దేశంలో ఉన్న చెరువులు ఇక క్లీన్ అవుతాయి. కొత్త టెక్నాల‌జీని అభివృద్ధి చేసిన హైద‌రాబాద్ సైంటిస్టులు.

గుర్రపు డెక్క.. ఈ మొక్క అంటే తెలియనివారుండరు. ఇది ఎక్కువ‌గా చెరువులు, స‌రస్సుల‌పై పెరుగుతుంది. వాటిని మొత్తం ఆక్ర‌మిస్తుంది. ఈ క్రమంలో గుర్రపు డెక్క మొక్క‌లు నీటిలోని కాలుష్యకరమైన పదార్థాలను, హానికరమైన రసాయనాలను స్వీకరిస్తాయి. అయితే నీటిలోపలి ఆక్సిజన్‌ను కూడా గ్రహించడంతో చెరువు లోపలి భాగంలో పర్యావరణం దెబ్బతింటుంది. దీంతో ఇత‌ర మొక్క‌లు, జీవులు పెర‌గ‌వు. అంతే కాకుండా గుర్రపుడెక్క గ్రహించే కాలుష్య రసాయనాలు వేర్లస్థాయిలోనే ఉంటాయి. పైకి వెళ్లలేవు. దీంతో చెరువులు మొత్తం కాలుష్య‌మ‌యం అవుతాయి. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అనేక చెరువుల్లో ప‌రిస్థితి ఇలాగే ఉంది. అయితే ఇకపై చెరువుల‌కు ఈ దుస్థితి వ‌దిలిపోనుంది. ఎందుకంటే…

హైద‌రాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లోని సీఎస్‌ఐఆర్ ప్రయోగశాల, ఖార్ ఎనర్జీ ఆప్టిమైజర్ అనే సంస్థ‌ల సంయుక్త ఆధ్వ‌ర్యంలో Accelerated Anaerobic Composting (AAC) అనే కొత్త టెక్నాల‌జీని డెవ‌ల‌ప్ చేశారు. దీని వ‌ల్ల స‌ద‌రు గుర్ర‌పు డెక్క‌ను చెరువుల నుంచి తొల‌గించి దాన్ని రీసైకిల్ చేసి కంపోస్టు ఎరువుగా వాడుకునేందుకు వీలు క‌లుగుతుంది. ఈ ప‌ద్ధ‌తిలో మొద‌ట గుర్ర‌పు డెక్క‌ను చెరువు నుంచి తీసేస్తారు. వాటి వేర్ల‌ను, కాండాన్ని క‌ట్ చేస్తారు. కేవలం ఆకుల‌ను మాత్ర‌మే సేక‌రిస్తారు. అనంత‌రం దాన్ని పైన చెప్పిన ఏఏసీ ప‌ద్ధ‌తిలో కంపోస్టు ఎరువుగా మారుస్తారు. ఈ ఎరువుతో పంట‌లు చాలా బాగా పండుతాయి కూడా. దీని వ‌ల్ల అటు ప‌ర్యావ‌ర‌ణానికి కూడా ఇబ్బంది ఉండ‌దు.

అయితే ప్ర‌స్తుతం సైంటిస్టులు ఈ ప‌రిజ్ఞానాన్ని ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలిస్తున్నారు. హైద‌రాబాద్‌లో ఉన్న కాప్రా చెరువులో ఏఏసీ ప‌ద్ధ‌తిని ఉప‌యోగించి గుర్ర‌పు డెక్క ద్వారా కంపోస్టు ఎరువు త‌యారు చేస్తున్నారు. ఈ చెరువు మొత్తం 113 ఎక‌రాల్లో విస్త‌రించి ఉండ‌గా అందులో 80 ఎక‌రాల్లో గుర్ర‌పు డెక్క ఆవరించి ఉంది. దీంతో ఆ చెరువులో ఇప్పుడు ఏఏసీ టెక్నాల‌జీ ద్వారా గుర్ర‌పు డెక్క‌ను కంపోస్టు ఎరువుగా మారుస్తున్నారు. అందుకు వారికి 28 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌స్తుతం ఈ ఒక్క చెరువులోనే ఈ ప్రాజెక్టు కొనసాగుతున్న‌ప్ప‌టికీ త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లోని ఇత‌ర చెరువుల్లోనూ దీన్ని అమ‌లు చేయ‌నున్నారు. అవి స‌క్సెస్ అయితే ఇక దేశ వ్యాప్తంగా ఉన్న చెరువుల‌కు మ‌హ‌ర్ద‌శ ప‌ట్టిన‌ట్టే. అవి క్లీన్ అవుతాయి. ఇలాంటి టెక్నాల‌జీని అభివృద్ధి చేసినందుకు మ‌నం ఆ సైంటిస్టుల‌కు అభినంద‌న‌లు తెల‌పాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top