భూమి పుత్రుడు..జ‌నం మెచ్చిన ధీరుడు – గుమ్మడి నర్సయ్య

ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు కోట్లు వెనకేసుకునే వ్యక్తులు ఎందరో మన కళ్ళ ముందు తారసపడతారు . హంగులు, ఆర్భాటాలు .మందీ ..మార్బలాలు ..బాడీగార్డులు ..వాహనాల కాన్వాయితో తమ రాజసాన్ని ప్రదర్శించే ప్రజా ప్రతినిధులు ఎందరో . కానీ ఆయన మాత్రం వెరీ వెరీ స్పెషల్ . సాదా సీదాగా ఉంటాడు . మనతో పాటే కలిసి తిరుగుతాడు . నిజం చెప్పాలంటే ఆయన అమ్మతనం . మట్టితనం కలబోసుకున్న ..సాధారణమైన ..అచ్చమైన భూమి పుత్రుడు . చేతికి ఓ సంచి . మాసి పోయిన గడ్డం .. చిరిగి పోయినట్టుండే చెప్పులు . ఓ డొక్కు సైకిల్ . ఇదీ ఆయన ఆహార్యం .

Gummadi Narasaiah

ఇంతగా చెబుతున్న ఆ మహానుభావుడు మన మధ్యనే వున్నాడు . కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యం .. కాసుల లోకంలో .. మాఫియాలు .. దగుల్భాజీలు .. రియల్టర్లు ..జైలు పాలైన వాళ్ళు ఊరేగుతున్న సమయంలో ఆయన మాత్రం తనకేమీ పట్టనట్లు జనమే జెండాగా ప్రజలే ఎజెండాగా సాగిపోతున్నాడు . ఇంతటి చరిత్ర వున్న ఆయనే ఖమ్మం జిల్లా ఇల్లేందు నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య . ఓ ఎంపీటీసీ పదవికి .. సర్పంచ్ పదవికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తే ఆయన మాత్రం ఒక్క పైసా తీసుకోకుండానే ఎమ్మెల్యేగా గెలుపొందారు . జనం ఆయనను దేవుడిలా కొలిచేలా తనను తాను మల్చుకున్నారు . పెద్ద ఆస్తిపాస్తులు లేవు . కేవలం అయిదో తరగతి మాత్రమే చదువుకున్నారు . ఆ పొలమే ఆయనకు ఆస్తి . ఆప్యాయంగా పలకరించే ప్రజలే తన స్థిరాస్తి అంటారు . పుట్టినప్పటి నుంచి కష్టాలే . పిడికెడు మట్టి మీద వున్నమమకారం శ్రామికుడిగా .. రైతుగా .. కూలీగా .. మార్చేసింది . తండ్రితో పాటే తాను పొలాన్ని హత్తుకున్నాడు .

1999 దాకా అంతా ఆ మట్టిలోనే . పని చేస్తున్నప్పుడు అడవి అమితంగా ఆకర్షించింది . అదే ఆయనను మార్చేసింది . ఆలోచించడం అన్నది ప్రకృతి ప్రసాదించిన వరం . దాని నుంచి మనం ఏమయినా నేర్చుకోవచ్చు . ఎప్పుడైనా స్ఫూర్తి పొందవచ్చు అంటారు . గడ్డం వెంకట్రామయ్య ఆదర్శ జీవితం నర్సయ్యను ప్రభావితం చేసింది . న్యూ డెమోక్రసి లో చేరారు . తనను తాను ఆయుధంగా తయారు చేసుకున్నారు . ఇక జనం కోసం పని చేయాలంటే ఏదో ఒకటి కావాల్సిందే . అదే ప్రజా సేవ .. దీని ద్వారానే ప్రజలకు సేవ చేయొచ్చని నమ్మారు . నమ్మకంగా పని చేశారు .

ఇంకేముంది అప్పటి నుంచి ఇప్పటి దాకా జనంలోనే వున్నారు . ఎవరికి ఏ ఆపద వచ్చినా .. ఏ కష్టం వచ్చినా సరే ఆయన ముందుంటారు . నర్సన్నా అని ప్రజలు నోరారా పిలుస్తారు . అంతగా ఎదిగి పోయారు . వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పదంటారు . ప్రజలే చరిత్ర నిర్మాతలు . వారే స్ఫూర్తిప్రదాతలు . .వాళ్ళు పార్టీని నన్ను కంటికి రెప్పలా చూసుకుంటారని చెబుతారు . 1994లో ఓటమి చెందినప్పుడు భాద పడలేదు . అన్ని పార్టీలు కలిశాయి . నన్ను టార్గెట్ చేశారు . ప్రజలు నన్నునమ్మారు . గెలిపించారు . వారి ఆటలు సాగలేదు . ఎన్ఠీఆర్ ఛరిస్మా లో సైతం తాను గెలుపొందారు . విజయం వరించినప్పుడు పొంగి పోలేదు . ఓడినప్పుడు కుంగి పోలేదు . ఇదంతా ప్రజల నుంచి నేర్చుకున్నాడు . యువత , మహిళలు , కూలీలు , రైతులు అంతా పార్టీని బతికిస్తున్నారంటాడు .

గెలుపు ఓటములు సహజం . పార్టీనే ముఖ్యం . పోరాటం చేయటమే ముందున్న సవాలు . అందరికి సమాన అవకాశాలు .. సమాన హోదా .. గౌరవంతో పాటు ప్రాథమిక మైన గాలి .. నీరు .. వైద్యం .. ఉపాధి వచ్చెనంత దాకా ఈ గమనం ఆగడు . మొదట్లో నాలుగు ఊర్లల్లో కరెంట్ ఉండేది . ఇప్పుడు అంతా వచ్చింది . తన ఒక్క నియోజకవర్గంలోనే 20 వేలకు పైగా ఎకరాలను పంపిణీ చేశారు . ఈ భూమి అందరిదీ ..ఇది ప్రతి ఒక్కరికి చెందాలి . ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నాయి .ఇది సామాజిక పరమైన నేరం . భూమి కావాలని కోరిన వాళ్లపై దాడులు చేస్తున్నారు . ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని అంటారు నర్సన్న . భూములను ,. వనరులను కొల్లగొట్టేందుకే నిర్బంధమైన చట్టాలు అమలు చేస్తున్నారని ఆవేదన చెందుతారు . నెలకు ఓ పది వేలు చాలు అంటారు బతకటానికి . ఇప్పటికీ వ్యవసాయమే జీవనాధారం . ఎమ్మెల్యేగా వున్నప్పుడు వచ్చిన జీతం .. ఒడి పోయాక పెన్షన్ డబ్బులన్నీ పార్టీకే ఇచ్చేస్తారు . ఇదీ ఆయనకున్న గొప్పతనం . ఎలాంటి ఆస్తులు .. వాహనాలు లేవు .

ఓ కొడుకును పోగొట్టుకున్నాడు . మరో కొడుకు పొలం పనుల్లో వుంటే ఇద్దరు కూతుర్లలో ఒకరు టీచర్ . మరొకరు ఉన్నత చదువులు చదివేలా చేశారు . గత ఎన్నికల్లో ఒడి పోయినా అలాగే జనం కోసం పని చేయటం మానలేదు .ప్ర‌జ‌ల కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఈ మాజీ ఎమ్మెల్యే ఇటీవ‌ల తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. విష‌యం తెలుసుకున్న జ‌నం వేలాదిగా చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రికి త‌ర‌లి వ‌చ్చారు. పెద్ద ఎత్తున ప్ర‌జాభిమానం పొందిన ఇలాంటి వ్య‌క్తి ఈ కాలంలో ఉండ‌డం తెలంగాణ చేసుకున్న పుణ్యం కాదంటారా.

Comments

comments

Share this post

scroll to top