ఆ యువ‌తి రోజూ పాలు అమ్ముతుంది. ఆ త‌రువాతే కాలేజీకి వెళ్తుంది..! ఇన్‌స్పైరింగ్ స్టోరీ..!

జీవితం అంటే అంతే… సుఖాలు, సంతోషాలు ఉంటాయి. క‌ష్టాలు, క‌న్నీళ్లు ఉంటాయి. కొంద‌రికి కొన్ని ముందుగానే ఎదుర‌వుతాయి. కొందరికి అస‌లు ఎదురు కావు. కొందరైతే ఎప్పుడూ క‌ష్టాల సుడిగుండంలోనే ఉంటారు. అయినా వారిలో చాలా త‌క్కువ మంది మాత్ర‌మే క‌ష్టాల‌ను ఎదుర్కొని ముందుకు సాగుతారు. ఇప్పుడు మేం చెప్ప‌బోయే యువ‌తి కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. ఎందుకంటే… చిన్న‌ప్ప‌టి నుంచి ఆమె ప‌డిన క‌ష్టం అటువంటిది మ‌రి. రోజూ క‌ష్టాలతో సావాసం చేస్తూనే త‌ను అనుకున్న ల‌క్ష్యం దిశ‌గా విజ‌య‌వంతంగా ముందుకు సాగుతోంది.

ఆమె పేరు నీతు. వ‌య‌స్సు 19 సంవ‌త్స‌రాలు. నీతుది పేద కుటుంబం. తండ్రి సంపాదించే అర‌కొర డ‌బ్బుతోనే వారు సంసారం నెట్టుకొచ్చేవారు. రెక్కాడితే గానీ డొక్కాడ‌ని ప‌రిస్థితి వారిది. ఇక ఆమె చ‌దువెలా సాగుతుంది. అందుకే ఆమె 8వ త‌ర‌గ‌తిలో ఉండ‌గా తండ్రి చెప్పాడు, చ‌దువు మానేయ‌మ‌ని. దీంతో నీతు షాక్‌కు గురైంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ చ‌దువుకోవాల్సిందేన‌ని, చ‌దువంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని, ద‌య చేసి చ‌దువు మాన్పించ‌వ‌ద్ద‌ని తండ్రిని వేడుకుంది. అయినా అత‌ను ఏం చేస్తాడు, అస‌లే పూట పూట‌కు క‌ష్ట‌ప‌డాల్సిన ప‌రిస్థితి వారిది. దీంతో తండ్రి బాధ‌ను ఆమె అర్థం చేసుకుంది. త‌న చ‌దువు భారాన్ని తండ్రిపై పెట్ట‌వ‌ద్ద‌ని, త‌న చ‌దువుక‌య్యే డ‌బ్బును తానే సంపాదించాల‌నుకుంది. అలాగే ముందుకు సాగింది.

తాను ఉంటున్న ఇంటికి 5 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఇండ్ల‌కు రోజూ నీతు పాల‌ను స‌ర‌ఫ‌రా చేసే ప‌ని వెదుక్కుంది. నిత్యం ఉద‌యాన్నే వేకువ జామున 4 గంట‌ల‌కు లేవ‌డం, పాల‌ను తీసుకెళ్లి కాలి న‌డ‌కన 5 కిలోమీట‌ర్ల వ‌ర‌కు న‌డిచి పాల‌ను పోయ‌డం, వెన‌క్కి వ‌చ్చి త‌యారై స్కూల్‌కు వెళ్ల‌డం… ఇదీ ఆమె దిన చ‌ర్య‌. అలా ఆమె తాను సంపాదించే డ‌బ్బుతోనే చ‌దువుకోడం మొద‌లు పెట్టింది. 10వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్ పూర్తి చేసింది. ఈ క్ర‌మంలో ఇటీవ‌లే బీఏలో జాయిన్ అయింది. మరో సర్టిఫికెట్ కోర్సులో కూడా ఆమె చేరింది. అయితే ఇప్పుడామె కాలిన‌డ‌కన వెళ్ల‌డం లేదు. తాను ఇన్ని రోజులు సంపాదించిన డ‌బ్బులో కొంత మొత్తంతో చిన్న లూనా కొనుగోలు చేసింది. దానిపైనే సొంతంగా పాల‌ను అమ్ముతోంది. ఇప్పుడు ఆమె నెల‌కు రూ.12వేల వ‌ర‌కు సంపాదిస్తోంది. త్వ‌ర‌లో బీఏ పూర్త‌యితే ఉద్యోగంలో చేరి త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డ‌తాన‌ని అంటోంది నీతు. ఆమె క‌లలు, ల‌క్ష్యాలు నెర‌వేరాల‌ని ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top