వాళ్లు దేనికి వాడుకున్నారో నాకు తెలీదు’’ అన్నాడు.

వెంటనే ఎండ్లబండిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎడ్లను కట్టే కాడెపై నాలుగైదు రక్తపు మరకలు కనిపించాయి. ఇవేమిటని అడిగితే బండిని వాడుకున్నవాళ్లు చెప్పిన సమాధానం నమ్మాలనిపించలేదు. ‘‘వేసవికాలం కదా సార్… ఎడ్ల ముక్కుల్లోంచి రక్తం కారుతుంది. వాటి మరకలేమో!’’ అన్నారు. వెంటనే ఆ కాడెపై ఎండిన రక్తం శాంపిల్స్‌ని సేకరించి హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించాం. వివరాలు వెంటనే పంపమని ప్రత్యేకంగా ఒక ఆఫీసర్‌ని పంపించాను.

A_K_Khan

సవాల్‌గా తీసుకున్నాను…
అడవిని రక్షించడం కోసం పనిచేస్తున్న అధికారులను హత్య చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ హత్యను మేం తేలిగ్గా తీసుకుంటే ఏకంగా అటవీశాఖా యంత్రాంగాన్నే చులకనగా చూస్తారు. అటవీ సంపదను దోచుకోవడానికి వచ్చే స్మగ్లర్ల నుంచి ప్రతి నిమిషం ప్రమాదం ఉంటుందని తెలిసి కూడా ధైర్యంగా పనిచేసే అధికారులపై చెయ్యివేసే ధైర్యం ఎవరికొచ్చిందని నా గుండె రగిలిపోతోంది. దాంతో ఈ కేసుని డిపార్ట్‌మెంట్ పరువు ప్రతిష్టల విషయంగా తీసుకున్నాను. ఏ గ్రామం వాళ్లయితే ఆ బండిని అద్దెకు తీసుకున్నారో అక్కడే ఒక వారంరోజులు తిష్టవేశాం.

ఎవరిని అడిగినా మాకేం తెలుసంటారు! ఒక్క బండిపై ఉన్న రక్తపు మరకలు తప్ప ఇంకే ఆధారాలూ దొరకలేదు. సంఘటనా స్థలంలో దొరికిన చిన్న చిన్న ఆధారాలు చేతిలో ఉన్నా అవి హంతకుల చిరునామాని చెప్పలేకపోయాయి. ఇంతలో హైదరాబాద్ నుంచి సమాచారం వచ్చింది. ఆ రక్తం ఎద్దుది కాదు మనిషిదని! అంతే విచారణ వేగం పెంచాం.

ఆ నలుగురు…
అటవీ అధికారుల్ని చంపింది పులులు, సింహాలు కాదనీ, మనుషులనీ స్పష్టమైన విషయాన్ని అన్ని గ్రామాల్లోని వారికి తెలియజేశాం. అయినా మేం తిష్టవేసిన గ్రామవాసుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఎవరూ కూడా అయ్యోపాపం అనలేదు. నాకు సందేహం వచ్చి ఓ నలుగురు కుర్రాళ్లను విచారిస్తే విషయం బయటపడింది. ఆ గ్రామస్తులే అధికారుల్ని హత్య చేశారని. వారిపై అనుమానం రాకుండా ఉండేందుకు అధికారుల శరీరంపై గోళ్లతో రక్కినట్టు చేశారు. కళ్ల గుడ్లని బయటికి తీసేశారు. అలా జంతువులే చేస్తాయనీ, వారిపై మాకు అస్సలు అనుమానం రాదనీ వారి నమ్మకం.

కాని మాకు విషయం తెలిసిపోయాక గ్రామస్తులంతా ఒకచోట కూడి మాకు జరిగిన విషయం చెప్పారు. అధికారులు వారి గ్రామస్థుల్ని బాగా ఇబ్బందిపెట్టేవారట. డబ్బులకోసం, అవసరమైన వస్తువుల కోసం వారిని వేధించేవారట. చాలా రకాలుగా అధికారులతో విసిగిపోయి, వారి పీడని వదిలించుకోవడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అడవిలోకి ఆవుల్ని తోలుకెళ్లినా, గొర్రెల్ని కొట్టుకెళ్లినా ఫైన్ కట్టమంటూ ఇబ్బంది పెట్టేవారనీ, వారితో ఇంకా ఏవో ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొన్నామనీ చెప్పుకొచ్చారు.

ఏదైతేనేం…
అధికారులు నిజంగా గ్రామస్థుల్ని ఇబ్బంది పెట్టారనుకోండి. దానికి పరిష్కారం ఇంత ఘోరంగా హత్యచేయడం కాదు కదా! పైగా ఎప్పుడూ మేం అందుబాటులో ఉంటాం. డిపార్ట్‌మెంటు ఉద్యోగులపై దాడి చేయడం అటవీశాఖలోనే కాదు, మా పోలీసుశాఖలో కూడా తీవ్ర కలకలం రేపింది. ఏ దుండగులో అంటే కాదు… గ్రామం మొత్తం ఏకమై చేసిన పని. హత్యలో ఎంతమంది పాల్గొన్నారని ఆరాతీస్తే మేమందరం అంటూ ఊరి ప్రజలంతా చేతులెత్తుతున్నారు. రెండుమూడు వందలమంది ఉంటారు. ఎవరినని అరెస్టు చేస్తాం. అయినా మా పద్ధతి ప్రకారం విచారణలో ఒక్కక్కరిని వదిలి అసలు హంతకుల పేర్లను రాబట్టాం.

అధికారులను వెంటాడినవారు, హత్య చేసినవారు, అనుమానం రాకుండా వారిపై గోళ్లగాట్లను పెట్టినవారు, ఎండ్లబండిపై తీసుకెళ్లి అక్కడ పడేసినవారు, చూసి కూడా తెలియనట్టు నటించినవారు… ఇలా హత్యలో పాల్గొన్న పాత్రధారులందరిని వేరు చేసి, వారిపై వేర్వేరు కేసులు పెట్టి సాక్ష్యాలను కోర్టుకి అప్పగించాం. కేసు విచారణ తర్వాత అందరికీ శిక్షలు పడ్డాయి. వారి వారి నేరాల్ని బట్టి అందరికీ పెద్ద శిక్షలే పడ్డాయి. ఇది జరిగిన నేటికి ముప్పైరెండేళ్లవుతోంది. కానీ ఇప్పటికీ క్రైమ్ అనగానే నా కళ్లముందు ఉండే కేస్ ఇది!

(_నరేష్ స్వేన)

Comments

comments

Share this post

scroll to top